ప్రపంచ ఆటోమొబైల్ రంగాన్ని దశాబ్దాలుగా శాసించిన జర్మనీకి చెందిన కార్ల దిగ్గజం వోక్స్‌వ్యాగన్ ఇప్పుడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కంపెనీ ఉనికిని కాపాడుకునేందుకు భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఏకంగా లక్ష మంది ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా జర్మనీలోని నాలుగు ప్రధాన ప్లాంట్ల కార్యకలాపాలను నిలిపివేసే అంశాన్ని కూడా కంపెనీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
వోక్స్‌వ్యాగన్ సీఈఓ ఒలివర్ బ్లూమ్ నాయకత్వంలో రూపొందుతున్న ఈ రిస్ట్రక్చరింగ్ ప్లాన్ ఆటోమొబైల్ రంగంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 15 శాతం మందిపై ఉద్యోగ కోతల ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే ప్రతి ఆరుగురిలో ఒకరు ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందన్నమాట.
జర్మనీలో ప్లాంట్ల మూసివేత?
జర్మనీలోని హానోవర్, జ్వికావ్ ప్లాంట్లతో పాటు లగ్జరీ కార్ల బ్రాండ్ ఆడీకి చెందిన నెకార్సుల్మ్ ప్లాంట్ కార్యకలాపాలను నిలిపివేసే అంశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. వోక్స్‌వ్యాగన్ దాదాపు 89 ఏళ్ల చరిత్రలో జర్మనీలోని ప్లాంట్‌ను శాశ్వతంగా మూసివేయడం ఇదే తొలిసారి కానుందని తెలుస్తోంది.
ఒకప్పుడు ప్రపంచ కార్ల మార్కెట్‌లో తిరుగులేని దిగ్గజంగా ఉన్న వోక్స్‌వ్యాగన్ ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి రావడానికి ప్రధాన కారణం మారుతున్న ఆటోమొబైల్ మార్కెట్‌గా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
చైనా నుంచి పెరిగిన పోటీ
వోక్స్‌వ్యాగన్‌కు కీలకమైన మార్కెట్లలో చైనా ఒకటి. అయితే అక్కడి స్థానిక ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు వేగంగా ఎదగడంతో పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా బీవైడీ వంటి సంస్థలు తక్కువ ధరల్లోనే అధునాతన ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తీసుకురావడంతో సంప్రదాయ కార్ల తయారీ సంస్థలకు పోటీ తీవ్రంగా మారింది.
ఒకప్పుడు చైనాలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్ల బ్రాండ్లలో వోక్స్‌వ్యాగన్ ముందంజలో ఉండేది. కానీ ఎలక్ట్రిక్ వాహనాల విప్లవంతో స్థానిక చైనా కంపెనీలు మార్కెట్‌ను వేగంగా ఆక్రమించాయి. దీంతో చైనాలో విదేశీ కార్ల వాటా గణనీయంగా తగ్గినట్లు సమాచారం.
తయారీ ఖర్చులూ మరో సమస్య
చైనా కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీకి తోడు జర్మనీలో పెరుగుతున్న విద్యుత్, కార్మిక వ్యయాలు వోక్స్‌వ్యాగన్‌పై అదనపు భారాన్ని మోపుతున్నాయి. తక్కువ ధరలకు ఎలక్ట్రిక్ కార్లను అందిస్తున్న చైనా కంపెనీలతో పోటీ పడాలంటే ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో కంపెనీ తన వ్యయాలను భారీగా తగ్గించుకునే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఐదేళ్ల పరిశోధన, అభివృద్ధి బడ్జెట్‌ను కూడా తగ్గించాలని యాజమాన్యం నిర్ణయించినట్లు సమాచారం.
ఉద్యోగుల ఆందోళన
వోక్స్‌వ్యాగన్ ఉద్యోగాల కోత, ప్లాంట్ల మూసివేత నిర్ణయాలపై జర్మనీలోని శక్తివంతమైన ఐజీ మెటల్ యూనియన్, వర్కర్స్ కౌన్సిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగాలను కాపాడేందుకు ఆందోళనలకు దిగుతున్నాయి. కంపెనీ తీసుకోబోయే నిర్ణయాలపై కార్మిక సంఘాలు, యాజమాన్యం మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
దిగ్గజ కంపెనీలకు హెచ్చరిక
ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్ ప్రస్తుతం కీలకమైన మార్పుల దశలో ఉంది. పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు వినియోగదారులు మారుతున్న సమయంలో టెక్నాలజీ, ధర, ఉత్పత్తి వ్యయాల్లో వెనుకబడితే ఎంతటి దిగ్గజ కంపెనీ అయినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని వోక్స్‌వ్యాగన్ పరిణామాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.
చైనా ఎలక్ట్రిక్ వాహన సంస్థల దూకుడు కొనసాగుతున్న నేపథ్యంలో యూరప్‌తో పాటు భారత్‌లోని ఆటోమొబైల్ కంపెనీలు ఈ పోటీని ఎలా ఎదుర్కొంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వోక్స్‌వ్యాగన్ తీసుకోబోయే నిర్ణయాలు ప్రపంచ ఆటోమొబైల్ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.
Also Read: UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!


