ఒక్క గెలుపుతో పాయింట్ల టేబుల్ త‌ల‌కిందులు.. ఆ నాలుగు జ‌ట్ల‌కి వెన్నులో వ‌ణుకు పుట్టించిన ముంబై

ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఒకే ఒక్క విజయం ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో ముంబై ఇండియన్స్ చూపించింది. గుజరాత్‌పై 99 పరుగుల భారీ విజయం సాధించి అట్టడుగునుంచి టాప్-7లోకి దూసుకెళ్లింది.

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ స్థానం మరియు తిలక్ వర్మ బ్యాటింగ్ విన్యాసాలు
ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ స్థానం మరియు తిలక్ వర్మ బ్యాటింగ్ విన్యాసాలు

ఐపీఎల్ 2026 సీజన్‌లో పాయింట్ల పట్టికలో సమీకరణాలు రోజుకోలా మారుతున్నాయి. అందులో భాగంగా ముంబై ఇండియన్స్ జట్టు అద్భుత కమ్‌బ్యాక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. వరుస ఓటములతో సతమతమవుతూ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ముంబై, ఒక్క విజయం ద్వారా తన ప్లేస్‌ని పూర్తిగా మార్చేసుకుంది.

సీజన్ ఆరంభంలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న ముంబై, తన ఆరో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 99 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కేవలం రెండు పాయింట్లు మాత్రమే కాకుండా, జట్టు నెట్ రన్‌రేట్‌లో భారీ మార్పు వచ్చింది. మ్యాచ్‌కు ముందు -1.07గా ఉన్న రన్‌రేట్ ఒక్కసారిగా +0.067కి పెరిగింది. దీంతో పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో ఉన్న ముంబై, మూడు స్థానాలు ఎగబాకి 7వ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం 6 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లతో పోటీలో నిలిచింది.

పాయింట్ల ప‌ట్టిక తారుమారు..

ముంబై విజయం ఇతర జట్లపై కూడా ప్రభావం చూపింది. ముఖ్యంగా కోల్‌కతా నైట్ రైడర్స్ పరిస్థితి ఒక్కరోజులోనే మారిపోయింది. ముంబైను అట్టడుగునకు నెట్టిన ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఇప్పుడు మళ్లీ 10వ స్థానానికి పడిపోయింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ 7వ స్థానం నుంచి 8వ స్థానానికి, లక్నో సూపర్ జెయింట్స్ 8వ స్థానం నుంచి 9వ స్థానానికి జారిపోయాయి. ముంబై విజయం పాయింట్ల పట్టికను పూర్తిగా తారుమారు చేసింది.

ఈ మ్యాచ్‌లో ముంబై ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. తిలక్ వర్మ సెంచ‌రీతో జట్టుకు భారీ స్కోరు అందించగా, బౌలింగ్‌లో అశ్విని కుమార్ నాలుగు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఇక బుమ్రా కూడా తన తొలి వికెట్ తీసి ఫామ్‌లోకి రావడం జట్టుకు పెద్ద ప్లస్‌గా మారింది. ఇక ఓటమి చెందిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఆశలు దెబ్బతిన్నాయి. టాప్-4లోకి వెళ్లాలని భావించిన శుభ్‌మన్ గిల్ సేనకు ఈ మ్యాచ్ నిరాశనే మిగిల్చింది. ఈ ఓటమితో జట్టు నెట్ రన్‌రేట్ -0.821కి పడిపోయింది. ప్రస్తుతం 6 పాయింట్లతో 6వ స్థానంలో కొనసాగుతోంది.

ఆస‌క్తిక‌రంగా ప్లే ఆఫ్ రేసు..

మొత్తానికి ముంబై ఇండియన్స్ ఇప్పుడు లక్నో, చెన్నై జట్లతో సమాన పాయింట్లలో ఉన్నప్పటికీ, మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా పై స్థానం దక్కించుకుంది. రాబోయే మ్యాచ్‌ల్లో ఇదే జోరు కొనసాగితే ప్లే ఆఫ్స్ రేసు మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబైకి ఇలాంటి కమ్‌బ్యాక్‌లు కొత్తవి కావు. ఈ విజయంతో జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపు కాగా, పాయింట్ల పట్టికలో టాప్-4 స్థానాల కోసం పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.
Also Read:

About Author:

Ch Roja Rani

గత 5 సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న జర్నలిస్ట్‌. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిన Idreampost మరియు Wire Teluguలో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం Mana Varta లో క్రీడలు (Sports…

More About Author »