అనుకున్న సమయానికి నైరుతి ఆగమనం.. 25 నుంచి 27 మధ్య కేరళను తాకే ఛాన్స్‌..!

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు (monsoon) సాధారణానికి ముందుగానే దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. మే 25–27 మధ్య కేరళ (Kerala) తీరాన్ని తాకే సూచనలు కనిపిస్తున్నాయి. దక్షిణ బే ఆఫ్ బెంగాల్‌లో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ బలపడుతుండటంతో దక్షిణ రాష్ట్రాల్లో ముందస్తు వర్షాలు పడే అవకాశాలున్నాయి.

Monsoon | వాతావరణశాఖ దేశ రైతాంగానికి శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే దేశంలోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది. సాధారణంగా జూన్‌ ఒకటిన కేరళ తీరాన్ని తాకుతాయి. ఈ సారి మే 25 నుంచి 27 మధ్యలోనే ప్రవేశించే అవకాశాలున్నాయని అంచనా వేసింది. దక్షిణాది రాష్ట్రాల్లోనే మొదస్తుగానే వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపింది. సౌత్‌వెస్ట్ బే ఆఫ్ బెంగాల్‌ పరిధిలో ఏర్పడిన వ్యవస్థ వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని, శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా కదిలి ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతానికి చేరిందని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇది క్రమంగా మధ్య బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవస్థ ప్రభావంతో భూమధ్యరేఖ ప్రాంతాల నుంచి తేమతో కూడిన గాలులు బలపడతాయని, దాంతో దక్షిణ అండమాన్ సముద్రం, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో మే 16 ప్రాంతంలోనే రుతుపవనాల ప్రారంభానికి సంకేతాలు కనిపించవచ్చని చెబుతున్నారు.

Read Also : థ్యాంక్స్‌ సీఎం రేవంత్‌..! సీఎం రేవంత్‌ చిత్రపటానికి 2008 డీఎస్సీ టీచర్స్‌ పాలాభిషేకం..!

గతేడాది మే 24నే కేరళ తీరానికి

సాధారణంగా మే 20 నాటికి మాన్సూన్‌ అండమాన్ సముద్రంలో ప్రవేశిస్తుంది. మే 22 నాటికి పోర్ట్ బ్లెయర్‌ వరకు విస్తరించి, అక్కడి నుంచి కేరళ చేరేందుకు సుమారు 10–12 రోజులు పడుతుంది. ఈ లెక్కన జూన్ ఒకటిన సాధారణంగా రుతుపవనాలు చేరుకుంటాయి. కానీ ఈసారి ఆ ప్రక్రియ కొద్దిగా వేగంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది కూడా సైతం తరహా పరిస్థితులు కనిపించాయి. మే 13న అండమాన్‌లో ప్రవేశించిన రుతుపవనాలు మే 24కే కేరళ తీరాన్ని తాకాయి. సాధారణం కంటే వారం రోజులు ముందుగానే రుతుపవనాలు విస్తరించాయి. ఇక ఉత్తర భారతంలో మాత్రం వాతావరణ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీ వర్షం, పిడుగులు, ఈదురు గాలులు వీచాయి. పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వషాలకు పగలే చీకట్లు అలుముకున్నాయి. చెట్లు నేలకూలాయి. విద్యుత్‌ సంభాలు విరిగిపడడంతో రవాణాకు ఆటంకాలు ఏర్పడ్డాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని కులు ప్రాంతంలోనూ గాలివానకు నష్టం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

Read Also : రాయదుర్గం భూములు వేలం వేయనున్న కాంగ్రెస్‌ సర్కారు..! ఒక్కో ఎకరానికి రూ.139 కోట్లు..!

ఎల్‌ నినో.. లా నినా ప్రభావమే కారణం..

ఇదిలా ఉండగా.. నిపుణులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుతుపవనాల స్వభావం మారుతోందని పేర్కొంటున్నారు. ఒకసారి ఆలస్యం, మరోసారి ఒక్కసారిగా భారీ వర్షం, ఆ తర్వాత మళ్లీ పొడి వాతావరణం ఏర్పడుతోంది. దీనికి ఎల్ నినో, లా నినా ప్రభావం, సముద్ర ఉష్ణోగ్రతల మార్పులు, గ్లోబల్ వార్మింగ్ కీలక కారణాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది ఇప్పుడు కేవలం వాతావరణ సమస్య మాత్రమే కాదు. వ్యవసాయం, నీటి నిల్వలు, విద్యుత్ ఉత్పత్తి, నగరాల డ్రైనేజీ వ్యవస్థ అన్నింటిపైనా ప్రభావం పడుతోందని పేర్కొంటున్నారు. కొన్ని చోట్ల వర్షం లేక పంటలు ఎండిపోతే.. ఇంకొన్ని చోట్ల ఒక్కసారిగా వరదలు వస్తున్నాయి. రైతులకు ఇది అసలు పెద్ద సవాలుగా మారుతోంది. మొత్తానికి ఈసారి రుతుపవనాలు ముందస్తుగా వస్తున్నాయనే సంతోషం ఉన్నా.. వాటి ప్రబావం ఎలా ఉంటుందన్న దానిపై అనిశ్చితి నెలకొన్నది.

Read Also : జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఎదురుదెబ్బ.. ఈడీ కేసులో పిటిషన్‌ వెనక్కి తీసుకున్న శ్రీలంకన్‌ బ్యూటీ..!

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »