కలెక్టర్‌ను కలిసిన చింతా ప్రభాకర్, మాణిక్‌రావు.. ప్రజా సమస్యలపై వినతిపత్రం

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు కలిసి పలువురు ప్రజా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. తాగునీరు, రోడ్లు, పాఠశాలలు, రైతుల సమస్యలు, RRR భూ బాధితుల పరిహారం వంటి అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

సంగారెడ్డి, జహీరాబాద్ సమస్యలపై కలెక్టర్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ
సంగారెడ్డి, జహీరాబాద్ సమస్యలపై కలెక్టర్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ
  • సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు
  • ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు
  • సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్

సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో నెలకొన్న పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అభివృద్ధి పనులు, రైతు సమస్యలు, తాగునీటి సౌకర్యం, రోడ్ల నిర్మాణం, విద్యా సంస్థల మౌలిక వసతులు, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా సదాశివపేట మండలం బొబ్బిలిగామ గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. పాఠశాల భవనం గోడలు దెబ్బతినడంతో విద్యార్థులకు కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని, గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

SDF నిధులతో అభివృద్ధి పనుల పురోగతిపై చర్చ

నియోజకవర్గ పరిధిలోని రెండు పట్టణాలు, నాలుగు మండలాల్లో SDF కింద రూ.5 కోట్లతో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రతిపాదనల పురోగతిపై కలెక్టర్‌ను ఎమ్మెల్యేలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

అక్రమ వెంచర్‌పై చర్యలు కోరిన ఎమ్మెల్యేలు

మల్కాపూర్ గ్రామంలో అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేసి ఇంటి నంబర్లు జారీ చేసిన అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఉత్తర్‌పల్లి రోడ్డు నిర్మాణానికి రూ.23 లక్షల నిధులు కోరుతూ విజ్ఞప్తి

కంది మండలం ఉత్తర్‌పల్లి గ్రామ పరిధిలో పణ్యాల నాగరాజు ఫీల్డ్ నుంచి చిట్యాల అఖిల్ ఫీల్డ్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.23 లక్షల అంచనా వ్యయంతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసి నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యేలు కోరారు.

పాఠశాల మరుగుదొడ్ల బిల్లుల చెల్లింపుపై ఆదేశాలు

సూరారం గ్రామంలోని యూపీఎస్ పాఠశాలలో నిర్మించిన మరుగుదొడ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఎమ్మెల్యేలు కోరగా, జిల్లాలోని పెండింగ్ బిల్లుల వివరాలను పరిశీలించి చెల్లింపులు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

RRR భూ బాధితులకు బయోమెట్రిక్ సడలింపు కోరుతూ వినతి

గిర్మాపూర్ గ్రామంలో రీజినల్ రింగ్ రోడ్డు (RRR) భూ బాధితులకు నష్టపరిహారం చెల్లింపులో బయోమెట్రిక్ విధానాన్ని సడలించాలని ఎమ్మెల్యేలు కోరారు. అధిక వయస్సు కలిగిన రైతుల వేలిముద్రలు సరిగా నమోదు కాకపోవడంతో నష్టపరిహారం ఆలస్యం అవుతోందని వివరించారు.

SIR సర్వేలో లోపాలపై ఆందోళన

SIR ప్రక్రియలో భాగంగా బీఎల్ఓలు పట్టణ ప్రాంతాల్లో డోర్ టు డోర్ సర్వే సక్రమంగా నిర్వహించడం లేదని, బీఎల్ఏలకు సరైన సమాచారం అందడం లేదని ఎమ్మెల్యేలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల నివేదికల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.

బోర్‌వెల్ పనులకు రూ.1.98 కోట్ల నిధులు కోరుతూ విజ్ఞప్తి

2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన బోర్‌వెల్ పనులకు రూ.1.98 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం వేగంగా స్పందించి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »