వైభవ్ సూర్యవంశీకి గర్ల్‌ఫ్రెండ్ అంటూ ఫోటోలు వైరల్.. అసలు నిజం ఇదే!

వైభవ్ సూర్యవంశీ గర్ల్‌ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలపై అసలు నిజం బయటపడింది. ఆ చిత్రాలు AIతో రూపొందించిన ఫేక్ ఇమేజెస్‌గా ప్రచారం అవుతున్నాయి.

vaibhav suryavanshi girlfriend ai generated images
vaibhav suryavanshi girlfriend ai generated images

టీమ్ ఇండియా యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి గర్ల్‌ఫ్రెండ్ ఉందంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఓ అమ్మాయితో వైభవ్ సన్నిహితంగా ఉన్నట్లుగా, ఇద్దరూ కలిసి తిరుగుతున్నట్లుగా, మరికొన్ని చిత్రాల్లో రొమాంటిక్‌గా కనిపించేలా ఈ ఫొటోలు ఉన్నాయి. దీంతో వైభవ్‌తో కనిపిస్తున్న ఆ అమ్మాయి ఎవరు? అంటూ నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వైరల్ అవుతున్న ఈ చిత్రాల వెనుక అసలు కథ వేరే ఉంది.

 AIతో తయారు చేసిన ఫేక్ ఫొటోలు

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ చిత్రాలు నిజమైనవి కావు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో రూపొందించిన ఫేక్ ఇమేజెస్ గా అవి ప్రచారం అవుతున్నాయి. వైభవ్ ఓ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నట్లుగా కనిపించే చిత్రాలు కూడా ఇందులో ఉన్నాయి.

AI టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో అసలు జరగని విషయాలను జరిగినట్లుగా చూపించే ఫొటోలు, వీడియోలు సృష్టించడం సులభమైంది. కొందరు సెలబ్రిటీల ఫొటోలను ఆధారంగా చేసుకుని ఇలాంటి కల్పిత చిత్రాలను రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

వైభవ్ విషయంలోనూ అదే తరహాలో కొన్ని చిత్రాలు వైరల్ అవుతున్నాయి. “వైభవ్ సూర్యవంశీతో ఉన్న ఈ అమ్మాయి ఎవరు?”, “ఇదేనా అతని గర్ల్‌ఫ్రెండ్?” అంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా వాటిని షేర్ చేస్తున్నారు.

 మైనర్‌పై ఇలాంటి ప్రచారం ఎందుకు?

వైభవ్ సూర్యవంశీకి ప్రస్తుతం 15 ఏళ్లే. ఈ వయసులో ఉన్న యువ క్రికెటర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కల్పిత చిత్రాలను రూపొందించి ప్రచారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా రీచ్, ఫాలోవర్ల కోసం ఆధారం లేని వ్యక్తిగత పుకార్లను వ్యాప్తి చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా మైనర్‌కు సంబంధించిన ఇలాంటి కంటెంట్‌ను నిజమని నిర్ధారించుకోకుండా షేర్ చేయకపోవడం మంచిది. వైరల్ ఫొటో కనిపించిందనే కారణంతో అది నిజమైనదని భావించకుండా.. సంబంధిత వ్యక్తులు లేదా విశ్వసనీయ అధికారిక వర్గాల నుంచి సమాచారం ఉందా లేదా అనేది పరిశీలించాలి.

క్రికెట్‌పైనే వైభవ్ ఫోకస్

ఇక క్రికెట్ విషయానికి వస్తే.. వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్నాడు. ఈస్ట్ జోన్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు సౌత్ జోన్‌తో జరుగుతున్న ఫైనల్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

తొలి ఇన్నింగ్స్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేసిన వైభవ్ 44 పరుగులు చేశాడు. అయితే అనవసరమైన షాట్ ఆడి క్యాచ్‌ఔట్‌గా వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశే ఎదురైంది. 16 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్‌తో 8 పరుగులు చేసి స్టంప్‌ఔట్ అయ్యాడు.

సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడుతున్నప్పుడు మరింత సహనంతో బ్యాటింగ్ చేయాలని కామెంటేటర్లు సూచించగా.. అతని షాట్ సెలక్షన్‌పై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు విమర్శలు చేశారు.

ప్రస్తుతం వైభవ్ వయసు, అతని క్రికెట్ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుంటే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆధారంలేని AI చిత్రాల కంటే అతని ఆట, ప్రతిభపైనే చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కల్పిత ఫొటోలను నిజమైనవిగా ప్రచారం చేయకుండా జాగ్రత్తగా ఉండటం సోషల్ మీడియా వినియోగదారుల బాధ్యత.

About Author:

Ch Roja Rani

గత 5 సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న జర్నలిస్ట్‌. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిన Idreampost మరియు Wire Teluguలో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం Mana Varta లో క్రీడలు (Sports…

More About Author »