క్రికెట్ ప్రపంచంలో కొన్ని లెక్కలు సరిచేయడానికి సమయం పడుతుంది. కానీ ఒకసారి లెక్కసరి చేశాక ఆ ఆనందం వేరే స్థాయిలో ఉంటుంది. అదే విషయాన్ని 2026 టీ20 ప్రపంచకప్ వేదికగా భారత్ నిరూపించింది. సరిగ్గా పదేళ్ల క్రితం ఎదురైన చేదు జ్ఞాపకానికి ఈసారి ఘనంగా సమాధానం ఇచ్చింది.గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే, 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ వాంఖడే స్టేడియంలో జరిగింది. భారత్ 192 పరుగుల భారీ స్కోరు సాధించి గెలుపు ఖాయమని భావించిన వేళ, వెస్టిండీస్ బ్యాటర్లు విరుచుకుపడి 19.4 ఓవర్లలోనే 196 పరుగులు చేసి భారత్‌ను టోర్నీ నుంచి బయటకు పంపారు. ఆ తర్వాత విండీస్ టైటిల్ కూడా కైవసం చేసుకుంది. ఆ ఓటమి భారత అభిమానుల హృదయాల్లో పదేళ్లుగా మిగిలిపోయింది.
2026లో విధి తీర్పు
ఇప్పుడు 2026 టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-వెస్టిండీస్ మరోసారి తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. గెలవాలంటే భారత్‌కు 196 పరుగులు అవసరం. విశేషమేమిటంటే 2016లో విండీస్ చేసిన విజయ లక్ష్యం కూడా ఇదే ! అయితే
ఈసారి మాత్రం టీమిండియా ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. కీలక సమయంలో సంజూ శాంసన్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. 97 నాటౌట్‌తో విండీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపించాడు. ధైర్యంగా, శాంతంగా, లెక్క సరిచేసుకుంటూ ఆడిన సంజూ ఇన్నింగ్స్ మ్యాచ్‌ను పూర్తిగా భారత్ వైపు తిప్పింది. భారత్ 19.2 ఓవర్లలోనే 199 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పదేళ్ల క్రితం మనల్ని సెమీస్‌కి రాకుండా అడ్డుకున్న విండీస్‌ను ఈసారి భారత్ టోర్నీ నుంచే బయటకు పంపింది.
స్టేడియం మొత్తం పండుగ వాతావరణం
ఈ విజయం తర్వాత ఈడెన్ గార్డెన్స్ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఆకాశంలో టపాసుల కాంతులు మెరిసాయి. “వందే మాతరం” నినాదాలతో స్టేడియం మార్మోగింది. లేజర్ లైట్స్ షో అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. టీమిండియా డగౌట్‌లో ఆటగాళ్లు ఒకరినొకరు హత్తుకుని ఈ చారిత్రాత్మక విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు.
2016లో వాంఖెడేలో మొదలైన బాధాకరమైన కథ, 2026లో ఈడెన్ గార్డెన్స్‌లో అద్భుత ముగింపుని చూసింది. ఈ విజయం కేవలం సెమీఫైనల్ ఎంట్రీ కాదు, పదేళ్లుగా మిగిలిన గాయానికి మందుగా మారింది.
ముందున్న పోరు
ఈ ఘన విజయంతో భారత్ సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టింది. తదుపరి క్రికెట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. గత జ్ఞాపకాలను సానుకూలంగా మార్చుకున్న టీమిండియా, ఇప్పుడు కప్ దిశగా దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది.