ఎం-6 టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి.. రూ.6ల‌క్ష‌ల కోట్లు ఇవ్వాలి : నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్

నీతి ఆయోగ్ (NITI Aayog) గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దేశంలోని ఆరు ప్రధాన మహానగరాల అభివృద్ధి కోసం ‘ఎం-6 టాస్క్‌ఫోర్స్’ (M-6 Task Force) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. హైదరాబాద్ (Hyderabad) సహా ఆరు నగరాలకు రూ.6 లక్షల కోట్ల ప్రత్యేక నిధి కేటాయించాలని కోరుతూ తెలంగాణ (Telangana) అభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Revanth Reddy Pitches M-6 Task Force for Growth of Six Major Indian Cities

CM Revanth Reddy | దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజన్లుగా ఉన్న ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఎం-6 టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. ఈ ఆరు మహానగరాల అభివృద్ధి కోసం రూ.6 లక్షల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించి, ఒక్కో నగరానికి రూ.1 లక్ష కోట్ల చొప్పున అందించాలని సూచించారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి దేశ అభివృద్ధి, వికసిత్ భారత్-2047 లక్ష్యాల సాధనపై తన అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి నమూనాను వివరిస్తూ పలు ప్రతిపాదనలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

ఐఐఎం ఏర్పాటుకు స‌హ‌కారం అందించాలి

తెలంగాణ సమగ్రాభివృద్ధికి రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ నది పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు, సెమీకండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు వంటి అంశాల్లో కేంద్ర సహకారం అందించాలని కోరారు. దేశ ప్రగతికి విద్య, వైద్యం బలమైన పునాదులని పేర్కొన్న ముఖ్యమంత్రి, ప్రతి విద్యార్థికి, ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య, మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటేనే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించవచ్చని అన్నారు. దేశ అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధేనని, ప్రజలను ఆర్థిక శక్తులుగా, దేశ నిర్మాతలుగా తీర్చిదిద్దడంలో విద్య, ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (ఎస్‌ఈఈఈపీసీ)లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3.55 కోట్ల మంది, 242 కులాలకు చెందిన ప్రజల వివరాలను సేకరించిన ఈ సర్వేలో భూమి కంటే విద్యే సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రభావితం చేస్తున్న ప్రధాన అంశంగా తేలిందన్నారు. అందుకే ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని చెప్పారు.

విద్యా విప్ల‌వానికి శ్రీ‌కారం..

విద్యాశాఖను స్వయంగా తానే నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించిన సీఎం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తూ విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ తరగతులు, ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, పాఠశాల బస్సులు, క్రీడా సౌకర్యాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని వివరించారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్‌లో చదివే అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు కులాల మధ్య గోడలను కూల్చివేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గంలో ఈ పాఠశాలలను ఏర్పాటు చేస్తూ సమాజంలో సమానత్వాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. దేశంలోని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు తెలంగాణలోని యంగ్ ఇండియా స్కూళ్లను సందర్శిస్తే స్వాగతిస్తామని అన్నారు. ఏఐ యుగంలో యువతకు కొత్త నైపుణ్యాలు అవసరమని పేర్కొన్న సీఎం, తయారీ, సేవారంగాల్లో భారీ ఉపాధి అవకాశాల సృష్టికి రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్వే, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. యువతకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్రా, శ్రీనిరాజు తదితరులు యూనివర్సిటీ నిర్వహణలో భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు.

టాటా టెక్నాల‌జీ స‌హ‌కారంతో..

టాటా టెక్నాలజీస్ సహకారంతో రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను ఆధునిక సాంకేతిక శిక్షణ కేంద్రాలుగా మార్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇందుకు టాటా సంస్థ రూ.2,100 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించారు. ‘తెలంగాణ రైజింగ్’ విజన్‌లో భాగంగా 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఉన్నత విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌ల అభివృద్ధికి తెలంగాణ కేంద్రంగా మారుతోందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్, ఐఎస్‌బీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఉన్నాయని గుర్తుచేస్తూ, హైదరాబాద్‌కు ఐఐఎం కూడా రావాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తెలంగాణకు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటు ఆ దిశలో తొలి విజయమని తెలిపారు. దేశ ప్రజల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి పెడితే ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా భారత్ అవతరిస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »