వాట్ ఏ సెమీ ఫైన‌ల్ ఫైట్.. ఇంగ్లాండ్‌పై భారత్ థ్రిల్లింగ్ విజయం …మ్యాచ్‌ని మ‌లుపు తిప్పిన క్యాచ్ ఇదే

టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్‌లో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. అక్షర్ పటేల్–శివం దుబే రిలే క్యాచ్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది.

India vs England T20 World Cup 2026 Semi Final
India vs England T20 World Cup 2026 Semi Final

టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఇంగ్లాండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో కూడా టీమిండియా ఆటగాళ్లు చూపించిన చాకచక్యం అభిమానులను ఆకట్టుకుంది.

ఈ మ్యాచ్‌లో ముఖ్యంగా భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ చేసిన అద్భుత ఫీల్డింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. అతను పట్టిన రెండు కీలక క్యాచ్‌లు మ్యాచ్‌ను మలుపుతిప్పాయి. ముఖ్యంగా శివం దుబేతో కలిసి తీసుకున్న రిలే క్యాచ్ మ్యాచ్ హైలైట్‌గా నిలిచింది.

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో భారత బౌలర్ అర్షదీప్ సింగ్ వేసిన బంతిని ఇంగ్లాండ్ బ్యాటర్ విల్ జాక్స్ బలంగా షాట్ ఆడాడు. బంతి స్వీపర్ కవర్ వైపు ఎత్తుగా వెళ్లింది. ఆ ప్రాంతంలో ఫీల్డింగ్ చేస్తున్న అక్షర్ పటేల్ వేగంగా ఎడమ వైపు పరుగెత్తి బంతిని అందుకున్నాడు.

రిలే క్యాచ్ చూసి ఆశ్చ‌ర్యం..

అయితే అతని వేగం కారణంగా బౌండరీ లైన్ దాటే పరిస్థితి ఏర్పడింది. కానీ అక్షర్ అద్భుతంగా ఆలోచించి బౌండరీకి వెళ్లే ముందు బంతిని మైదానంలోకి విసిరాడు. అదే సమయంలో లోపలికి పరుగెత్తుకుంటూ వచ్చిన శివం దుబే ఆ బంతిని అద్భుతంగా పట్టుకుని క్యాచ్ పూర్తి చేశాడు. ఈ రిలే క్యాచ్ చూసిన ప్రేక్షకులు, కామెంటేటర్లు, అభిమానులు ఆశ్చర్యపోయారు.

మ్యాచ్‌లో అత్యంత అందమైన ఫీల్డింగ్ క్షణంగా ఇది నిలిచింది. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌తో తలపడనుంది. దీంతో టైటిల్ పోరు మరింత ఆసక్తికరంగా మారింది.

స‌మిష్టి ప్ర‌ద‌ర్శ‌న‌..

ఇంగ్లాండ్‌పై భారత్‌కు ఇది వరుసగా రెండో సెమీఫైనల్ విజయం కావడం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతకుముందు 2024 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో కూడా భారత్ ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. మొత్తానికి ఈ మ్యాచ్‌లో భారత జట్టు సమిష్టి ప్రదర్శనతో విజయం సాధించింది. ముఖ్యంగా అక్షర్ పటేల్, శివం దుబే చూపించిన అద్భుత ఫీల్డింగ్ ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు ఫైనల్‌లో భారత్ ఎలా ప్రదర్శిస్తుందో అన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.

టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టుకు బలమైన పునాది వేశాడు. అతనికి తోడుగా శివమ్ దూబే వేగంగా బ్యాటింగ్ చేస్తూ 25 బంతుల్లో ఒక ఫోర్, నాలుగు సిక్స్‌లతో 43 పరుగులు చేశాడు.

ఇక ఇషాన్ కిషన్ కూడా దూకుడుగా ఆడి 18 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌ల సహాయంతో 39 పరుగులు సాధించాడు. చివరి ఓవర్లలో తిలక్ వర్మ 7 బంతుల్లో మూడు సిక్స్‌లతో 21 పరుగులు చేసి స్కోరును వేగంగా పెంచాడు. హార్దిక్ పాండ్యా కూడా 12 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 27 పరుగులు చేసి జట్టుకు విలువైన పరుగులు జోడించాడు. మొత్తంగా భారత బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో 19 సిక్సర్లు, 20 ఫోర్లు బాదుతూ ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం చాటారు.

ఇంగ్లాండ్ బౌలర్లలో విల్ జాక్స్ 2 వికెట్లకు 40 పరుగులు ఇచ్చి మెరుగైన ప్రదర్శన చేశాడు. ఆదిల్ రషీద్ కూడా 2 వికెట్లు తీసి 41 పరుగులు మాత్రమే ఇచ్చాడు. జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ తీసినా భారత బ్యాటర్ల దూకుడును పూర్తిగా అడ్డుకోలేకపోయాడు. 254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు కూడా చివరి వరకు పోరాడింది.

కానీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లాండ్ తరఫున జాకోబ్ బెతెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 105 పరుగులు చేసి శతకం సాధించాడు. అతను ఒంటరిగా పోరాడినా జట్టును విజయానికి చేర్చలేకపోయాడు.

విల్ జాక్స్ కూడా వేగంగా ఆడి 20 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌లతో 35 పరుగులు చేశాడు. అయినప్పటికీ చివర్లో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ విజయం సాధించలేకపోయింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీసి కీలక సమయంలో జట్టుకు బ్రేక్ ఇచ్చాడు.

అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసి ఇంగ్లాండ్‌ను అదుపులో ఉంచారు. దీంతో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది.

Also Read: హెచ్‌సీఏలో ఉద్యోగుల నిరవధిక సమ్మె.. ఐపీఎల్ మ్యాచ్‌లపై అనిశ్చితి?

About Author:

Ch Roja Rani

గత 5 సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న జర్నలిస్ట్‌. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిన Idreampost మరియు Wire Teluguలో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం Mana Varta లో క్రీడలు (Sports…

More About Author »