మంచిర్యాల/హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, కేవలం ‘వసూళ్ల’పైనే దృష్టి పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) ధ్వజమెత్తారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్యాతనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ల సన్మాన సభలో ఆయన ప్రసంగిస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
అవినీతికి అడ్డాగా సింగరేణి!
సింగరేణి సంస్థను రేవంత్ రెడ్డి తన సొంత సామ్రాజ్యంగా మార్చుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లోనే సింగరేణి టెండర్లు సాగుతున్నాయని, ‘సైట్ విజిటేషన్ సర్టిఫికేట్’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి కాంట్రాక్టర్లను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్నా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనీసం ఉలుకూ పలుకూ లేకుండా ఉండటం చూస్తుంటే.. కాంగ్రెస్, బీజేపీలు ‘తోడు దొంగలు’గా మారాయని అర్థమవుతోందన్నారు. “ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వచ్చి ఆర్‌ఆర్ (RR) టాక్స్ అని విమర్శిస్తారు, కానీ ఒక్క విచారణ కూడా చేయరు. ఇది వారి మధ్య ఉన్న చీకటి ఒప్పందం కాదా?” అని కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read :అసెంబ్లీకి రాకుండా కోటి జీతం… కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు
ఫ్యూచర్ లేని రేవంత్.. ఫ్యూచర్ సిటీ కడతారా?
ఇబ్రహీంపట్నంలో జరిగిన మరో కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన ‘ఫ్యూచర్ సిటీ’ మరియు ‘ఫోర్త్ సిటీ’ ఒక పెద్ద డ్రామా అని కొట్టిపారేశారు. “ఉన్న సిటీలో దోమలు కుట్టి జనం చనిపోతుంటే పట్టించుకోని ముఖ్యమంత్రి, ఏఐ (AI) గ్రాఫిక్స్‌తో ప్రజలను మభ్యపెడుతున్నారు. అసలు ఫ్యూచరే లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాననడం హాస్యాస్పదం” అని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం సేకరించిన 14,000 ఎకరాల ఫార్మా సిటీ భూములను రైతులకు తిరిగి ఇస్తామని ఓట్లు వేయించుకొని, ఇప్పుడు అవే భూముల్లో తన అనుచరుల కోసం భూ దందాలకు తెరలేపారని ఆరోపించారు.
Also Read : తెలంగాణ అసెంబ్లీలో BRS వాకౌట్ – మూసీపై భారీ ఉద్రిక్తత
ప్రజాస్వామ్యానికి కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష!
రాష్ట్రంలో నీచమైన రాజకీయాలు నడుస్తున్నాయని, క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మెజారిటీ సాధించినా కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడిందని కేటీఆర్ గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు అప్రజాస్వామికమని, ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి జైలులో ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మళ్ళీ బాగుపడాలన్నా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా, రైతుల ముఖంలో చిరునవ్వులు చూడాలన్నా కేసీఆర్ నాయకత్వం మళ్ళీ రావాల్సిందేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఆరు గ్యారెంటీల మోసం – భస్మాసుర హస్తం!
100 రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలు రెండు సంవత్సరాలు దాటినా అతీగతీ లేవని కేటీఆర్ విమర్శించారు. “అభయహస్తం పేరుతో కాంగ్రెస్ ప్రజలపై భస్మాసుర హస్తాన్ని పెట్టింది. రైతుబంధుకు రామ్ రామ్ చెప్పారు, దళితబంధుకు జై భీమ్ అన్నారు.. తెలంగాణను అమ్ముకుంటున్నారు” అని ధ్వజమెత్తారు. మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు అందరినీ కాంగ్రెస్ వంచించిందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Also Read : అకాల వర్షాల దెబ్బపై బీఆర్ఎస్ ఆందోళన… మొక్కజొన్న కొనుగోలు, సబ్సిడీలపై డిమాండ్


