మందమర్రిలో దారుణం: ఆరేళ్ల కూతురిని నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి తండ్రి దాడి… వీడియో వైరల్‌తో ఆగ్రహం

మంచిర్యాల జిల్లాలో ఓ తండ్రి తన చిన్నారి కూతురిపై అమానుషంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. పశువుల కాపరి సమయానికి స్పందించడంతో విషయం బయటపడగా, వీడియో వైర‌ల్ కావ‌డంతో కఠిన చర్యల కోసం డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

మంచిర్యాల జిల్లాలో తండ్రి దాడి చేసిన ఘటనకు సంబంధించిన వైరల్ వీడియో దృశ్యం.
Image Credit: RTV

మంచిర్యాల జిల్లాలోని మందమర్రి సమీపంలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆరేళ్ల కూతురిపై తండ్రి ప్రదర్శించిన క్రూరత్వం స్థానికులను కలచివేసింది. చిన్నారి చదువులో వెనుకబడుతోందని, మాట వినడం లేదనే కారణాలతో ఆమెపై అమానుషంగా దాడి చేయడం షాక్‌కు గురిచేస్తోంది.

నిర్మానుష్య ప్రాంతంలో అమానుషం

సతీశ్ అనే వ్యక్తి తన కుమార్తెను బైక్‌పై తీసుకుని ఊరి బయట ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఎవరూ లేని సమయాన్ని ఎంచుకుని చిన్నారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తండ్రి దెబ్బలకు తట్టుకోలేక ఆ పాప విలవిలలాడుతూ కేకలు వేస్తున్నా, అతడు ఏమాత్రం కనికరం చూపకుండా దాడి కొనసాగించడం హృదయ విదారకంగా మారింది.

దేవుడిలా వచ్చిన పశువుల కాపరి

అయితే, అదే సమయంలో సమీపంలో ఉన్న ఓ పశువుల కాపరి చిన్నారి అరుపులు విని అక్కడికి చేరుకున్నాడు. జరిగిన దృశ్యాన్ని చూసి షాక్‌కు గురైన అతడు వెంటనే సతీశ్‌ను నిలదీశాడు. “నీ సొంత బిడ్డను ఇలా కొట్టడం సరైంది కాదు” అని ప్రశ్నించగా, సతీశ్ నిర్లక్ష్యంగా స్పందిస్తూ “నా పిల్లను నేను ఎలా చూసుకుంటానో నీకేం?” అన్నట్టు మాట్లాడినట్లు సమాచారం. దీనిపై ఆ కాపరి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ అతడిని గట్టిగా మందలించాడు.

వీడియో వైరల్ – పరారైన తండ్రి

పశువుల కాపరి ప్రశ్నలకు దిగజారిన సతీశ్, వెంటనే తన కుమార్తెను బైక్‌పై ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన మొత్తాన్ని కాపరి తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. చిన్నారిపై జరిగిన ఈ దారుణాన్ని చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై స్థానికులు, బాలల హక్కుల సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. “పిల్లలను శిక్షించడం పేరుతో ఇలా ప్రాణాలకు ముప్పు కలిగించడం నేరం” అని వారు పేర్కొంటున్నారు. వీడియో ఆధారంగా వెంటనే కేసు నమోదు చేసి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే చిన్నారికి తగిన రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ కేసులో త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశముంది.
Also Read:

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »