- ముంబై సామాన్య మహిళ vs మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ – బీజేపీ మహిళా సంకల్ప ర్యాలీ నేపథ్యంలో
- ర్యాలీ వల్ల ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌పై మహిళ తీవ్ర ఆగ్రహం – “రోడ్లు మూసేస్తే జనం బతకాలెలా?” అని నిలదీత
ముంబై వర్లీ ప్రాంతం – వందలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోయిన సంఘటన
ముంబై వీధుల్లో ఒక సామాన్య మహిళ చేసిన ధైర్యమైన పని ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ మంత్రి గిరీష్ మహాజన్ నేతృత్వంలో వర్లీ ప్రాంతంలో నిర్వహించిన మహిళా సంకల్ప ర్యాలీ కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటల తరబడి వాహనంలో చిక్కుకుపోయిన ఒక మహిళ – తన పిల్లాడిని పికప్ చేసుకోవాలని హడావిడిపడుతున్న ఆమె – నేరుగా మంత్రి దగ్గరకు వెళ్లి అందరి ముందు ఆయన్ను నిలదీసింది.
“మీ ర్యాలీలేవో గ్రౌండ్‌లో చేసుకోండి. రోడ్లు మూసేసి జనాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? వందలాది వాహనాలు నిలిచిపోయాయి – ముందు ఇక్కడి నుండి వెళ్లిపోండి” అని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి ఎదురుగా నిలబడి, సెక్యూరిటీ అడ్డుపడినా వెనక్కు తగ్గకుండా మాట్లాడిన ఆమె ధైర్యం సోషల్ మీడియాలో వేలాది మందిని స్పందింపజేసింది. “హేట్సాఫ్ టు దిస్ వుమన్” అనే కామెంట్లు వెల్లువెత్తాయి.
ఇది కేవలం ట్రాఫిక్ కోపం మాత్రమే కాదు
ఈ సంఘటన ఒక్క ట్రాఫిక్ జామ్‌కు పరిమితమైన కోపం కాదు. రాజకీయ పార్టీలు – ఏ పార్టీ అయినా సరే – ఎన్నికల ర్యాలీలు, నిరసన సభలు, పాదయాత్రల పేరుతో రోడ్లు మూసేసి సామాన్య జనాన్ని గంటల తరబడి ట్రాఫిక్‌లో నిలిపే సంస్కృతిపై పేరుకుపోయిన ఆగ్రహానికి ఇది గొంతు వచ్చింది. ఆ మహిళ మాట్లాడింది తన కోసమే కాదు – రోడ్లపై చిక్కుకుపోయిన ప్రతి సామాన్యుడి తరఫున మాట్లాడింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇది సాధ్యమా?
ముంబై వీడియో చూస్తే మనకు అప్రయత్నంగా ఒక ప్రశ్న మనసులో మెదులుతుంది – తెలుగు రాష్ట్రాల్లో ఇలా ప్రశ్నించే పరిస్థితి ఉందా?
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఒక సంఘటన దానికి సమాధానం చెప్తుంది. ఒక ఆలయంలో జరుగుతున్న అవినీతిపై ఒక ఎన్నారై మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రశ్నించడానికి ఆమె పెట్టిన మూల్యం ఏమిటంటే – స్వయంగా ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఆమెపై కేసు పెడతామని బెదిరించారు. అంతటితో ఆగలేదు – ఆమెపై ఒత్తిడి తెచ్చి వీడియో తీయించారు. ఆ వీడియో షేర్ చేసిన ప్రతి ఒక్కరిచేత తొలగించేలా చేశారు. ఆ వీడియో అప్‌లోడ్ చేసిన ప్రతి యూట్యూబ్ చానెల్‌కూ స్ట్రయిక్ కొట్టించారు.
ఒక సామాన్య పౌరుడు నిజాయితీగా ప్రశ్నిస్తే జరిగేది ఇది. ఇలాంటి వాతావరణంలో ఇంకొకరు ధైర్యంగా మాట్లాడగలరా?
ర్యాలీతో ట్రాఫిక్ జామ్.. మంత్రిపై మహిళ ఫైర్!
ముంబైలో BJP మహిళా సంకల్ప ర్యాలీ వల్ల ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ఒక సామాన్య మహిళను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. బిడ్డను పికప్ చేసుకోవడానికి వెళ్తున్న ఆమె గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ర్యాలీలో ఉన్న మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్… pic.twitter.com/o73ZJdzZ81
— ChotaNews App (@ChotaNewsApp) April 22, 2026
ప్రజాస్వామ్యం అంటే ఏమిటి?
ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుంది – రాజ్యాంగం అది ఇచ్చింది. కానీ ఆచరణలో ఆ హక్కు వినియోగించే వారికి బెదిరింపులు, కేసులు, సోషల్ మీడియా సెన్సార్‌షిప్ ఎదురవుతున్నాయి. ముంబై మహిళ చేసింది అసాధారణమైన పని కాదు – అది ప్రతి పౌరుడు చేయగలిగేదే. కానీ చేయలేని వాతావరణం చాలా చోట్ల నెలకొని ఉంది.
రాజకీయ నాయకులు రోడ్లు మూసేసినప్పుడు, అవినీతి జరుగుతున్నప్పుడు, హక్కులు హరించినప్పుడు – నిలదీసే గొంతు లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది? ముంబై మహిళ చూపించిన ధైర్యం కేవలం వైరల్ వీడియో కాదు – అది ప్రతి పౌరుడికి స్ఫూర్తి.
Also Read:
