Pawan Kalyan Surgery: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సర్జరీ: మూడున్నర గంటల పాటు ఆపరేషన్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ముంబయిలో భుజానికి శస్త్రచికిత్స విజయవంతమైంది. పదేళ్లుగా భరిస్తున్న రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Pawan Kalyan shoulder surgery Mumbai updates
Pawan Kalyan shoulder surgery Mumbai updates

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ముంబయిలో శస్త్రచికిత్స జరిగింది. గత కొంతకాలంగా రెండు భుజాల తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ (Rotator Cuff Injuries), మజిల్ టేర్స్ (కండరాల గాయాలు) తో బాధపడుతున్న ఆయనకు శనివారం ఉదయం వైద్య నిపుణులు ఆపరేషన్ నిర్వహించారు.

రెండు భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు సూచించడంతో, తొలుత కుడి భుజానికి శస్త్రచికిత్స పూర్తి చేశారు.

ఈ ఆపరేషన్‌కు ముందు చేయాల్సిన అన్ని రకాల ముందస్తు వైద్య పరీక్షలను శుక్రవారం నాడే పూర్తి చేశారు. శనివారం జరిగిన ఈ శస్త్రచికిత్స సుమారు మూడున్నర గంటల పాటు సాగిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు.

కుడి భుజం గాయం నయమయ్యాక, మరో రెండు నెలల వ్యవధిలో ఎడమ భుజానికి కూడా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారు.

ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లోనే పవన్ కళ్యాణ్‌కు వీలైనంత త్వరగా ఆపరేషన్ అవసరమని డాక్టర్లు తేల్చి చెప్పారు. అయితే అప్పటికే డిప్యూటీ సీఎం హోదాలో ఆయన నిర్వర్తించాల్సిన పలు అధికారిక కార్యక్రమాలు ఖరారై ఉండటంతో, వాటిని ముగించుకున్న తర్వాతే శస్త్రచికిత్స చేయించుకుంటానని పవన్ కళ్యాణ్ వైద్యులకు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారిక బాధ్యతలను పూర్తి చేసిన అనంతరం ఆయన ముంబయి వెళ్లారు.

పదేళ్ల నుంచి నొప్పి భరిస్తూనే ప్రజాక్షేత్రంలో..
పవన్ కళ్యాణ్ భుజాల గాయాల వెనుక పదేళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎదురైన పరిస్థితులు ఉన్నాయి. 2016లోనే ఆయన భుజానికి మొదటిసారి గాయాలయ్యాయి.

ఆ సమయంలో ప్రథమ చికిత్స చేసిన వైద్యులు తగిన విశ్రాంతి అవసరమని గట్టిగా సూచించినప్పటికీ, ఆయన ప్రజా సమస్యలపై నిరంతరం సమావేశాల్లో పాల్గొంటూనే వచ్చారు. ఆ తర్వాత 2018లో చేపట్టిన జనసేన ‘పోరాట యాత్ర’ సందర్భంలో గాయాలు మరింత తీవ్రమయ్యాయి.

యాత్రల సమయంలో జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు తమ ప్రియతమ నాయకుడిని దగ్గరగా చూడాలనే ఉత్సాహంతో, కరచాలనం (Handshake) చేసే క్రమంలో పవన్ కళ్యాణ్ చేతులు పట్టి గట్టిగా లాగేవారు. అభిమానులు దూసుకువచ్చి చేతులు గుంజేటప్పుడు విపరీతమైన నొప్పి కలిగినా ఆయన పంటిబిగువున భరిస్తూ అభిమానులను ఆదరించారు. ఆ తర్వాత కూడా ఆయన ఆ గాయాలను పెద్దగా పట్టించుకోకుండా అశ్రద్ధ చేశారు.

2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లాల పర్యటనలో భాగంగా, ముఖ్యంగా మదనపల్లెలో టమోటా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలోనూ ఈ గాయాలు తిరగబెట్టాయి.

అక్కడ పార్టీ శ్రేణులు, రైతులు ఆయనకు చేరువగా వెళ్ళి కరచాలనం చేయడం, ఆప్యాయంగా హత్తుకొనే సందర్భాల్లో పాత గాయాల తీవ్రత పెరిగింది. అయినా ప్రజాక్షేత్రంలో పర్యటనలు ఆపలేదు. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారం, అంతకు ముందు నిర్వహించిన వారాహి విజయ యాత్ర సందర్భంలోనూ అభిమానులు కరచాలనం కోసం దూసుకురావడం వల్ల భుజాలపై ఒత్తిడి మరింత ఎక్కువైంది.

వైద్యులను ఆశ్చర్యపరిచిన పవన్ కళ్యాణ్ సహనం
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో పవన్ కళ్యాణ్‌కు ముక్కుకు సంబంధించిన శస్త్రచికిత్స చేసే సమయంలో వైద్యులు పలు ఇతర పరీక్షలు నిర్వహించారు. ఆ సందర్భంలోనే ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు స్కానింగ్‌లో గుర్తించారు.

అసలు ఇంత తీవ్రమైన కండరాల గాయాలు, నరాల ఒత్తిడి పెట్టుకుని పవన్ కళ్యాణ్ గత ఎన్నికల ప్రచారాన్ని, వారాహి యాత్రను ఏ విధంగా భరించగలిగారని, ఎలా తిరగగలిగారని వైద్య నిపుణులు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

రొటేటర్ కఫ్ ఇంజ్యూరీ అనేది భుజం కీలును పట్టి ఉంచే కండరాల సమూహానికి జరిగే నష్టం. దీనివల్ల చేతులు పైకి లేపడం, కదిలించడం తీవ్ర నొప్పితో కూడుకున్న పని. అంతటి నొప్పిని భరిస్తూనే ఆయన కూటమి విజయం కోసం అలుపెరగని ప్రచారం నిర్వహించారు.

ఏప్రిల్‌లోనే వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించినప్పటికీ, ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వం ఏర్పాటు, శాఖల సమీక్షల నేపథ్యంలో ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కుడి భుజానికి సర్జరీ విజయవంతం కావడంతో జనసేన శ్రేణులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »