ఎస్ఆర్‌హెచ్‌కి దిమ్మ‌తిరిగే షాక్.. గాయాల బెడ‌ద‌తో ఆందోళ‌న‌, ఆ స్టార్ బౌల‌ర్ రీఎంట్రీతో కాస్త ఊరట

ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గాయాల బెడద కొనసాగుతోంది. డేవిడ్ పేన్ సీజన్‌కు దూరమవగా, కెప్టెన్ పాట్ కమిన్స్ తిరిగి జట్టులో చేరడం అభిమానులకు ఊరట ఇచ్చింది.

SRH fast bowler David Payne during a match and Captain Pat Cummins practicing in the nets.
SRH fast bowler David Payne during a match and Captain Pat Cummins practicing in the nets.

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును గాయాల సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఇంగ్లాండ్‌కు చెందిన ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ డేవిడ్ పేన్ చీలమండ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.

35 ఏళ్ల పేన్ ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు సాధించి పరవాలేదనిపించాడు. ముఖ్యంగా బెంగళూరు జట్టుపై అతని కట్టుదిట్టమైన బౌలింగ్ ఆకట్టుకుంది. అతను త్వరగా కోలుకోవాలని జట్టు సభ్యులు ఆకాంక్షిస్తున్నారు.

గాయాల దెబ్బలు కొనసాగుతూనే…

ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు ఇది మొదటి గాయం కాదు. అంతకుముందే ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బ్రైడన్ కార్స్ చేతి గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంకను జట్టులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం జట్టు ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. నెట్ రన్‌రేట్ +0.576గా ఉంది. గాయాల కారణంగా జట్టు కాంబినేషన్ ప్రభావితమవుతోంది.

కమిన్స్ రీఎంట్రీతో బూస్ట్…

డేవిడ్ పేన్ గాయం జట్టుకు షాక్ ఇచ్చినా, మరోవైపు కెప్టెన్ పాట్ కమిన్స్ ఫిట్‌నెస్ టెస్ట్ క్లియర్ చేసి త్వరలో జట్టులో చేరబోతున్నాడు. ఏప్రిల్ 25న జైపూర్‌లో జరిగే మ్యాచ్‌లో అతను ఆడే అవకాశముంది.

కమిన్స్ గైర్హాజరీలో ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ జట్టును ముందుకు నడిపించాడు. అతని సారథ్యంలో జట్టు రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది.

సీఎస్కేపై దృష్టి…

ఇటీవల రాజస్థాన్ జట్టుపై హైదరాబాద్ అద్భుత విజయం సాధించింది. 217 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన జట్టు, ప్రత్యర్థిని 159 పరుగులకే కట్టడి చేసి 57 పరుగుల తేడాతో గెలిచింది. యువ బౌలర్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ చెరో నాలుగు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలిచారు.

ఇప్పుడు హైదరాబాద్ జట్టు తదుపరి మ్యాచ్‌లో చెన్నై జట్టును ఎదుర్కోనుంది. ఉప్పల్ స్టేడియంలో హోమ్ గ్రౌండ్‌లో జరిగే ఈ మ్యాచ్‌పై భారీ ఆసక్తి నెలకొంది. టికెట్లకు డిమాండ్ కూడా పెరిగింది. గాయాల సమస్యలు ఉన్నప్పటికీ, సొంతగడ్డపై గెలుపు సాధించి విజయ పరంపర కొనసాగించాలని హైదరాబాద్ జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.
Also read:

About Author:

Ch Roja Rani

గత 5 సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న జర్నలిస్ట్‌. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిన Idreampost మరియు Wire Teluguలో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం Mana Varta లో క్రీడలు (Sports…

More About Author »