ఒక్కడే నదిని శుభ్రం చేశాడు.. ప్రపంచ స్థాయిలో గుర్తింపు

ఎలాంటి స్వచ్ఛంద సంస్థ సాయం లేకుండా ఒంటరిగా అజ్నార్ నదిని శుభ్రం చేసిన 21 ఏళ్ల బిట్టు తహి ప్రపంచస్థాయి గుర్తింపు పొందాడు. ది ఓషన్ క్లీనప్ సీఈఓ ఉద్యోగం ఆఫర్ చేశారు.

ఒక్కడే నదిని శుభ్రం చేశాడు.. ప్రపంచ స్థాయిలో గుర్తింపు
bittu-tabahi-cleaned-river-global-recognition-job-offer

ఎలాంటి స్వచ్ఛంద సంస్థ అండ లేకుండా.. ఎవరి సాయం ఆశించకుండా ఒక్కడే శ్రమించి కలుషితమైన నదిని శుభ్రం చేసిన ఓ యువకుడికి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించింది. రాజకీయ నాయకులు, ప్రకృతి ప్రేమికులతో పాటు బాలీవుడ్ నటి ప్రీతి జింటా వంటి సెలబ్రిటీలు సైతం అతడిని వ్యక్తిగతంగా కలిసి అభినందిస్తున్నారు. అంతేకాదు.. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రతిష్టాత్మక సంస్థ సీఈఓ స్వయంగా తమతో కలిసి పనిచేయాలంటూ ఆ యువకుడికి ఉద్యోగం ఆఫర్ చేయడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

‘తాను ఒక్కడినే మారితే ప్రపంచం మారదు’ అని భావించే యువతకు.. ఒక వ్యక్తి తలుచుకుంటే ఎంతటి మార్పు సాధ్యమో ఈ యువకుడు నిరూపించాడు. నదిని శుభ్రం చేసే క్రమంలో విషపూరితమైన పాములు ఎదురయ్యాయని, చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డానని అతడు వెల్లడించాడు.

మురుగునదిలా మారిన అజ్నార్

మధ్యప్రదేశ్‌లోని బియోర పట్టణం గుండా ప్రవహించే అజ్నార్ నది ఎన్నో ఏళ్లుగా చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి దుర్గంధం వెదజల్లేది. స్థానికంగా ఉన్న ఆలయానికి వెళ్లే భక్తులు నదిని చూసి ముక్కు మూసుకునే పరిస్థితి ఉండేది.

ఈ పరిస్థితిని గమనించిన 21 ఏళ్ల బీఎస్సీ విద్యార్థి సురేంద్ర సింగ్ చౌదరి అలియాస్ బిట్టు తబాహి.. 2026 జనవరి 26న నదిని శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాడు. యంత్రాలను అద్దెకు తీసుకొచ్చే స్థోమత అతని వద్ద లేకపోయినా.. సంకల్పం మాత్రం వెనక్కి తగ్గలేదు.

చేతిలో పార పట్టుకుని ఒంటరిగా నదిలోకి దిగాడు. చుట్టుపక్కల వారి విమర్శలను పట్టించుకోకుండా నిరంతరం శ్రమిస్తూ నదిలో పేరుకుపోయిన చెత్తను తొలగించడం ప్రారంభించాడు.

పాములు.. చర్మ సమస్యలు.. అయినా వెనక్కి తగ్గలేదు

నదిని శుభ్రం చేసే సమయంలో బిట్టుకు విషపూరితమైన పాములు కూడా కనిపించాయి. అంతేకాదు.. మురికి నీటిలో పనిచేయడం వల్ల చర్మంపై తీవ్ర దద్దుర్లు, దురద వంటి సమస్యలు ఎదురయ్యాయని అతడు చెప్పాడు. అయినప్పటికీ తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు.

రోజులు గడిచేకొద్దీ నదిలో పేరుకుపోయిన చెత్త తగ్గుతూ వచ్చింది. చివరకు నది రూపమే మారిపోయేలా బిట్టు తన శ్రమను కొనసాగించాడు.

సోషల్ మీడియాలో వైరల్

నదిని శుభ్రం చేయడానికి ముందు, ఆ తర్వాత తీసిన ఫొటోలను బిట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ‘బిఫోర్ అండ్ ఆఫ్టర్’ ఫొటోలు కాస్తా వైరల్‌గా మారడంతో అతడి శ్రమ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మొదట అతడిని విమర్శించిన వారే తర్వాత ఆశ్చర్యపోయారు. రాజకీయ నాయకులు, ప్రకృతి ప్రేమికులతో పాటు నటి ప్రీతి జింటా వంటి సెలబ్రిటీలు కూడా బిట్టును అభినందించారు.

రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు

బిట్టు ఒంటరి పోరాటం చూసి బియోరా మున్సిపల్ కార్పొరేషన్ కూడా స్పందించింది. జేసీబీ, రక్లైన్ వంటి యంత్రాలను పంపించి నది ప్రక్షాళనలో అతడికి సహకరించింది.

అంతేకాదు.. నదిలోకి చేరుతున్న మురుగునీటిని అడ్డుకునేందుకు రూ.14.77 కోట్ల వ్యయంతో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బిట్టు

స్థానికంగా ప్రారంభమైన బిట్టు తహి శ్రమ ఇప్పుడు ప్రపంచ స్థాయికి చేరింది. నెదర్లాండ్స్‌కు చెందిన ‘ది ఓషన్ క్లీనప్’ సంస్థ సీఈఓ బోయన్ స్లాట్ దృష్టిని కూడా ఈ ఘటన ఆకర్షించింది.

ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు, నదుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించే కార్యక్రమాలు నిర్వహిస్తున్న ‘ది ఓషన్ క్లీనప్’ సంస్థ.. బిట్టు చేసిన పనిని ప్రశంసించింది. బోయన్ స్లాట్ ఎక్స్ వేదికగా బిట్టును అభినందించడంతో పాటు తమతో కలిసి పనిచేయాలని ఉద్యోగ ఆఫర్ కూడా ఇచ్చారు.

మార్పు మన నుంచే మొదలవ్వాలి

వ్యవస్థను విమర్శిస్తూ కూర్చోవడం కంటే.. మార్పు కోసం మన వంతుగా అడుగు వేస్తే దాని ప్రభావం ఎంత దూరం వెళ్తుందో బిట్టు తబాహి చూపించాడు. ఒక్క వ్యక్తి సంకల్పం ఓ నదిని శుభ్రం చేయడమే కాదు.. మున్సిపల్ యంత్రాంగాన్ని కదిలించి, ప్రపంచ స్థాయి సంస్థ దృష్టిని ఆకర్షించేలా చేసింది.

మార్పు కోసం పెద్ద వ్యవస్థ అవసరం లేదు.. ముందడుగు వేసే ఒక్క మనిషి చాలు అనే విషయాన్ని బిట్టు కథ మరోసారి గుర్తుచేస్తోంది.

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »