కొత్తగూడెం కార్పొరేషన్‌లో కిడ్నాప్ కలకలం… బీఆర్ఎస్ అభ్యర్థి అదృశ్యంతో హీటెక్కిన రాజ‌కీయం

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి గుగులోత్ రాంబాబు కిడ్నాప్ అయ్యారన్న ఆరోపణలు సంచలనంగా మారాయి. మెజారిటీ లేకపోవడంతో మేయర్ పీఠం కోసం పార్టీల మధ్య ఉత్కంఠ పోరు కొనసాగుతోంది. పూర్తి మెజార్టీ రాకపోవడంతో ఎలాగైనా మేయర్‌ పీఠం దక్కించుకోవాలనే దురుద్దేశంతో ఈ కిడ్నాప్ చేశార‌ని అంటున్నారు.

Political protest in Kothagudem after alleged kidnap of BRS candidate

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కిడ్నాప్ ఘటన రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. 32వ డివిజన్‌కు చెందిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అభ్యర్థి గుగులోత్ రాంబాబును కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాంబాబు ఇంటి వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమానికి దిగారు. రాంబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కిడ్నాప్ వెనుక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతల ప్రమేయం ఉందని వనమా ఆరోపించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది.

మ్యాజిక్ ఫిగ‌ర్ రాలేదు..

ఇక కొత్తగూడెం కార్పొరేషన్‌లో మేయర్ పీఠం కోసం పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ నెలకొంది. కార్పొరేషన్‌లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మేయర్ పదవిని దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 31 అవసరం కాగా, ప్రస్తుతం ఆ సంఖ్య ఏ పార్టీకి కూడా అందుబాటులో లేదు. అటు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), ఇటు కాంగ్రెస్ రెండూ తమ వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ప్రజలు తమకు మద్దతు ఇచ్చారని, మేయర్ పదవి తమదేనని సీపీఐ నేతలు చెబుతుండగా, మరోవైపు కాంగ్రెస్ కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా రంగంలోకి దిగినట్లు సమాచారం. కొత్తగూడెం కార్పొరేషన్‌ను కాంగ్రెస్ కైవసం చేసుకునే దిశగా ఆయన శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాంబాబు కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశముందని, పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా మెజారిటీ లేకపోవడం, అభ్యర్థి అదృశ్యం ఆరోపణలు కలిసి కొత్తగూడెం కార్పొరేషన్ రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి.

ఇది అనైతికం..

ఎన్నికల్లో ప్రజాభిమానంతో గెలిచే శక్తి లేని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇతర పార్టీల అభ్యర్థులను కిడ్నాప్ చేయడం పూర్తిగా అనైతిక చర్య అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. దమ్ముంటే నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ఆయన హితవు పలికారు. ఇలాంటి అరాచకాలకు ఎంతకాలం పాల్పడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పోలీసులను వినియోగించుకుని అక్రమ మార్గాల్లో ఓట్లు వేయించుకున్నారని కూడా ఆరోపించారు. పోలీసులు అనైతికంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »