ఆకాశమే హద్దుగా చికెన్ ధరలు .. ఏపీలో మాంసానికి రెక్క‌లు, గుడ్డు రేట్లు పతనం

ఆంధ్రప్రదేశ్‌లో చికెన్ ధరలు భారీగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. మరోవైపు గుడ్ల ధరలు పడిపోవడం పౌల్ట్రీ రంగానికి కొత్త సవాళ్లు తీసుకొచ్చింది.

Chicken Price Today Andhra Pradesh-egg Price Today Andhra Pradesh
Chicken Price Today Andhra Pradesh-egg Price Today Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో చికెన్ ధరలు మరోసారి భారీగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. గత వారం వరకూ కిలో రూ.260 వరకు ఉన్న చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగి ఆదివారం నాటికి రూ.340కు చేరడం గమనార్హం. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో బ్రాయిలర్ కోడి (స్కిన్) కిలో రూ.320, స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.340 వరకు పలుకుతోంది. ఈ పెరుగుదలతో సాధారణ ప్రజలు చికెన్ కొనుగోలుపై వెనుకంజ వేస్తున్నారు.

ముఖ్యంగా ఆదివారం రోజున చికెన్‌కు ఎక్కువ డిమాండ్ ఉండటం సాధారణం. కానీ ధరలు అధికంగా ఉండటంతో కిలో కొనేవారు ఇప్పుడు అర కిలోతో సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కుటుంబ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ధరల పెరుగుదల మరింత భారంగా మారింది.

డిమాండ్ ఎక్కువ వ‌ల్లే..

చికెన్ ధరల పెరుగుదలకు పలు కారణాలు ఉన్నాయని పౌల్ట్రీ రంగ నిపుణులు చెబుతున్నారు. బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి తగ్గడం, రంజాన్ , ఇతర ఫంక్షన్ల కారణంగా డిమాండ్ పెరగడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. డిమాండ్‌కు సరిపడా చిన్న కోడి పిల్లలు అందుబాటులో లేకపోవడం కూడా ధరలపై ప్రభావం చూపుతోంది. అదనంగా, కొంతమంది పౌల్ట్రీ రైతులు నష్టాల కారణంగా కోళ్ల పెంపకం తగ్గించడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది.

ఇక వేసవి కాలం ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎండల తీవ్రత పెరగడంతో కోళ్ల మరణాలు అధికమవుతున్నాయి. అలాగే వేడి కారణంగా కోళ్ల ఎదుగుదల మందగించడం, దాణా ధరలు పెరగడం, కోడి పిల్లల ధరలు అధికమవడం ఇవన్నీ కలిపి ఉత్పత్తి ఖర్చును పెంచుతున్నాయి. రవాణా ఖర్చులు కూడా పెరగడం వల్ల మార్కెట్‌లో ధరలు మరింత ఎగబాకుతున్నాయి.

త‌గ్గుతున్న గుడ్ల ధ‌ర‌లు..

మరోవైపు కోడిగుడ్ల ధరలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఒకప్పుడు రూ.8 వరకు ఉన్న గుడ్డు ధర ప్రస్తుతం రూ.4.65కు పడిపోవడం గమనార్హం. గుడ్ల ఎగుమతులు నిలిచిపోవడమే దీనికి ప్రధాన కారణమని పౌల్ట్రీ యజమానులు చెబుతున్నారు. సాధారణంగా తమిళనాడు మార్గంగా గల్ఫ్ దేశాలకు గుడ్లు ఎగుమతి అవుతాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఈ ఎగుమతులు నిలిచిపోవడంతో దేశీయ మార్కెట్‌లో సరఫరా పెరిగి ధరలు పడిపోయాయి.

మొత్తానికి, ఒకవైపు చికెన్ ధరలు పెరిగి వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తుంటే, మరోవైపు గుడ్డు ధరలు పడిపోవడం పౌల్ట్రీ రంగానికి మరో సవాల్‌గా మారింది. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగితే చికెన్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: Gold Price:వరుస పతనం తర్వాత శాంతించిన పసిడి.. గత కొద్ది రోజుల్లోనే రూ. 12,000 తగ్గిన బంగారం.. నేటి రేట్లు ఇవే.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »