తెలంగాణ కేబినెట్ 7 కీలక నిర్ణయాలు – ఆర్టీసీ, కాళేశ్వరం, గచ్చిబౌలి స్టేడియం

రిటైర్డ్ ఉద్యోగులకు రూ.8,000 కోట్ల బకాయిలు 100 రోజుల్లో పరిష్కరించాలని నిర్ణయం - మంత్రులు తమ జీతాల్లో 50% ఇవ్వడానికి సిద్ధమని ప్రకటన; కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేయాలని కేబినెట్ తీర్మానం.

Telangana Cabinet April 23 Key Decisions
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు ఏప్రిల్ 2026
  • తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం – సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏప్రిల్ 23, 2026న జరిగిన కేబినెట్ సమావేశం
  • ఆర్టీసీ సమ్మె విరమింపు విజ్ఞప్తి, కాళేశ్వరం సీబీఐ దర్యాప్తు వేగవంతం, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు, గచ్చిబౌలి స్టేడియం PPP అభివృద్ధి సహా 7 కీలక నిర్ణయాలు
  • హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఏప్రిల్ 23న జరిగిన సమావేశంలో ఏడు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీ సమ్మె నుండి కాళేశ్వరం వివాదం వరకు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల నుండి గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి వరకు – అన్నింటిపై చర్చించి నిర్ణయాలు వెలువడ్డాయి. మంత్రులు తమ జీతాల్లో 50 శాతం రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడం కేబినెట్ సమావేశంలో అత్యంత భావోద్వేగ క్షణంగా మారింది.

1. ఆర్టీసీ సమ్మె – చర్చలకు రండి

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని రాష్ట్ర మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం చిత్తశుద్ధితో సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని, అందుకే అధికారుల కమిటీ వేశామని స్పష్టం చేసింది. రేపు ఉప ముఖ్యమంత్రి అధ్వర్యంలో చర్చలకు రావాలని కార్మిక సంఘాలను ఆహ్వానించింది. సంయమనం పాటించి చర్చల మార్గం ఎంచుకోవాలని కోరింది.
Also Read : ఉచిత బస్సు పథకం ఇచ్చిన భారం – ఇప్పుడు బస్సే లేదు!

2. కాళేశ్వరం – సీబీఐ దర్యాప్తు వేగవంతం

హైకోర్టు తీర్పుపై కేబినెట్ లోతుగా చర్చించింది. న్యాయ నిపుణుల వివరణ ప్రకారం – హైకోర్టు జ్యుడిషియల్ కమిషన్ నియామకాన్ని తప్పుబట్టలేదు, నివేదికను కూడా తప్పుబట్టలేదు. పిటిషనర్లకు నోటీసులు ఇవ్వలేదనే సాంకేతిక కారణం మాత్రమే స్టేకు కారణమైంది. హైకోర్టు తీర్పు సీబీఐ దర్యాప్తుకు ఎలాంటి అడ్డంకిగా లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. తొమ్మిది నెలలైనా సీబీఐ దర్యాప్తు ప్రారంభం కాలేదని ఆందోళన వ్యక్తం చేసిన కేబినెట్ – దర్యాప్తు వేగవంతం చేయాలని మరోసారి సీబీఐని కోరాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా అనేది ఢిల్లీ న్యాయ నిపుణుల సలహా మేరకు నిర్ణయించాలని తీర్మానించింది.

Also Read :కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌కు హైకోర్టు స్టే – రేవంత్ ప్రభుత్వానికి తీవ్ర ఎదురుదెబ్బ

3. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు – 100 రోజుల్లో పరిష్కారం

ఇది కేబినెట్ సమావేశంలో అత్యంత కీలకమైన అంశం. పదేళ్ల BRS పాలనలో రెగ్యులర్ ఉద్యోగులకు రూ.6,200 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు రూ.8,000 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారు సచివాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా వెంటనే పరిష్కరించాలని కేబినెట్ నిర్ణయించింది.

అవసరమైతే మంత్రులు మరియు ప్రజాప్రతినిధులు తమ జీతాల్లో 50 శాతం రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రులందరూ ముందుకు వచ్చారు. రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలతో చర్చలు జరిపి 100 రోజుల్లోగా పరిష్కారం చూపాలని నిర్ణయించింది.

4. గచ్చిబౌలి స్టేడియం – PPP పద్ధతిలో కొత్త రూపు

76 ఎకరాల గచ్చిబౌలి స్టేడియంను పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ పద్ధతిలో అభివృద్ధి చేయాలని కేబినెట్ ఆమోదించింది. 64 ఎకరాల్లో 21 రకాల క్రీడా సౌకర్యాలు కల్పిస్తారు. అవుట్‌డోర్ స్టేడియం సామర్థ్యాన్ని 20,000 నుండి 50,000కు పెంచుతారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడాకారులకు వసతి, శిక్షణ సౌకర్యాలు కల్పిస్తారు. మిగిలిన 12 ఎకరాల్లో వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి ఇచ్చి వచ్చే ఆదాయాన్ని స్టేడియం నిర్వహణకు వినియోగిస్తారు.

5. మంథని చిన్న కాళేశ్వరం భూసేకరణ

మంథని నియోజకవర్గంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 4 మండలాలలో 63 గ్రామాలకు, 45,000 ఎకరాలకు సాగు నీరు అందించే ఈ ప్రాజెక్టుకు 2,427 ఎకరాలు అవసరం. ఇప్పటివరకు 1,020 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూసేకరణకు రూ.166.67 కోట్ల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

6. PACS పాలకవర్గాలు, ఆక్వా పార్క్

పదవీ కాలం పూర్తయిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు (PACS) నామినేట్ పద్ధతిన పాలకవర్గాలు నియమించాలని ఆమోదించారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించింది. ఇరిగేషన్ శాఖ 85.10 ఎకరాలను మత్స్య శాఖకు కేటాయించారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »