Ujjwala Scheme | ఉజ్వల పథకం వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. దేశంలో వంటగ్యాస్ ధరలు, సబ్సిడీ విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కమర్షియల్, డొమెస్టిక్ వినియోగదారులపై వరుసగా భారం పెంచిన ప్రభుత్వం.. తాజాగా ‘ఉజ్వల’ పథకం లబ్ధిదారులకూ సబ్సిడీ పరిమితిని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక ఒత్తిడి పడే అవకాశం ఉన్నది. ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ సమావేశంలో పెట్రోలియం శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖన్నూజా ఈ మార్పులను ప్రకటించారు. ఇప్పటివరకు సంవత్సరానికి గరిష్ఠంగా తొమ్మిది సిలిండర్లకు ఒక్కో సిలిండర్‌పై రూ.300 చొప్పున సబ్సిడీ అందుతుండగా.. ఇకపై ఈ పరిమితిని నాలుగు సిలిండర్లకు తగ్గించినట్లు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ధరలు, పశ్చిమాసియా ప్రాంతంలోని భౌగోళిక ఉద్రిక్తతలు ఈ నిర్ణయానికి కారణమని పేర్కొన్నారు.
సబ్సిడీ విధానంలో మార్పులు
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం ఒక్క ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1600కుపైగా ఉండగా, దేశీయంగా డొమెస్టిక్ వినియోగదారులకు సగటున రూ.962కే అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉజ్వల లబ్ధిదారులకు అదనంగా రూ.300 ప్రత్యక్ష సబ్సిడీ నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతోంది. దీంతో వారి కోసం సిలిండర్ ధర సుమారు రూ.692కి తగ్గుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటివరకు కేంద్రం ప్రత్యక్ష, పరోక్ష సబ్సిడీల రూపంలో ప్రతి ఉజ్వల కుటుంబానికి భారీ సాయాన్ని అందిస్తోంది. అయితే ఇకపై సంవత్సరానికి గరిష్ఠంగా నాలుగు సిలిండర్లకే రూ.300 చొప్పున సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించడంతో మొత్తం వార్షిక సహాయం రూ.1200కే పరిమితమవుతుంది. ఎల్పీజీ ధరల పెరుగుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్ ఫిబ్రవరిలో టన్నుకు 543 డాలర్లుగా ఉండగా, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల అనంతరం ఏప్రిల్ నాటికి అది 775 డాలర్లకు చేరినట్లు వివరించారు. జూన్ నాటికి ఈ ధర దాదాపు 790 డాలర్లకు పెరిగిందని, కొన్ని నెలల్లోనే సుమారు 46 శాతం వరకు పెరుగుదల నమోదైనట్లు గణాంకాలు చూపుతున్నాయి. ఈ ధరల ఒత్తిడి దిగుమతులపై ప్రభావం చూపుతుండటంతో సబ్సిడీ భారాన్ని తగ్గించక తప్పని పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
10 కోట్లకుపైగా ఉజ్వల కనెక్షన్లు
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 10 కోట్లకుపైగా ఉజ్వల కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. గ్రామీణ, పేద కుటుంబాలకు శుభ్రమైన ఇంధనం అందించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటివరకు పెద్ద మొత్తంలో సబ్సిడీ అందుతోంది. అయితే, తాజా నిర్ణయం నేపథ్యంలో లబ్ధిదారులపై ఖర్చు భారం కొంత పెరగనుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. మొత్తంగా పెరుగుతున్న అంతర్జాతీయ ఇంధన ధరలు దేశీయ సబ్సిడీ విధానాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయంగానూ, సామాజికంగానూ చర్చకు దారితీసే అవకాశం ఉంది.


