IPL 2026 | ఐపీఎల్ 2026 చివరి అంకానికి చేరుకుంది. తన చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరోసారి తన బ్యాటింగ్ సత్తాను చాటింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో ఉప్పల్ స్టేడియంలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు దూకుడును కొనసాగించారు. భారీ షాట్లతో విరుచుకుపడిన ఎస్‌ఆర్‌హెచ్ 250కిపైగా పరుగులు చేసింది. ఈ సీజన్‌లో భారీ స్కోర్ ట్రెండ్‌ను కొనసాగిస్తూ మరోసారి ప్రత్యర్థి బౌలర్లపై దాడికి దిగింది. అయితే, ఈ విజయం వచ్చినప్పటికీ.. టాప్-2 స్థానానికి చేరలేకపోయింది. ఆర్‌సీబీపై 90 పరుగులకుపైగా తేడాతో గెలిస్తే మాత్రమే టాప్-2లోకి వెళ్లే అవకాశం ఉండగా.. ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. దీంతో మూడో స్థానాన్ని సరిపెట్టుకుంటూ లీగ్ దశకు ముగింపు పలికింది.
Read Also : IPL 2026 కోహ్లీ ఇన్నింగ్స్‌తో ఆర్సీబీ విజయం… ‘విరుష్క’ ఫ్లయింగ్ కిస్ వైరల్
ఈ మ్యాచ్ ముగిసే సమయానికి మూడు జట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ అన్ని 18 పాయింట్లతో సమానంగా నిలిచాయి. అయితే, నెట్ రన్‌రేట్ ఆధారంగా ఆర్‌సీబీ తొలి స్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో, హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచాయి. దాంతో ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-1లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది. మరోవైపు ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి వస్తోంది. టాప్-2లో స్థానం కోల్పోవడం జట్టుకు చిన్న నిరాశ కలిగినా.. ఈ సీజన్‌లో బ్యాటింగ్ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఈ సీజన్‌లో హైదరాబాద్ మొత్తం తొమ్మిది సార్లు 200పైగా పరుగులు నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్‌లో ఇన్ని సార్లు 200 ప్లస్ స్కోర్లు చేసిన తొలి జట్టుగా సన్‌రైజర్స్ రికార్డు సృష్టించింది.
Read Also : కామెంటరీ బాక్స్‌లో అశ్విన్–సెహ్వాగ్ ఘర్షణ… చర్యలపై చర్చ
ఇంతకుముందు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వంటి జట్లు ఒక సీజన్‌లో గరిష్టంగా 8 సార్లు మాత్రమే 200 ప్లస్ స్కోర్ చేశాయి. కానీ, హైదరాబాద్ ఆ రికార్డును అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పింది. అంతేకాకుండా హైదరాబాద్ జట్టు 220కి పైగా లక్ష్యాన్ని కాపాడడంలో 100 శాతం విజయశాతాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటివరకు 12 సార్లు 220కి పైగా స్కోర్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ ఆ సందర్భాల్లో ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఈ గణాంకాలు చూస్తే హైదరాబాద్ జట్టు ఈ సీజన్‌లో బ్యాటింగ్ విభాగంలో ఎంత బలంగా ఉందో స్పష్టమవుతోంది. భారీ స్కోర్లు చేయడమే కాకుండా వాటిని కాపాడుకోవడం విశేషం. లీగ్ దశ ముగిసిన నేపథ్యంలో ఇక ప్లేఆఫ్స్ పోరు మరింత ఉత్కంఠగా మారనున్నది.
Read Also : 47 బంతులు మిగిలి ఉండగానే గెలుపు: చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ సంచలనం
ఆర్‌సీబీ-గుజరాత్ మధ్య క్వాలిఫయర్-1 జరుగనుండగా.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు మరో మూడు నాలుగు జట్లు పోటీపడుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ రేసులో నిలిచాయి. అయితే, చెన్నైకి దాదాపు ప్లేఆఫ్ ఆశలు ఆవిరైనా.. రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్‌కు అవకాశాలున్నాయి. ముంబయితో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే నేరుగా రాజస్థాన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడుతుంది. ఓడితే మాత్రం అవకాశాలు ఉండవు. అలాగే, ఎల్‌ఎస్‌జీపై గెలిస్తే పంజాబ్, డీసీతో జరిగే మ్యాచ్‌లో కేకేఆర్ గెలిస్తే అప్పుడు రన్‌రేట్ కీలకం కానుంది. ఏ జట్టు రన్‌రేట్ మెరుగ్గా ఉంటే ఆ జట్టు హైదరాబాద్‌తో ఎలిమినేటర్ ఆడుతాయి.
Read Also : ఒక మ్యాచ్… ఎన్నో భావాలు: జడేజా ప్రదర్శన అభిమానులను కదిలించింది


