అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్: ₹15 వేల కోట్ల భూమి సేఫ్!

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో హైడ్రా మెగా ఆపరేషన్. ఆక్రమణకు గురైన 6 అంతస్తుల భవనం, గెస్ట్ హౌస్ కూల్చివేత. ₹15,000 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం. పూర్తి వివరాలు ఇక్కడ..

HYDRAA team demolishing illegal 6-story building and Mukheem guest house in Ameenpur Sangareddy
HYDRAA team demolishing illegal 6-story building and Mukheem guest house in Ameenpur Sangareddy

సంగారెడ్డి: ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ హైడ్రా (HYDRAA) మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలోని సుమారు 1263 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడేందుకు రంగంలోకి దిగిన అధికారులు, ఆక్రమణకు గురైన ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు ₹15,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

హైడ్రా ఆపరేషన్ ముఖ్యాంశాలు:

పేదలకు ఊరట: ఐలాపురం తండా మరియు గ్రామ శివారులోని నివాస గృహాల జోలికి వెళ్లకుండా హైడ్రా జాగ్రత్తలు తీసుకుంది. కేవలం ఖాళీ స్థలాలు, అక్రమంగా నిర్మించిన భారీ కట్టడాలపైనే దృష్టి సారించింది.

ముఖీమ్ గెస్ట్ హౌస్ కూల్చివేత: 1998 నుండి కోర్టు స్టే (Status Quo) ఉన్నప్పటికీ, నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన ముఖీమ్ గెస్ట్ హౌస్‌ను అధికారులు నేలమట్టం చేశారు.

6 అంతస్తుల భవనం ధ్వంసం: ఎలాంటి అనుమతులు లేకుండా ముఖీమ్ సోదరుడు అజీమ్ నిర్మించిన 6 అంతస్తుల భారీ భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. ఈ భవనంలో ఎవరూ నివాసం ఉండటం లేదని, కేవలం ఆక్రమణను కాపాడుకోవడానికి కొందరిని అప్పటికప్పుడు అద్దెకు దించినట్లు అధికారులు గుర్తించారు.

భారీ బందోబస్తు: రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగింది.

HYDRAA Demolition Drive at Ameenpur Ailapur 2026
HYDRAA Demolition Drive at Ameenpur Ailapur 2026

ప్రజా స్పందన – నెటిజన్ల డిమాండ్:

“పర్మిషన్స్ తీసుకుని ఈ బిల్డింగ్ కట్టాం…
అనుమతులే లేకపోతే, బిల్డింగ్ కట్టేంతవరకు అధికారులు ఏం చేస్తున్నారు?” అంటూ అమీన్‌పూర్ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

“ముందస్తు సమాచారం ఇవ్వకుండా అకస్మాత్తుగా కూల్చేశారు…
ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? రోడ్డున పడిన మేము ఎక్కడికి వెళ్లాలి?” అని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఘటన సమయంలో ఉద్రిక్తత

కూల్చివేత సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
భవనం లోపల మనుషులు ఉన్నప్పటికీ కూల్చివేత కొనసాగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

“కళ్లకు కనిపించడంలేదా? లోపల మనుషులు ఉన్నారు!” అంటూ బాధితులు బుల్డోజర్ డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరికొందరు తీవ్రంగా స్పందిస్తూ…
“డ్రైవర్‌కు ఒత్తిడి ఉండొచ్చు… కానీ అక్కడ ఉన్న అధికారులు, పోలీసులు ఎవరికీ లోపల మనుషులు కనిపించలేదా?” అంటూ ప్రశ్నించారు.

హైడ్రా చర్యలపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అమీన్‌పూర్‌లోని సర్వే నంబర్ 997, 998 లలో జరుగుతున్న అక్రమ ఆక్రమణలపై కూడా దృష్టి సారించాలని నెటిజన్లు కోరుతున్నారు. పనోరమ వెంచర్ పక్కన ఉన్న ప్రభుత్వ నిషేధిత భూములను (Prohibited Lands) బిల్డర్లు ఆక్రమిస్తున్నారని, వారిపై కూడా ఇదే తరహా చర్యలు తీసుకోవాలని ‘తెలంగాణ నైట్’ వంటి సోషల్ మీడియా ఖాతాలు హైడ్రాను అలెర్ట్ చేస్తున్నాయి.

Also Read:

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »