యువ‌కుడికి డ్ర‌గ్స్ ఇచ్చి కిడ్నాప్.. బలవంతపు పెళ్లి చేయబోగా ర‌క్షించిన పోలీసులు

బిహార్‌లో బలవంతపు వివాహాల వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఉద్యోగానికి సిద్ధమవుతున్న యువకుడిని కిడ్నాప్ చేసి కొట్టి, మత్తు మందులు ఇచ్చి ఆలయంలో పెళ్లి చేసిన ఘటన సమస్తీపూర్ జిల్లాలో కలకలం రేపుతోంది.

Pakadwa Vivah Case in Bihar – Forced Marriage Incident in Samastipur
Pakadwa Vivah Case in Bihar – Forced Marriage Incident in Samastipur

బిహార్ రాష్ట్రంలో అప్పుడప్పుడూ వినిపించే ‘పకడ్వా వివాహ్’ (బలవంతపు పెళ్లి) ఘటనలు మరోసారి వార్తల్లోకి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా మంచి విద్యార్హతలు కలిగిన యువకులను లక్ష్యంగా చేసుకుని బలవంతంగా పెళ్లిళ్లు చేయడం అక్కడ కొంతకాలంగా సమస్యగా మారింది. తాజాగా సమస్తీపూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటన ఈ దుష్ప్రవర్తన మళ్లీ చర్చనీయాంశంగా మారేలా చేసింది. వివరాల్లోకి వెళితే… సమస్తీపూర్ జిల్లా జోడి పఖర్ గ్రామానికి చెందిన నితీశ్ కుమార్ బిహార్ పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సిద్ధమవుతూ శిక్షణ పొందుతున్నాడు. అతడిని తమ ఇంటి అల్లుడిగా చేసుకోవాలని చక్‌రాజా అలీ గ్రామానికి చెందిన శంకర్ రాయ్ కుటుంబం ముందే నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే నితీశ్‌కు ఈ విషయంపై ఎలాంటి అవగాహన లేకపోయినప్పటికీ, అతడిని బలవంతంగా పెళ్లి చేసేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కిడ్నాప్ చేసి..

ఈ నెల 7వ తేదీన నితీశ్ లైబ్రరీకి వెళ్తున్న సమయంలో శంకర్ రాయ్ కుటుంబ సభ్యులు అతడిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం అతడిపై దాడి చేసి, మత్తు మందులు ఇచ్చి మోర్వా ప్రాంతంలోని ఓ ఆలయానికి తీసుకెళ్లి శంకర్ రాయ్ కుమార్తె లక్ష్మీ కుమారితో బలవంతంగా వివాహం జరిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెళ్లి అనంతరం నితీశ్‌ను కొంతసేపు ఇంట్లోనే నిర్బంధించి ఉంచినట్లు విచారణలో వెల్లడైంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వీడియోను గమనించిన సమస్తీపూర్ పోలీసులు వెంటనే శంకర్ రాయ్ ఇంటికి చేరుకుని నితీశ్‌ను రక్షించారు. అనంతరం అతడిని ప్రశ్నించగా, తనను కిడ్నాప్ చేసి బెదిరించి బలవంతంగా పెళ్లి చేశారని వివరించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అక్క‌డ కామ‌నే..

బిహార్‌లో ‘పకడ్వా వివాహ్’ ఘటనలు కొత్తవేమీ కావు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యువకులు లేదా ఉన్నత విద్యావంతులను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతున్నట్లు గతంలో అనేక సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. 2009 సంవత్సరంలోనే రాష్ట్రవ్యాప్తంగా 1,224 బలవంతపు పెళ్లిళ్లు నమోదైనట్లు పాత నివేదికలు సూచిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆయుధాలతో బెదిరించి, కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకువచ్చి పెళ్లిళ్లు జరిపించిన ఉదంతాలు కూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »