TG Weather | తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఉదయం నుంచే దంచికొడుతున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతుండగా.. వడగాల్పులతో జనజీవనం స్తంభిస్తోంది. ఇక రాగల రెండురోజుల్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుతాయంటూ రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. ఇప్పటికే వడదెబ్బతో పలువురు ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురి చేస్తోంది.
19 జిల్లాల్లో 44 డిగ్రీలు..
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. పలుచోట్ల రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 19 జిల్లాల్లో ఏకంగా 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదుకావడం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌లో అత్యధికంగా 45.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, నిర్మల్, సిద్దిపేట, మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎండలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటాయి. హన్మకొండ, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోనూ 44 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో సైతం 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
Read Also : రాయదుర్గం భూములు వేలం వేయనున్న కాంగ్రెస్ సర్కారు..! ఒక్కో ఎకరానికి రూ.139 కోట్లు..!
ఉత్తర తెలంగాణ జిల్లాలకు అలర్ట్..
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయిన వాతావరణశాఖ హెచ్చరించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, జనగామ, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, కూలీ పనులు చేసే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో అధికారులు ముందు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ఎండలతో ప్రమాదాలు..
భారీ ఉష్ణోగ్రతలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి వాహనం పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తూ ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఇక కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు, ఈదురుగాలులు ప్రజలను ఇబ్బందులకు గురిచేశాయి. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో బలమైన గాలులకు భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో గాలిదుమారానికి ఇళ్లపై ఉన్న రేకులు ఎగిరిపడ్డాయి. మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కూడా చిరుజల్లులు కురిశాయి. ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వర్షం కాస్త ఉపశమనం ఇచ్చినా, గాలివానలు మాత్రం ఆందోళన కలిగించాయి.
Read Also : అనుకున్న సమయానికి నైరుతి ఆగమనం.. 25 నుంచి 27 మధ్య కేరళను తాకే ఛాన్స్..!
వడదెబ్బతో నలుగురు మృతి
ఎండల తీవ్రత ప్రాణాలు తీస్తోంది. మంగళవారం రాష్ట్రంలో వడదెబ్బ కారణంగా నలుగురు మృతి చెందిన ఘటనలు విషాదాన్ని మిగిల్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన రైతు రాచర్ల రాజు(50), వికారాబాద్ జిల్లా కార్మికుడు సామెల్(35), ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కనక లచ్చు (52), శాంతినగర్‌కు చెందిన బిరుదుల కిరణ్‌కుమార్(45) వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తగినంత నీరు తాగడం, మజ్జిగ, కొబ్బరి నీరు, ఓఆర్‌ఎస్ వంటి ద్రవాలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. బయటకు వెళ్లేటప్పుడు తలపై గుడ్డ లేదా టోపీ ధరించాలని, చిన్నపిల్లలను వాహనాల్లో ఒంటరిగా వదిలేయొద్దని హెచ్చరిస్తున్నారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆస్పత్రికి తరలించాలని సూచిస్తున్నారు.
Read Also : టీచర్ ప్రమోషన్లకు టెట్ తప్పనిసరి.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!


