రాజస్థాన్ రాయల్స్ డీల్‌లో షేన్ వార్న్ ఫ్యామిలీకి జాక్‌పాట్ ..ఏకంగా ₹460 కోట్ల వరం

ఐపీఎల్‌లో జరిగిన భారీ ఫ్రాంచైజీ డీల్ ప్రభావం ఇప్పుడు లెజెండరీ క్రికెటర్ షేన్ వార్న్ కుటుంబానికి భారీ లాభాన్ని తీసుకురానుంది. రాజస్థాన్ రాయల్స్ విక్రయం తర్వాత వార్న్ తీసుకున్న వాటా విలువ వందల కోట్లకు ప

Shane Warne

ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ఇటీవల అమెరికాకు చెందిన వ్యాపారవేత్త కల్ సోమానీ చేతికి సుమారు ₹15,290 కోట్ల భారీ మొత్తానికి మారిన విషయం తెలిసిందే. ఈ డీల్‌తో ఫ్రాంచైజీ విలువ గణనీయంగా పెరిగింది. అయితే ఈ ఒప్పందం వల్ల లాభపడబోయేది కేవలం కొత్త యజమాని మాత్రమే కాదు… ఆ జట్టుకు తొలి కెప్టెన్‌గా ఉన్న ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ కుటుంబం కూడా.

వార్న్ ముందుచూపు .. ఇప్పుడు భారీ లాభం

2008లో ఐపీఎల్ ప్రారంభ సమయంలో షేన్ వార్న్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, కేవలం కెప్టెన్సీ మాత్రమే కాదు… ఫ్రాంచైజీలో వాటా కూడా పొందేలా డీల్ చేసుకున్నారు. ప్రతి ఏడాది 0.75% వాటా చొప్పున తీసుకునే విధంగా ఒప్పందం కుదిరింది. నాలుగేళ్ల పాటు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వార్న్ మొత్తం 3% వాటాను సంపాదించుకున్నారు.

Also Read: విజయవాడ టెర్రర్ లింక్స్ కేసు: ఇన్‌స్టాగ్రామ్ గ్రూపుల ద్వారా తీవ్రవాద ప్రచారం

అప్పట్లో చిన్నగా కనిపించిన ఈ నిర్ణయం, ఇప్పుడు భారీ లాభంగా మారింది. ప్రస్తుతం ఫ్రాంచైజీ విలువ సుమారు 1.63 బిలియన్ డాలర్లకు చేరడంతో, ఆ 3% వాటా విలువ దాదాపు ₹460 కోట్లకు చేరినట్లు అంచనా.

2026 తర్వాత వాటా విక్రయం అవకాశం

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత షేన్ వార్న్ కుటుంబం ఈ వాటాను విక్రయించుకునే అర్హత పొందనుంది. ఆ సమయంలో జరిగే విక్రయం ద్వారా వచ్చిన మొత్తం వార్న్ కుటుంబానికే దక్కనుంది. అయితే ఈ ప్రక్రియకు బీసీసీఐ అనుమతి అవసరమని సమాచారం.

2008లో మనోజ్ బద్లేకు చెందిన ఎమర్జింగ్ మీడియా సంస్థ సుమారు 67 మిలియన్ డాలర్లకు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. అప్పట్లో తక్కువగా కనిపించిన ఈ పెట్టుబడి, ఇప్పుడు వేల కోట్ల విలువైన ఆస్తిగా మారింది.

వార్న్ వారసత్వం

షేన్ వార్న్ 2022లో ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన తీసుకున్న తెలివైన వ్యాపార నిర్ణయాలు ఇప్పటికీ కుటుంబానికి లాభాలను అందిస్తున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఆటగాడిగా మాత్రమే కాకుండా, వ్యూహాత్మకంగా కూడా వార్న్ ప్రత్యేక గుర్తింపు పొందారు.

మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ తాజా డీల్ మరోసారి ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువ ఎంతగా పెరిగిందో చూపించడంతో పాటు, షేన్ వార్న్ ముందుచూపును ప్రపంచానికి చాటి చెప్పింది. ఆయన కుటుంబానికి ఇది నిజంగా అతి పెద్ద వరంగా మారింది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »