ఉప్పల్‌లో ఆర్‌సీబీతో తలపడనున్న సన్‌రైజర్స్‌.. రేపు నగరంలో 12 గంటలు ట్రాఫిక్‌ ఆంక్షలు..!

ఉప్పల్ (Uppal)లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (Rajiv Gandhi International Cricket Stadium)లో మే 22న జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ (Hyderabad) ట్రాఫిక్ డైవర్షన్లు (Traffic Diversions) అమల్లోకి రానున్నాయి. నాగోల్ (Nagole), హబ్సిగూడ (Habsiguda), రామంతాపూర్ (Ramanthapur) మార్గాల్లో భారీ రద్దీ ఉండే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.

Traffic Diversions
ఉప్పల్‌లో ఆర్‌సీబీతో తలపడనున్న సన్‌రైజర్స్‌.. రేపు నగరంలో 12 గంటలు ట్రాఫిక్‌ ఆంక్షలు..!

Traffic Diversions | ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఈ నెల 22న ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SRH), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనున్నది. ఐపీఎల్‌-19 సీజన్‌లో చివరి లీగ్‌ మ్యాచ్‌ కావడం విశేషం. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు మల్కాజ్‌గిరి ట్రాఫిక్‌ పోలీసు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఉప్పల్‌, నాగోల్‌, హబ్సిగూడ, రామంతాపూర్‌, బోడుప్పల్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ ఉండొచ్చని హెచ్చరించారు. ప్రత్యేకంగా హెవీ వాహనాలను దారి మళ్లించనున్నారు. లారీలు, డంపర్లు, టిప్పర్లు, ట్రక్కులు, వాటర్‌ ట్యాంకర్లు, ఆర్‌ఎంసీ వాహనాలు, జేసీబీలు, ప్రైవేట్‌ బస్సులు, ట్రాక్టర్లు తదితర వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు.

Read Also : భగీరథ్‌ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు..! మరో సెక్షన్‌ జోడించిన పోలీసులు..!

ఘట్‌కేసర్‌ నుంచి వచ్చే వాహనాలు..

ఘట్‌కేసర్‌ నుంచి ఉప్పల్‌ వైపు వచ్చే హెవీ వాహనాలను మెహఫిల్‌ హోటల్‌ వద్ద నుంచి నాగోల్‌, ఎల్‌బీనగర్‌ వైపు మళ్లిస్తారు. ఎల్‌బీనగర్‌ నుంచి ఉప్పల్‌ వచ్చే వాహనాలను నాగోల్‌ మెట్రో స్టేషన్‌ వద్ద యూటర్న్‌ తీసుకుని బోడుప్పల్‌, చెంగిచెర్ల, చెర్లపల్లి మార్గంలో పంపిస్తారు. తార్నాక, హబ్సిగూడ, రామంతాపూర్‌ వైపు నుంచి ఉప్పల్‌కు వచ్చే హెవీ వాహనాలను నాచారం, ఎన్‌ఎఫ్‌సీ రోటరీ, చెర్లపల్లి మార్గాల్లోకి మళ్లించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఉప్పల్‌ జంక్షన్‌లో ఎలివేటెడ్‌ కారిడార్‌ పనుల కారణంగా వరంగల్‌ రహదారి మూసివేసినందున సికింద్రాబాద్‌ నుంచి వరంగల్‌ వెళ్లే వాహనాలను సర్వే ఆఫ్‌ ఇండియా – బీరప్పగడ్డ మార్గంలో పంపిస్తారు. అలాగే, వరంగల్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చే వాహనాలను ఉప్పల్‌ బగాయత్‌, నాగోల్‌ మార్గంలో మళ్లించనున్నారు. వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చే హెవీ వాహనాలు ఘట్‌కేసర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్‌ ఎక్కి అబ్దుల్లాపూర్‌మెట్‌, ఎల్‌బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ మార్గంలో ప్రయాణించాలని సూచించారు. హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు వెళ్లే వాహనాలు ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌ మీదుగా అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద ఓఆర్‌ఆర్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Read Also : రసవత్తరంగా ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌.. నాలుగో బెర్త్‌ కోసం బరిలో నాలుగు జట్లు..!

నాలుగు చోట్ల పార్కింగ్‌..

ఇదిలా ఉండగా.. మ్యాచ్‌ సందర్భంగా ప్రేక్షకుల కోసం ఐదు ప్రధాన పార్కింగ్‌ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. నాలుగు స్టేడియం వెలుపల సాధారణ ప్రేక్షకుల కోసం, ఒకటి స్టేడియం లోపల వీవీఐపీ, వీఐపీ పాస్‌ హోల్డర్ల కోసం కేటాయించారు. హబ్సిగూడ వైపు నుంచి వచ్చే వారికి పెంగ్విన్‌, టీజీఐఏఎల్ఏ పార్కింగ్‌ కేంద్రాలు, రామంతాపూర్‌ వైపు నుంచి వచ్చే వారికి డీఎస్‌ఎల్‌ ఓపెన్‌ ప్లేస్‌, మోడర్న్‌ బేకరీ ప్రాంతాల్లో పార్కింగ్‌ సదుపాయం కల్పించారు. పాస్‌లు లేని వాహనాలను ఈకే మినార్‌, ఎల్‌జీ గోదాం చెక్‌పోస్టుల దాటి అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. వీలైనంతవరకు ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు వంటి ప్రజా రవాణా సదుపాయాలను ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు. అలాగే, వాహనదారులు ప్రయాణాలను ముందుగానే ప్రణాళిక చేసుకుని ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్‌-2 డీసీపీ విజ్ఞప్తి చేశారు.

Read Also : టీచర్‌ ప్రమోషన్లకు టెట్‌ తప్పనిసరి.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »