భారతదేశంలోని ప్రముఖ మ్యూచువల్ ఫండ్ సంస్థలలో ఒకటైన యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా యాక్సిస్ నిఫ్టీ లార్జ్ మిడ్‌క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. నిఫ్టీ లార్జ్ మిడ్‌క్యాప్ 250 టీఆర్ఐ పనితీరును అనుసరించే ఈ ఓపెన్-ఎండెడ్ పథకం, ట్రాకింగ్ ఎర్రర్‌కు లోబడి ఆ సూచీ పనితీరును ప్రతిబింబించేలా రూపొందించారు. లార్జ్ క్యాప్ , మిడ్‌క్యాప్ షేర్లలో 50:50 నిష్పత్తిలో మొత్తం 250 కంపెనీలలో పరోక్షంగా పెట్టుబడి పెట్టే అవకాశాన్ని ఈ ఫండ్ పెట్టుబడిదారులకు కల్పిస్తుంది. ఈ కొత్త ఫండ్ ఆఫర్ నవంబర్ 27, 2026న ప్రారంభమై డిసెంబర్ 11, 2026న ముగుస్తుంది.
పథకం ముఖ్య వివరాలు..
ఈ పథకానికి నందిక్ మల్లిక్, రోహిత్ గౌతమ్ ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. కనీస పెట్టుబడి మొత్తం రూ.100గా నిర్ణయించగా, ఆ తర్వాత రూ.1 గుణిజాలలో పెట్టుబడి పెట్టవచ్చు. కేటాయింపు తేదీ నుండి 15 రోజులలోపు విత్‌డ్రా చేసినా లేదా స్విచ్ అవుట్ చేసినా 0.25 శాతం ఎగ్జిట్ లోడ్ వర్తిస్తుంది, ఆ తర్వాత ఎలాంటి రుసుము ఉండదు.
నిఫ్టీ లార్జ్ మిడ్‌క్యాప్ 250 సూచీ ప్రత్యేకతలు..
నిఫ్టీ 100 నుండి 100 కంపెనీలు, నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 నుండి 150 కంపెనీలతో కూడిన ఈ సూచీ, దేశ లిస్టెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో సుమారు 75 శాతం వాటాను కలిగి ఉంటుంది. లార్జ్ క్యాప్ , మిడ్‌క్యాప్ విభాగాల మధ్య 50:50 కేటాయింపును నిలబెడుతూ, ప్రతి మూడు నెలలకు ఒకసారి వెయిటేజీని సమతుల్యం చేసేలా దీనిని రూపొందించారు. ఒకే పెట్టుబడి సాధనం ద్వారా వివిధ రంగాలు, మార్కెట్ క్యాపిటలైజేషన్ విభాగాలలో అవకాశాలను అందిపుచ్చుకునేలా ఇది పనిచేస్తుంది. అక్టోబర్ 30, 2026 నాటికి ఇందులోని టాప్ 10 షేర్ల వాటా సుమారు 22 శాతంగా ఉంది, ఇది నిఫ్టీ 100లో 43 శాతం, నిఫ్టీ 50లో 53 శాతంతో పోలిస్తే తక్కువగా ఉండటం వల్ల ఏకాగ్రత రిస్క్ తగ్గుతుంది. అక్టోబర్ 30, 2026తో ముగిసిన పదేళ్ల కాలంలో ఈ సూచీ 13.8 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయగా, ఇదే కాలంలో నిఫ్టీ 100 సూచీ 11.7 శాతం, నిఫ్టీ 50 సూచీ 11.6 శాతం వృద్ధిని సాధించాయి. గత పనితీరు భవిష్యత్తులోనూ కొనసాగుతుందని చెప్పలేము.
సంస్థ మాటలు, రిస్క్ అంశాలు..
వివిధ పరిమాణాలు, వృద్ధి దశలలో ఉన్న వ్యాపారాలలో అవకాశాలు వస్తున్న నేపథ్యంలో లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగం పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలో కీలక భాగంగా కొనసాగుతోందని యాక్సిస్ ఏఎంసీ ఎండీ, సీఈఓ బీ గోప్‌కుమార్ తెలిపారు. లార్జ్ క్యాప్ స్థిరత్వం, మిడ్‌క్యాప్ వృద్ధి మధ్య ఎంత కేటాయించాలనే సందిగ్ధానికి ఈ సూచీ నియమబద్ధమైన, సమతుల్య పరిష్కారాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. సాధారణంగా లార్జ్ క్యాప్ కంపెనీలు స్థిరమైన వ్యాపార నమూనాలు, ఆర్థిక దృఢత్వాన్ని కలిగి ఉంటాయని, మిడ్‌క్యాప్ కంపెనీలు తమ స్థాయిని, మార్కెట్ ఉనికిని విస్తరించుకునే అవకాశాలను అందిస్తాయని వివరించారు. వివిధ మార్కెట్ చక్రాలలో నాయకత్వం మారుతుండటం వల్ల దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు విభిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్లలో వైవిధ్యీకరణ అవసరమని, సరళమైన, పారదర్శకమైన, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి పరిష్కారాలను అందించడంపై దృష్టి సారించామని ఆయన అన్నారు. ఖర్చులకు ముందు నిఫ్టీ లార్జ్ మిడ్‌క్యాప్ 250 టీఆర్ఐ పనితీరుకు అనుగుణంగా రాబడిని అందించడానికి ఈ ఫండ్ ప్రయత్నిస్తుంది. అయితే ఈక్విటీ మార్కెట్ రిస్క్‌లు, ముఖ్యంగా మిడ్‌క్యాప్ షేర్లలోని అధిక హెచ్చుతగ్గులు, లిక్విడిటీ పరిమితులు, ట్రాకింగ్ ఎర్రర్ వంటి అంశాలను పెట్టుబడిదారులు పరిగణనలోకి తీసుకోవాలని, పెట్టుబడి లక్ష్యం నెరవేరుతుందనే ఎలాంటి హామీ లేదని సంస్థ స్పష్టం చేసింది.