తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో పొత్తులపై ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ మరియు తమిళ వెట్రి కళగం (టీవీకే) మధ్య పొత్తు కుదిరే అవకాశాలపై జాతీయ మీడియాలో పలు కథనాలు రావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా స్పష్టత ఇచ్చారు.
కొన్ని మీడియా కథనాల ప్రకారం, టీవీకే అధినేత విజయ్‌ను ఎన్డీయే కూటమిలోకి తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీకి సుమారు 80 సీట్లు కేటాయించే ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి.
క్లారిటీ ఇచ్చిన పవన్
ఇదే సమయంలో, విజయ్‌ను ఎన్డీయే కూటమిలో చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వం చేస్తున్నారనే వార్తలు కూడా తమిళనాడు రాజకీయ వర్గాల్లో వినిపించాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓ తమిళ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించారు.
Also Read: ఢిల్లీ లిక్కర్ కేసు మళ్లీ హాట్ టాపిక్… కేజ్రీవాల్, కవితలకు హైకోర్టు నోటీసులు
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, టీవీకే అధినేత విజయ్‌ను ఎన్డీయే కూటమిలో చేర్చే విషయంపై తనవైపు నుంచి ఎలాంటి ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై వస్తున్న వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని చెప్పారు. “విజయ్‌ను ఎన్డీయేలో చేర్చాలని నేను ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అసలు ఆయనను కలిసి కూడా దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలు అయింది. ఈ ప్రచారం ఎలా మొదలైందో నాకు తెలియదు” అని పవన్ వ్యాఖ్యానించారు.
అది ఆయన వ్యక్తిగతం
అలాగే విజయ్ రాజకీయ నిర్ణయాలు ఆయన వ్యక్తిగత విషయమని, ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని పవన్ కళ్యాణ్ తెలిపారు.ఇక దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనుండగా, మే 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటికే ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా మారుతుండగా, కొత్తగా రాజకీయ రంగంలోకి వచ్చిన టీవీకే పార్టీ పాత్ర కూడా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తుపై వస్తున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
సినిమాలతోనూ బిజీ
నటుడిగాను, రాజకీయాలతో పవన్ బిజీ బిజీగా ఉంటున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఉగాది కానుకగా మూవీని విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. గత రాత్రి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి.