మీనాక్షి నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ వెనుక సొంత పార్టీ నేత‌లే ఉన్న‌రు.. బాంబు పేల్చిన హ‌రీశ్‌రావు..

తెలంగాణ భవన్ (Telangana Bhavan) మీడియా చిట్‌చాట్‌లో హరీశ్ రావు (Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) నామినేషన్ తిర‌స్క‌ర‌ణ వ్య‌వ‌హారంలో తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల హ‌స్తం ఉంద‌ని, సీఎం రేవంత్‌రెడ్డికి కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడ‌ని ఆరోపించారు. ఇందులో కుట్ర కోణం ఉంద‌ని ఆయ‌న ఆరోపించ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Harish Rao | కాంగ్రెస్ తెలంగాణ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్ నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ వ్య‌వ‌హారం వెనుక సొంత పార్టీ నేత‌లే ఉన్నార‌ని, ఈ ఘటన సాధారణ పొరపాటు కాదని, పార్టీ అంతర్గత కుట్ర వల్లే జరిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ‌రీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయ‌న మీడియాతో చిట్‌చాట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నామినేషన్‌లోని లోపాలపై ముందుగానే సమాచారం లీక్ చేసినది ఎవరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చాల్సిందేనని డిమాండ్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆశించిన రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తే ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించాడని తమ వద్ద సమాచారం ఉందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ మంత్రి కూడా ఈ అంశంపై స్పందిస్తూ మీనాక్షి నటరాజన్‌పై ఉన్న కేసుల సమాచారం తెలంగాణ కాంగ్రెస్ నుంచే బయటకు వెళ్లిందని స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గతంలో ఆమెకు రాజ్యసభ సీటు రాకుండా అడ్డుకున్న వ్యక్తే ఇప్పుడు ఇదే తరహా వ్యవహారంలో పాల్గొన్నాడని ఆరోపించారు.

ఇక ప్ర‌జ‌ల‌కే ఏం న్యాయం చేస్త‌రు..

“సొంత పార్టీ ఇంచార్జికే వెన్నుపోటు పొడిచే నాయకులు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు?” అని ప్రశ్నించిన హరీశ్ రావు, ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సిట్ వేయాలా.. మరో విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలా అన్నది ప్రభుత్వం తేల్చాలని వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్ర పాలనపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. గత ప్రభుత్వం నిర్మించిన సచివాలయానికి వెళ్లకుండా కమాండ్ కంట్రోల్ రూమ్‌ను క్యాంపు కార్యాలయంగా ఉపయోగిస్తున్నారని, ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో మరో క్యాంపు కార్యాలయం నిర్మాణం జరుగుతోందని విమర్శించారు. ముఖ్యమంత్రి తీరు “చదువు చారెడు.. బలపాలు దోసెడు” అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి సమీపంలోనే రూ.100 కోట్లతో ‘బోధి పెవిలియన్’ పేరుతో విలాసవంతమైన గెస్ట్ హౌస్ నిర్మాణం జరుగుతోందని ఆరోపించారు. అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి అక్కడి పనులను స్వయంగా పరిశీలిస్తున్నారని వ్యాఖ్యానించారు. మొదట రూ.7 కోట్లతో జీవో ఇచ్చి ఇప్పుడు దాన్ని రూ.100 కోట్లకు పెంచారని, అదనంగా ఇనుప కంచెలు, ఫుట్‌బాల్ స్టేడియం వంటి ఖర్చులు కూడా పెరిగాయని విమర్శించారు.

డ‌బ్బులు లేవంటూనే.. విలాసాల‌కు భారీగా ఖ‌ర్చులు..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మంలో తన సొంతానికి మూడో క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ, ఒకవైపు నిధులు లేవని చెబుతూనే విలాసాలకు మాత్రం భారీగా ఖర్చు చేస్తున్నారని అన్నారు. విద్యా రంగంపై కూడా హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫామ్‌లు, షూ, బెల్టుల తయారీ బాధ్యతలను గతంలో చేనేత కార్మికులు, దళిత కుటుంబాలకు ఇచ్చిన సంస్థల నుంచి తీసేసి గుజరాత్ కాంట్రాక్టర్‌కు అప్పగించారని పేర్కొన్నారు. ఆ కాంట్రాక్టర్ నుంచి ఇప్పటికీ విద్యార్థులకు కావాల్సిన బ్యాగులు, డ్రెస్సులు, బెల్టులు అందలేదని చెప్పారు. సుమారు 7 లక్షల మంది గురుకుల విద్యార్థులు ప్రభావితమయ్యారని, గతంలో స్కూళ్లు ప్రారంభమైన రోజే అన్నీ అందేవని గుర్తు చేశారు. విద్యాశాఖ బాధ్యత కూడా ముఖ్యమంత్రి చేతిలోనే ఉండటంతో వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని వ్యాఖ్యానించారు. టెండర్లలో గతంతో పోలిస్తే రేట్లు డబుల్ చేసి భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపించారు. చివరికి విద్యార్థులు తినే కోడిగుడ్ల కొనుగోళ్లలో కూడా అవినీతి జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నా, వాస్తవాలను కప్పిపుచ్చేందుకు తప్పుడు కథనాలు చెబుతున్నారని అన్నారు.

సీఎం బ్రేక్‌ఫాస్ట్ ఎక్క‌డ‌?

బడుల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ సక్రమంగా అమలు కావడం లేదని, అమ్మఒడి కమిటీల ద్వారా చేసిన పనులకు ఒక్కో నియోజకవర్గానికి రూ.4 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. స్కూళ్లలో పనిచేసే స్కావెంజర్లకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదని కూడా ఆరోపించారు. రాష్ట్రంలో భూముల ధరలు ఇష్టారీతిగా పెంచడంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో ధరలు తగ్గిస్తే ఇక్కడ మాత్రం పెంచుతున్నారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మద్యం ధరలు ఇప్పటికే పెరిగాయని, ఇప్పుడు మందుల ధరలు కూడా పెంచే యోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరలు తగ్గించాలని డిమాండ్ చేసిన నాయకుడే ఇప్పుడు పన్నులు పెంచుతున్నారని ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రభుత్వానికి అదనంగా రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తోందని తెలిపారు. భూమి శిస్తు కూడా తీసుకురావాలని చూస్తున్నారని అన్నారు.

చుట్టుప‌క్క‌ల గ్రామాల‌కు భారంగా ఫ్యూచ‌ర్ సిటీ..

ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు చుట్టుపక్కల గ్రామాలకు భారంగా మారుతోందని, హెచ్ఎండీఏ ద్వారా అప్పులు తెచ్చి ప్రజలపై అదనపు భారం వేస్తున్నారని విమర్శించారు. టోల్ గేట్లు, అదనపు ఫీజుల పేరుతో ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారని అన్నారు. ఎఫ్ఆర్‌బీఎం పరిమితిని దాటి అప్పులు తెచ్చేందుకు ప్రభుత్వం దళారులను ఉపయోగిస్తోందని, ఈ వ్యవహారంలో వందల కోట్ల కమీషన్లు మారుతున్నాయని ఆరోపించారు. ఒక బ్రోకర్ ఈ కమీషన్లతో విమానం కొనుగోలు చేశాడని కూడా వ్యాఖ్యానించారు. నిరుద్యోగులకు పరీక్ష ఫీజులు ఉచితం అని చెప్పి ఇప్పుడు పెంచారని, మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి ఇతర ఛార్జీలతో భారం వేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌పై తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారని, “మేము చెల్లని నోటు అయితే ఎందుకు మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు?” అని ప్రశ్నించారు. సీపీఐపై మాత్రం ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఫ్యూచర్ సిటీని తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఫార్మాసిటీ విషయంలో పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని, ప్రభుత్వ తీరుతో రాష్ట్రం నష్టపోతోందని అన్నారు.

ఫార్మాసిటీ కోస‌మే అనుమ‌తులు తెచ్చాం..

ఫార్మాసిటీ కోసం కేంద్రం నుంచి అన్ని అనుమతులు తెచ్చామని, భూములను వేరే అవసరాలకు వాడితే ఆ అనుమతులు రద్దవుతాయని గుర్తు చేశారు. ఫార్మాసిటీకి భూమి ఇచ్చిన మొదటి వ్యక్తి తానేనని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు వెళ్లిపోతున్నాయని, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నామని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం గతంలో రూ.100 కోట్లు కేటాయించామని, మీడియా అకాడమీ, అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇచ్చామని గుర్తు చేశారు. ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకించడం లేదని, కానీ భూ వివాదాలు లేని స్థలాలు ఇవ్వాలని సూచించారు. సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో పాత వివాదాస్పద భూములపై స్పష్టత అవసరమని, అదే భూములు ఎందుకు ఇస్తున్నారన్నది ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తంగా ఈ అన్ని అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి నిజాలు బయటపెట్టాలని హరీశ్ రావు కోరారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »