క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడంలో నిర్లక్ష్యం… వినియోగదారుడికి రూ.3.21 లక్షల పరిహారం!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడంలో ఆలస్యం చేసిన బ్యాంక్‌పై ఫిర్యాదు చేసిన వినియోగదారుడికి ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం రోజువారీ పరిహారం లెక్కించి మొత్తం రూ.3.21 లక్షలు జమయ్యాయి.

Credit Card Closure Compensation
Credit Card Closure Compensation

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ కొట‌క్ మ‌హింద్రా బ్యాంక్ నిర్లక్ష్యం కారణంగా ఓ క్రెడిట్ కార్డు వినియోగదారుడికి ఏకంగా రూ.3.21 లక్షల పరిహారం లభించిన సంఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. తనకు ఎదురైన అనుభవాన్ని వినియోగదారుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌ లో పంచుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అసలు ఏమైంది?

సంబంధిత వినియోగదారుడు 2025 మే నెలలో తన వద్ద ఉన్న రెండు క్రెడిట్ కార్డులను మూసివేయాలని బ్యాంకుకు ఈమెయిల్ ద్వారా అభ్యర్థించారు. బ్యాంకు అకస్మాత్తుగా తన క్రెడిట్ లిమిట్‌ను రూ.1 లక్ష నుంచి రూ.10,000కు తగ్గించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అయితే ఈమెయిల్‌కు ఎలాంటి స్పందన రాకపోవడంతో, మరో రెండు సార్లు రిమైండర్లు పంపినా బ్యాంకు నుంచి స్పందన రాలేదు. దీంతో విషయం అక్కడితో ఆగిపోయింది.

ఏడాది తర్వాత షాక్

దాదాపు సంవత్సరం తర్వాత 2026 ఏప్రిల్‌లో తన ఖాతాను పరిశీలించినప్పుడు, వార్షిక రుసుము పేరుతో రూ.1,180 ఛార్జ్ చేసినట్లు వినియోగదారుడు గుర్తించారు. దీనిపై బ్యాంకును సంప్రదించగా, కార్డులు ఇంకా యాక్టివ్‌లోనే ఉన్నాయని సమాధానం ఇచ్చారు.

అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు

బ్యాంకు వైఖరితో విసిగిపోయిన వినియోగదారుడు, నేరుగా బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాంకు నోడల్ అధికారి స్పందిస్తూ, “ఈమెయిల్ ద్వారా కార్డు క్లోజర్ అభ్యర్థనలు స్వీకరించబడవు, కాల్ చేయాల్సింది” అంటూ మొదట వినియోగదారుడిపైనే తప్పు మోపడానికి ప్రయత్నించారు.

అయితే బాధితుడు తన వద్ద ఉన్న ఈమెయిల్ ఆధారాలను సమర్పించి, తాను రాతపూర్వకంగా అభ్యర్థన ఇచ్చినట్టు స్పష్టం చేశారు.

ఆర్‌బీఐ నిబంధనలు ఎలా పనిచేశాయి?

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, క్రెడిట్ కార్డు క్లోజ్ చేయడంలో ఆలస్యం జరిగితే రోజుకు రూ.500 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ కేసులో రెండు కార్డులు ఉండటంతో రోజుకు రూ.1,000 చొప్పున 321 రోజుల జాప్యానికి గాను మొత్తం రూ.3,21,000 పరిహారం లెక్కించారు.

చివరికి భారీ పరిహారం

అంబుడ్స్‌మన్ జోక్యంతో కేసు బ్యాంకుకు వ్యతిరేకంగా మారడంతో, కొద్ది రోజులకే వినియోగదారుడి ఖాతాలో రూ.3,21,000 జమ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే రెడిట్‌లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.

నెటిజన్ల స్పందన

ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ, సరైన మార్గంలో పోరాడితే న్యాయం దొరుకుతుందనే మంచి ఉదాహరణగా అభివర్ణిస్తున్నారు. వినియోగదారుల హక్కులపై అవగాహన పెంచే ఘటనగా కూడా దీనిని చర్చిస్తున్నారు.

బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల వినియోగదారులు నష్టపోయే సందర్భాలు ఉన్నప్పటికీ, ఆర్‌బీఐ నిబంధనలు మరియు అంబుడ్స్‌మన్ వంటి వ్యవస్థలు వినియోగదారులకు న్యాయం చేయగలవని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.

Also Read:

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »