TG Cabinet | నిరుపేదలకు శుభవార్త.. రెండో విడుతలో నియోజకవర్గానికి 2వేల ఇండ్లు.. ఇక కాలేజీల్లోనూ మధ్యాహ్నం భోజనం..!

రాష్ట్రంలో 2.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లకు (Indiramma Houses) తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం (Midday Meal Scheme) అమలు, గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) కోసం రూ.1000 కోట్ల నిధులు, హైదరాబాద్‌లో ఎల్‌ఐజీ ఇళ్ల నిర్మాణం (LIG Housing) వంటి కీలక నిర్ణయాలు తీసుకుంది.

TG Cabinet | రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 2.50 లక్షల మంది పేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు చొప్పున మంజూరు చేయనున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ శనివారం సాయంత్రం సమావేశమైంది. దాదాపు మూడుగంటలకుపైగా కేబినెట్‌ సమావేశం కొనసాగింది. సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి కేబినెట్‌ నిర్ణయాలను మీడియాకు వివరించారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమై గోడలు, శ్లాబ్ దశల్లో నిలిచిపోయిన పాత ఇందిరమ్మ ఇళ్లను కూడా పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పునాదులు పూర్తై గోడలు, శ్లాబ్ వేయని ఇళ్లకు రూ.3 లక్షలు, గోడలు పూర్తై శ్లాబ్ దశలో ఆగిపోయిన ఇళ్లకు రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించనుంది.

Read Also : రైతు నోట్లో మట్టికొట్టారు.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ ఘాటు లేఖ..!

అసంపూర్తి ఇళ్ల పూర్తి కోసం

అసంపూర్తి ఇళ్ల పూర్తి కోసం ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్లకు నిధులు కేటాయించాలని తీర్మానించింది. తొలి విడతలో నిర్మాణం ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్లలో జూన్ 2 నాటికి దాదాపు లక్ష ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించనున్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీల కోసం నిర్మించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1న ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రివర్గ సభ్యులు కార్యక్రమంలో పాల్గొననున్నారు. హైదరాబాద్ మహానగర పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల కోసం లక్ష ఇళ్లు నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా గుడిసెల్లో నివసిస్తున్న 15 వేల కుటుంబాలను గుర్తించిన ప్రభుత్వం, వెంటనే వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించాలని ఆదేశించింది. గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని మంత్రివర్గం ప్రకటించింది.

పుష్కరాల కోసం రూ.1000కోట్లు.. కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు భారీగా రూ.1000 కోట్ల నిధులను రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. తొలి విడతగా రూ.300 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పుష్కర ఘాట్లు, రహదారులు, పారిశుధ్యం, తాగునీరు, భక్తుల సౌకర్యాల కల్పన వంటి పనులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పాఠశాలల తరహాలోనే కళాశాల విద్యార్థులకు కూడా ఉదయం అల్పాహారం, పాలు అందించనుంది. ఈ నిర్ణయం గ్రామీణ, పేద కుటుంబాల విద్యార్థులకు ఎంతో ఊరటనివ్వనుంది. విద్యుత్ పంపిణీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్‌డీఎస్‌ఎస్‌ పథకంలో చేరేందుకు తెలంగాణ డిస్కంల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని డీసీఎంఎస్‌లను మార్క్‌ఫెడ్‌లో విలీనం చేయాలని, తెలంగాణ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌ (TGRIC)ను హాకాలో విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి భూసేకరణ, పునరావాసం, మౌలిక వసతుల కోసం రూ.587 కోట్లు కేటాయించింది.

Read Also : ఆకాశంలోనే ఢీకొట్టుకున్న రెండు విమానాలు.. ప్రాణాల‌తో బ‌య‌ట‌పడ్డ న‌లుగురు..!

లైఫ్ సైన్సెస్ హబ్‌లలో ఒకటిగా నిలబెట్టాలనే..

తెలంగాణను 2030 నాటికి ప్రపంచ టాప్–5 లైఫ్ సైన్సెస్ హబ్‌లలో ఒకటిగా నిలబెట్టాలనే లక్ష్యంతో నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు, 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్ణయించింది. లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, బయోటెక్‌, మెడికల్‌ ఇన్నోవేషన్‌ రంగాల్లో భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తామని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. యువతకు పరిశోధన, తయారీ, డిజిటల్‌ హెల్త్‌, గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ రంగాల్లో మంచి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇప్పటివరకు ఎక్కువగా తయారీ మీద దృష్టి ఉంటే, ఇక నుంచి విలువైన ఇన్నోవేషన్‌ మీద ఎక్కువ ఫోకస్‌ పెట్టనున్నట్లు చెప్పారు. రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ యూనిట్లను కూడా పరిశ్రమలుగా గుర్తించే విధంగా ఈ పాలసీలో మార్పు తీసుకువస్తున్నామన్నారు. గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్లు, గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ సెంటర్లు తెలంగాణకు రావడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పారు. ఇన్నోవేషన్‌కు ప్రాధాన్యం ఇస్తూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్లను కూడా పరిశ్రమలుగా గుర్తించేలా పాలసీలో మార్పులు చేసింది. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్లు తెలంగాణకు రావడానికి ఈ పాలసీ దోహదం చేస్తుందని వివరించారు.

Read Also : ఏపీకి రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌.. భారీగా పెట్టుబ‌డులు పెడుతున్న ద్విచ‌క్ర వాహ‌నాల కంపెనీ..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »