Raidurg Lands | రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మరోసారి భూములను వేలం వేసేందుకు సిద్ధమైంది. ప్రీమియం లొకేషన్‌గా పేరున్న హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని ప్రభుత్వ భూములను ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు టీఎస్ఐఐసీ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ-వేలంలో ఎకరాకు రూ.139 కోట్లను కనీస ధరగా నిర్ణయించింది. భూముల వేలం రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పాన్మక్తా పరిధిలోని సర్వే నెంబర్ 83/1లో ఉన్న మొత్తం 11.38 ఎకరాల భూమిని రెండు భాగాలుగా విభజించి వేలం వేయనున్నారు. ‘యాజ్ ఈజ్ వేర్ ఈజ్’ విధానంలో ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నారు.
Read Also : అన్విత గ్రూప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా బాలకృష్ణ
సుమారు 6.29 ఎకరాల విస్తీర్ణం గల ప్లాట్ 1ఏ అండ్ 1ఎఫ్‌లకు మే 28న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ-వేలం జరగనుంది. మరోవైపు 5.09 ఎకరాల విస్తీర్ణం గల ప్లాట్ పీ4కు జూన్ 1న ఇదే సమయాల్లో వేలం జరుగుతుంది. వేలంలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న సంస్థలతో పాటు డెవలపర్లు ఒక్కో ప్లాట్‌కు రూ.10కోట్ల ఈఎండీని చెల్లించాల్సి ఉంటుంది. బిడ్డింగ్ ప్రక్రియలో ఎకరాకు కనీసం రూ.కోటి చొప్పున ధర పెంచుతూ బిడ్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆసక్తిగల బిడ్డర్ల కోసం మే 18న రాయదుర్గంలోని టీ-హబ్‌లో ప్రీ-బిడ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎంఎస్‌టీసీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ-వేలం జరుగుతుంది. ఈ భూముల ప్రాధాన్యత కారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో భారీ ఆసక్తి నెలకొంది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు సమీపంలో ఉండటంతో పాటు క్వాల్‌కామ్ కార్యాలయానికి ఎదురుగా ఈ స్థలాలు ఉన్నాయి.
టీ-హబ్, టీ-వర్క్స్ వంటి ఇన్నోవేషన్ కేంద్రాలు కూడా సమీపంలోనే ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్, రాయదుర్గం మెట్రో స్టేషన్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభమైన అనుసంధానం ఉండడం అదనపు ప్రయోజనంగా మారింది. మల్టీ యూజ్ జోనింగ్ కింద ఉన్న ఈ ప్లాట్లలో నివాస, వాణిజ్య, రిటైల్, హాస్పిటాలిటీ ప్రాజెక్టులు అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన భూ వేలాలకు కూడా విశేష స్పందన లభించింది. 2025 అక్టోబర్‌లో నిర్వహించిన వేలంలో ఎకరాకు రూ.101 కోట్ల కనీస ధర నిర్ణయించగా.. గరిష్టంగా రూ.177 కోట్ల వరకు బిడ్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈసారి మరింత పోటీ నెలకొనే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Also : ఉస్మాన్ నగర్ వేలంలో రికార్డు – ఎకరా రూ.51.25 కోట్లకు అమ్మకం


