తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జారీ చేసిన నోటిఫికేషన్‌తో ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ నెల జనవరి 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎలక్షన్ కోడ్) అమల్లోకి వచ్చింది.
Also Read:అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి సునామీ… $5,000 దాటిన బంగారం, వెండీ ఆల్‌టైమ్ హై
నామినేషన్ల ప్రక్రియ వివరాలు:
నామినేషన్ల స్వీకరణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.
జనవరి 28: ఎన్నికల నోటీసు జారీ, నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
నామినేషన్ల స్వీకరణ సమయం:
ఉదయం 10:30 గంటల నుంచి
సాయంత్రం 5:00 గంటల వరకు
జనవరి 30: నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
జనవరి 31: నామినేషన్ల పరిశీలన
పరిశీలన అనంతరం అదే రోజున చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితా విడుదల
అప్పీలు – ఉపసంహరణ షెడ్యూల్ :
నామినేషన్లపై అభ్యంతరాలు లేదా తిరస్కరణకు సంబంధించి అభ్యర్థులకు అప్పీల్ అవకాశం కల్పించారు.
ఫిబ్రవరి 1: నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్లు దాఖలు
ఫిబ్రవరి 2: అప్పీళ్ల పరిష్కారం పూర్తి
ఫిబ్రవరి 3: నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా విడుదల
పోలింగ్, రీపోలింగ్, లెక్కింపు తేదీలు :
ఎన్నికల ప్రధాన ఘట్టమైన పోలింగ్ ఫిబ్రవరిలో జరగనుంది.
ఫిబ్రవరి 11: పోలింగ్ సమయం: ఉదయం 7:00 నుంచి సాయంత్రం 5:00 వరకు
అవసరమైతే ఫిబ్రవరి 12న రీపోలింగ్
ఫిబ్రవరి 13: ఉదయం 8:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు
లెక్కింపు పూర్తైన వెంటనే ఫలితాల ప్రకటన
ఎన్నికల కమిషన్ ఆదేశాలు:
ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఎన్నికల అధికారులు షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రకటనలు, సభలపై పరిమితులు వర్తిస్తాయని కమిషన్ స్పష్టం చేసింది.
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు.