పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలపై కనిపిస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో నివసించే భారతీయులకు స్వదేశానికి తిరిగి రావడం ప్రస్తుతం కష్టసాధ్యంగా మారింది. విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో అనేక అంతర్జాతీయ రూట్లలో టికెట్ల ధరలను ఎయిర్‌లైన్స్ భారీగా పెంచాయి. దీంతో హైదరాబాద్‌కు చేరుకోవాలనుకునే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం విమాన టికెట్లు లభించడం కూడా కష్టంగా మారింది. అందుబాటులో ఉన్న కొద్దిపాటి సీట్లకు ఎయిర్‌లైన్స్ భారీ ధరలు వసూలు చేస్తున్నాయి. భారత్‌కు తిరిగి రావడానికి సాధారణంగా చెల్లించాల్సిన ధరల కంటే రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువ చార్జీలు చెల్లించాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఎయిర్‌లైన్స్ టికెట్లపై దాదాపు 200 శాతం వరకు అధిక ధరలు వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
200 శాతం పెరిగిన ధరలు
ఉదాహరణకు మార్చి 6న లండన్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ టికెట్ ధర సుమారు రూ.2.5 లక్షల వరకు పెరిగింది. సాధారణ పరిస్థితుల్లో ఈ రూట్‌లో టికెట్ ధర చాలా తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది రికార్డు స్థాయికి చేరింది. ఇదే పరిస్థితి గల్ఫ్ దేశాల నుంచి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం చేసే వారికి కూడా ఎదురవుతోంది. గత కొన్ని రోజులుగా గల్ఫ్ నగరాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే విమాన టికెట్ల ధరలు దాదాపు 200 శాతం వరకు పెరిగినట్లు ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు.
Also Read: రిటైర్మెంట్ బకాయిలు రాక ప్రాణాలు కోల్పోయిన ఏఆర్ ఎస్సై మైసయ్య: బాధ్యత ఎవరిది?
విమాన సర్వీసుల సంఖ్య తగ్గిపోవడం, అనేక రూట్లను మళ్లించడం, అలాగే కొన్ని మార్గాల్లో పూర్తిగా విమానాలు నిలిపివేయడం వల్ల ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేకుండా పోయాయి. అయితే ఒమన్ నుంచి నడుస్తున్న కొన్ని విమాన సర్వీసులు మాత్రం మస్కట్–హైదరాబాద్ మధ్య సాధారణ చార్జీలనే వసూలు చేస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో కొన్ని భారతీయ ఎయిర్‌లైన్స్ మాత్రం ఇదే రూట్‌లో టికెట్ల ధరలను మూడు రెట్లు వరకు పెంచుతున్నట్లు ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు.
రద్దీ పెరగడం వల్లనే…
విమానాల సీటింగ్ సామర్థ్యం తగ్గిపోవడం, కొన్ని సర్వీసులు పూర్తిగా రద్దు కావడం, ప్రయాణికుల రద్దీ పెరగడం వంటి కారణాల వల్లే టికెట్ల ధరలు ఒక్కసారిగా పెరిగాయని నిపుణులు చెబుతున్నారు. పలు దేశాల్లో గగనతలాలు మూసివేయడం వల్ల విమానాలు పొడవైన మార్గాల్లో ప్రయాణించాల్సి రావడం కూడా దీనికి మరో కారణంగా పేర్కొంటున్నారు.
ఇక గల్ఫ్ ప్రాంతంలోని విమానాశ్రయాల్లో కూడా భారీ స్థాయిలో విమానాల రద్దు కొనసాగుతోంది. ముఖ్యంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో పెద్ద ఎత్తున విమానాల రద్దు జరిగింది. ఇప్పటివరకు అక్కడి నుంచి బయల్దేరాల్సిన 259 ఫ్లైట్ డిపార్చర్లు, 278 ఫ్లైట్ అరైవల్స్ రద్దయ్యాయి. ఇదే పరిస్థితి అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, బెన్ గురియన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, క్వీన్ అలియా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో కూడా కనిపిస్తోంది.
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతున్నంత వరకు విమాన సర్వీసులు పూర్తిగా సాధారణ స్థితికి రావడం కష్టమని నిపుణులు భావిస్తున్నారు. దీంతో విదేశాల్లో ఉన్న భారతీయులు స్వదేశానికి రావడానికి మరికొంతకాలం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండొచ్చని ట్రావెల్ రంగ నిపుణులు చెబుతున్నారు.