KTR | తెలంగాణ ఎవరి జాగీరు కాదని.. నాలుగు కోట్ల భూమిపుత్రుల రాష్ట్రమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పెట్టుబడుల ఆకర్షణలో బెంగళూరును అధిగమించినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ పోరాట ఫలితమేనని ఆయన మరోసారి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ, ఇవ్వక తప్పని పరిస్థితిని సృష్టించినది కేసీఆర్ నాయకత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యమ కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలను గుర్తుచేస్తూ, ఆ నిర్ణయం వెనుక ఉన్న ఒత్తిడి, ప్రజా ఉద్యమ శక్తిని ఆయన ప్రస్తావించారు.
Read Also : తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తే ఊరుకోం.. ఆంధ్రా నేతలకు కవిత వార్నింగ్
రైతుల జీవితాలను మార్చేశాయి..
2014 నాటికి రాష్ట్రంలో సాగుభూమి విస్తీర్ణం సుమారు 1.50 కోట్ల ఎకరాలకే పరిమితమైందని, 2023 నాటికి అది 2.29 కోట్ల ఎకరాలకు పెరిగిందని కేటీఆర్ వివరించారు. ‘పదేళ్లలో వ్యవసాయ రంగాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాం’ అని తేల్చి చెప్పారు. ఉచిత 24 గంటల విద్యుత్ సరఫరా వంటి నిర్ణయాలు రైతుల జీవితాలను మార్చేశాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా ‘రైతు బంధు’ వంటి పథకాలను అమలు చేసి పెట్టుబడి సాయం అందించామని గుర్తు చేశారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో ముందంజలో నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలను సవాల్‌గా స్వీకరించాలంటూ.. ‘నేను చెప్పినవన్నీ తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర పరిపాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘అన్ని రంగాల్లో పాలన విఫలమైంది’ అని ఆరోపించారు. ఉద్యమ భావోద్వేగాలను గుర్తుచేస్తూ తెలంగాణ ఉద్యమకారులపై కాల్పులు జరిపిన వ్యక్తులు అధికారంలో ఉండటం బాధాకరమని వ్యాఖ్యానించారు.
Read Also : జెన్ జీ అభిప్రాయాలను వెల్లడించేందుకు ‘సేనా గళం’.. ప్రకటించిన పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ‘పార్టీ పెట్టి ఎవరైనా పోటీ చేయవచ్చు. కానీ, ఎక్కడ పోటీ చేస్తున్నారో అక్కడి రాజకీయ వాస్తవాలు తెలుసుకోవాలి’ అని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో జనసేన, టీడీపీ పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున విభజనపై ప్రశ్నలు లేవనెత్తడం సముచితం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మీ వ్యాపారాలు, కుటుంబాలు ఉన్నది కూడా ఇక్కడే కదా’ అన్నారు. దేశ రాజకీయాలపై కూడా కేటీఆర్ విస్తృతంగా స్పందించారు. జాతీయత పేరుతో ప్రాంతీయ అసమానతలు జరుగుతున్నాయా అన్న ప్రశ్నను లేవనెత్తుతూ.. ప్రధాని నరేంద్ర మోదీని కూడా పవన్ కల్యాణ్ ప్రశ్నించగలరా? అంటూ సవాల్ విసిరారు. పొట్టి శ్రీరాములు ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ.. ప్రాంతీయ భావోద్వేగాలు దేశ చరిత్రలో కొత్తవేమీ కావని ఆయన వ్యాఖ్యానించారు. దేశభక్తి గురించి తమకు ఎవరి పాఠాలు అవసరం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయ తేడాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత గౌరవం ఉండాలని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్‌ను సోదరుడిగా హైదరాబాద్‌కు ఆహ్వానిస్తానని, కానీ రాజకీయ వేదికలపై ఆధిపత్య ధోరణి అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు.
Read Also : ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్..! డైట్ ఛార్జీల పెంపు దిశగా ప్రభుత్వం అడుగులు..!


