KTR | మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ వ్యవహారంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, సింగరేణి సంస్థలో జరుగుతున్న వేల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణాలను ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకే బాల్క సుమన్‌ను అక్రమ కేసులతో జైలులో పెట్టారని ఆరోపించారు. గురువారం చంచల్‌గూడ జైలులో ఉన్న బాల్క సుమన్‌ను కేటీఆర్ పరామర్శించారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి కూడా ములాఖత్‌లో పాల్గొన్నారు. అనంతరం జైలు వెలుపల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వ అక్రమాలకు, జైలు శిక్షలకు బీఆర్ఎస్ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన కేటీఆర్.. సింగరేణి కార్మికుల పొట్టగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గల్లా పట్టి నిలదీస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జరుగుతున్న భారీ కుంభకోణాలను బీఆర్ఎస్ పార్టీ ఆధారాలతో సహా బయటపెడుతోందన్నారు.
Read Also : త్యాగాల తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతాం.. సీఎం రేవంత్‌రెడ్డి..
రేవంత్ బావమరిది కుంభకోణం బహిర్గతం చేశాం..
రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి కనుసన్నల్లో ‘సైట్ విజిటేషన్ సర్టిఫికేట్’ పేరిట రూ.15 వేల కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ బహిర్గతం చేసిందన్నారు. అలాగే సోలార్ టెండర్లలో జరిగిన వందల కోట్ల రూపాయల అక్రమాలను హరీష్ రావు బయటపెట్టారని గుర్తుచేశారు. నైనీ బొగ్గు టెండర్ వ్యవహారంలో మంత్రులకు, ముఖ్యమంత్రికి మధ్య వాటాలు కుదరకపోవడంతో చివరకు మీడియా ప్రతినిధులను అరెస్ట్ చేసే వరకు వెళ్లారని ఆరోపించారు. అనంతరం వివాదం ముదరడంతో ఆ టెండర్‌ను రద్దు చేయాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సమావేశంలో సింగరేణి సంస్థలో జరుగుతున్న అన్యాయాలపై బాల్క సుమన్ కార్మికుల తరఫున గళమెత్తారని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ హయాంలో మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డు ద్వారా 19 వేల వారసత్వ ఉద్యోగాలు కల్పించామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 నెలలుగా బోర్డు సమావేశాలు నిర్వహించకుండా వేలాది మంది కార్మికుల పిల్లలకు అన్యాయం చేస్తోందని విమర్శించారు.
Read Also : రూ.లక్ష కోట్ల కాళేశ్వరం మూడేళ్లకే కుంగిపోయింది.. పునరుద్ధరణ పనులు ప్రారంభించాం
వ్యాఖ్యలను వక్రకరించారు..
అంతేకాకుండా గతంలో ఇచ్చిన 19 వేల ఉద్యోగాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించడం కార్మికుల్లో ఆందోళనకు దారితీసిందన్నారు. ఈ నేపథ్యంలో కార్మికుల ఆవేదనను వ్యక్తం చేసిన బాల్క సుమన్ వ్యాఖ్యలను వక్రీకరించి, సింగరేణిలో జరుగుతున్న అసలు దోపిడీని కప్పిపుచ్చేందుకే ఆయనపై పీడీపీపీ చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపారని ఆరోపించారు. ఈ సందర్భంగా పోలీసుల వ్యవహారశైలిపైనా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బాల్క సుమన్‌పై నమోదు చేసిన కొన్ని సెక్షన్ల విషయంలో పోలీసుల అత్యుత్సాహాన్ని మెజిస్ట్రేట్ కోర్టు కూడా తప్పుబట్టిందని, అనంతరం ఆ సెక్షన్లను తొలగించిందని గుర్తు చేశారు. చట్టం అందరికీ ఒకేలా వర్తించాలన్న కేటీఆర్.. గతంలో మల్కాజ్‌గిరి ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రగతి భవన్‌ను బాంబులు పెట్టి పేల్చేసినా తప్పులేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినప్పుడు ఎందుకు జైలుకు పంపలేదని ప్రశ్నించారు. “అప్పుడు ఆయన శిక్షార్హుడు కాదా?” అని నిలదీశారు.
Read Also : సడలింపులు ఇవ్వండి.. కేంద్రానికి చంద్రబాబు లేఖ..
బండి సంజయ్‌ని ఎందుకు అరెస్ట్ చేయలేదు?
అలాగే హైదరాబాద్ పాతబస్తీపై “సర్జికల్ స్ట్రైక్” చేస్తామని వ్యాఖ్యానించిన ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బాల్క సుమన్‌పై పెట్టిన సెక్షన్లు ఆయనకు వర్తించవా అని ప్రశ్నించారు. సిద్దిపేటలో హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై దాడి చేసి “పెట్రోల్ పోసి తగలబెడతా” అని హెచ్చరించిన కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావుపై, అలాగే ఒక కంపెనీని తగలబెడతానని వ్యాఖ్యానించిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై కూడా చట్టం ఎందుకు చర్యలు తీసుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు. సింగరేణి సంస్థలో భారీ స్థాయిలో బొగ్గు కుంభకోణం జరిగిందని కూడా కేటీఆర్ ఆరోపించారు. సంస్థలోని కొందరు పెద్దల ఆధ్వర్యంలో మైనింగ్ చేయని బొగ్గును తవ్వినట్లు రికార్డులు సృష్టించి సుమారు రూ.1,600 కోట్ల మేర గోల్‌మాల్ జరిగిందన్నారు. దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని ఆరోపించారు.
Read Also : తెలంగాణ ఎవరి జాగీరు కాదు.. నాలుగు కోట్ల భూమిపుత్రుల రాష్ట్రం.. పవన్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్..!
కేంద్రం ఏం చేస్తోంది..?
సింగరేణిలో 49 శాతం వాటా కలిగిన కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఏం చేస్తోందని ప్రశ్నించిన కేటీఆర్.. ఈ భారీ స్కామ్‌పై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి సమగ్ర వివరాలతో లేఖ రాస్తానని ప్రకటించారు. ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ములాఖత్ సందర్భంగా బాల్క సుమన్ ఎంతో ధైర్యంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. “నా గురించి ఎవరూ బాధపడొద్దు. నాకు జైళ్లు, కేసులు కొత్త కాదు. ఉద్యమ కాలంలోనే నాపై 220 కేసులు పెట్టారు. మంచిర్యాల, ఆదిలాబాద్, రామగుండం ప్రాంతాల్లో సింగరేణి కార్మికులు తీవ్ర ఆక్రోశంతో ఉన్నారు. నా కంటే వారి సమస్యలపైనే ఎక్కువ దృష్టి పెట్టండి. వారి కోసం పోరాడండి” అని సుమన్ తమతో చెప్పినట్లు కేటీఆర్ వెల్లడించారు. బాల్క సుమన్ అరెస్ట్ వ్యవహారం, సింగరేణి బొగ్గు కుంభకోణంపై కేటీఆర్ చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also : అది నటులకు మాత్రమే దక్కిన అరుదైన అవకాశం.. సోనాక్షి సిన్హా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!


