పాక్ ప‌రువు తీసిన క్రికెట‌ర్.. శ్రీలంక హోటల్‌లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన

టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ జ‌ట్టులో మరో వివాదం చెలరేగింది. క్యాండీలోని హోటల్‌లో ఓ ఆటగాడు మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ

pak player controversy

టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ జ‌ట్టులో మరో వివాదం కలకలం రేపింది. శ్రీలంక పర్యటనలో ఉన్న సమయంలో ఓ పాకిస్థాన్ ఆటగాడు హోటల్ మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ‘టెలికాం ఆసియా స్పోర్ట్’ కథనం ప్రకారం ఈ ఘటన క్యాండీలోని గోల్డెన్ క్రౌన్ హోటల్‌లో చోటుచేసుకుంది. శ్రీలంకతో జరిగిన సూపర్ 8 మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ జట్టు అక్కడ బస చేసిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

Also Read: t20 world cup: ఫైనల్‌కు న్యూజిలాండ్… సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం

హోటల్ హౌస్‌కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న ఓ మహిళా సిబ్బంది పట్ల పాకిస్థాన్ జట్టులోని ఓ ఆటగాడు అనుచితంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దీంతో భయపడిన ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో అక్కడికి ఇతర హోటల్ సిబ్బంది పరుగెత్తుకుంటూ వచ్చి ఆమెను రక్షించారు.

జట్టు మేనేజర్ జోక్యం

ఈ విషయాన్ని వెంటనే జట్టు మేనేజర్ నవాబ్ చీమా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. హోటల్ యాజమాన్యం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని భావించింది. అయితే జట్టు మేనేజర్ జోక్యం చేసుకుని సదరు ఆటగాడి తరఫున హోటల్ యాజమాన్యానికి, బాధితురాలికి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.అదేవిధంగా క్రమశిక్షణ చర్యగా ఆ ఆటగాడిపై జరిమానా విధించి, వివాదాన్ని అక్కడికక్కడే సద్దుమణిగేలా చేసినట్లు తెలుస్తోంది.

మ్యాచ్ గెలిచినా సెమీస్ మిస్

ఈ ఘటన జరిగిన తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే నెట్ రన్‌రేట్ కారణంగా జట్టు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. దీంతో జట్టు ప్రదర్శనతో పాటు ఈ వివాదం కూడా పాకిస్థాన్ క్రికెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది.

ఈ వ్యవహారంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కూడా సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. సదరు ఆటగాడిని క్రమశిక్షణా కమిటీ ముందు హాజరుపరిచి మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్నో వివాదాలు..

విదేశీ పర్యటనల సమయంలో పాకిస్థాన్ ఆటగాళ్లు వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో హైద‌ర్ అలీపై ఇంగ్లండ్ పర్యటన సమయంలో అత్యాచార ఆరోపణలు వచ్చాయి. అయితే ఆధారాలు లేకపోవడంతో కోర్టు అతడిని విడుదల చేసింది. అలాగే కొన్నేళ్ల క్రితం మలేషియా పర్యటనలో జట్టు సభ్యుడు మసౌర్ మలంగ్ అలీ కూడా మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించి జరిమానాకు గురయ్యాడు.

తాజా ఘటనతో పాకిస్థాన్ క్రికెట్ మరోసారి వివాదాల్లో చిక్కుకోవడం గమనార్హం. ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న జట్టుకు ఈ సంఘటన మరింత ఇబ్బందిగా మారింది. క్రీడాకారులు విదేశీ పర్యటనల్లో క్రమశిక్షణ పాటించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »