CM Revanth Reddy | అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 2008 డీఎస్సీ అభ్యర్థుల్లో 1,175 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి మంగళవారం పాలాభిషేకం నిర్వహించి ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి 2008 డీఎస్సీ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు.
Also Read : హార్వర్డ్‌లో వారం రోజుల కోర్సు .. మళ్లీ విద్యార్థిగా మారనున్న సీఎం రేవంత్‌రెడ్డి
గత 17 సంవత్సరాలుగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తమకు చివరకు ప్రభుత్వం న్యాయం చేసిందని వారు ఆనందం వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పోస్టింగ్స్ ఇచ్చారని, వాటిని కొత్త జిల్లాల ప్రాతిపదికన మార్చాలని కోరుతూ సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు. సర్వీస్‌కు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని చిన్నారెడ్డి హామీ ఇచ్చారు.
ప్రజావాణికి 393 దరఖాస్తులు..
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన 221వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 393 దరఖాస్తులు అందాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించినవి 190, రెవెన్యూ శాఖకు సంబంధించినవి 39, ఇందిరమ్మ ఇళ్ల కోసం 97, ప్రవాసి ప్రజావాణికి 2 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించిన 65 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
Also Read : భారత సినిమా రాజధానిగా హైదరాబాద్
సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి దరఖాస్తులను స్వీకరించి ప్రజల సమస్యలు విన్నారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పలు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో ఏసీపీ ఉమేందర్, ఎన్‌ఆర్‌ఐ సలహా మండలి చైర్మన్ అంబాసడర్ బీఎం వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, ప్రవాసి ప్రజావాణి సమన్వయకర్త బొజ్జా అమరేందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


