WWDC 2026 | యాపిల్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC 2026) వేదికగా సంస్థ తన నెక్ట్స్ జనరేల్ సాఫ్ట్‌వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ సందర్భంగా ఐఫోన్ వినియోగదారుల కోసం కొత్త ఐవోఎస్ 27 (iOS 27)ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన యాపిల్, అత్యాధునిక ఏఐ సాంకేతికతతో రూపొందించిన ‘సిరి ఏఐ’ (Siri AI)ని ఆవిష్కరించింది. కాలిఫోర్నియాలోని యాపిల్ పార్క్‌లో జరిగిన ఈ వార్షిక సదస్సులో కంపెనీ అధికారులు ‘సిరి’లో పూర్తిస్థాయి మార్పులు చేసినట్లు వెల్లడించారు. గతంతో పోలిస్తే మరింత సహజంగా స్పందించేలా దీన్ని అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా డేటా ప్రాసెసింగ్ ఎక్కువ భాగం డివైస్‌లోనే జరిగేలా ‘ఆన్-డివైస్ ప్రాసెసింగ్’ విధానాన్ని అనుసరించినట్లు వివరించారు.
గూగుల్ జెమిని సాంకేతికతతో పాటు యాపిల్ రూపొందించిన నెక్స్ట్ జనరేషన్ ఫౌండేషన్ మోడల్స్ సహకారంతో రూపొందిన సిరి ఏఐ ఇకపై సాధారణ వాయిస్ అసిస్టెంట్‌గానే కాకుండా వ్యక్తిగత డిజిటల్ సహాయకుడిలా పనిచేయనుంది. వినియోగదారుల మాటలను మాత్రమే కాకుండా వారి అవసరాల సందర్భాన్ని కూడా అర్థం చేసుకుని స్పందించే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. మెసేజెస్, మ్యాప్స్, మెయిల్ వంటి యాప్స్‌లోని సమాచారాన్ని విశ్లేషించి అవసరమైన సూచనలు ఇవ్వడంతో పాటు టెక్స్ట్‌లు, ఈమెయిళ్లు, డాక్యుమెంట్ల సవరణ వంటి పనులను కూడా నిర్వహించగలదు. అంతేకాకుండా స్క్రీన్‌పై కనిపించే కంటెంట్‌ను గుర్తించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే సౌకర్యాన్ని కూడా యాపిల్ ఇందులో అందుబాటులోకి తీసుకొచ్చింది.
వినియోగదారుల కార్యకలాపాల చరిత్రను సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక స్టాండ్‌అలోన్ యాప్‌ను రూపొందించగా, డైనమిక్ ఐలాండ్‌తో మరింత లోతైన ఇంటిగ్రేషన్‌ను కల్పించింది. కొత్త ఐవోఎస్ 27లో భాగంగా అడ్వాన్స్‌డ్ ఫొటో ఎడిటింగ్ టూల్స్, ఇమేజ్ ప్లేగ్రౌండ్ వంటి యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. అయితే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అధునాతన ఫీచర్లను వినియోగించాలంటే ఐఫోన్ 16 సిరీస్ లేదా ఎం-సిరీస్ చిప్‌లతో పనిచేసే డివైజ్‌లు అవసరమని కంపెనీ స్పష్టం చేసింది. కాగా, సాధారణ ఐవోఎస్ 27 అప్‌డేట్ మాత్రం ఐఫోన్ 11 నుంచి విడుదలైన మోడళ్లకు అందుబాటులో ఉండనుంది. ఇదే వేదికపై మ్యాక్ ఓఎస్ 27, వాచ్ ఓఎస్ 27 తదితర కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌లను కూడా యాపిల్ ప్రకటించింది. ప్రస్తుతం డెవలపర్ బీటా వెర్షన్ విడుదల కాగా, ఈ ఏడాది చివరి నాటికి సాధారణ వినియోగదారులకు పూర్తి స్థాయి అప్‌డేట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇంగ్లిష్‌తో పాటు పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సదుపాయాలు అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.


