Eatala Rajender: మేడిగడ్డలో నీళ్లు నింపకుండానే ఎత్తిపోయవచ్చు: సీఎం రేవంత్‌కు ఈటల సవాల్!

సికింద్రాబాద్ ప్రెస్‌మీట్‌లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం నీళ్ల ఎత్తిపోతలు, అవినీతి రికవరీపై ఆయన డిమాండ్లు ఇవే.

Eatala Rajender press conference Secunderabad
Eatala Rajender press conference Secunderabad

కాళేశ్వరం ప్రాజెక్టు నీటి సరఫరా, లీకేజీల అంశంపై తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రచ్చ మొదలైంది. సికింద్రాబాద్ లోని గాయత్రి గార్డెన్స్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సికింద్రాబాద్ ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.

మేడిగడ్డ బ్యారేజీలో నీటిని నిల్వ చేయకుండానే, నదిలో కిందకు వృథాగా ప్రవహించి పోతున్న నీటిని పంప్ చేసి రైతులకు అందించవచ్చనే సరికొత్త ప్రతిపాదనను ఆయన తెరపైకి తెచ్చారు.

ఈ సులువైన సూత్రాన్ని అర్థం చేసుకోకుండా ప్రభుత్వం పిచ్చి ఆర్గ్యుమెంట్లు చేస్తోందని ఈటల మండిపడ్డారు. తాము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇచ్చిన నివేదికను లేదా వారి మార్గదర్శకాలను వ్యతిరేకించడం లేదని ఆయన స్పష్టం చేశారు. బ్యారేజీలో చుక్క నీటిని కూడా నిల్వ ఉంచకుండా, కేవలం ప్రవహించే నది నీటిని లిఫ్ట్ చేయాలని తాము కోరుతున్నామని చెప్పారు.

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన బేషజాలను పక్కనబెట్టి, ఉత్తమంగా ఆలోచించాలని ఈటల సూచించారు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి ఎలాంటి బ్యారేజ్ లేకపోయినప్పటికీ అక్కడి నుండి నీటిని పంప్ చేయడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఇంజనీర్లతో మాట్లాడి పనులు త్వరగా చేయించాలే తప్ప, ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం బంద్ పెట్టాలని డిమాండ్ చేశారు.

కణతపై AK 47 పెట్టినా రాజీపడను 

తాను తెలంగాణ మట్టిబిడ్డనని, ఉద్యమకారుడినని, అదే తన ఉనికి మరియు గుర్తింపు అని ఈటల రాజేందర్ భావోద్వేగంగా పేర్కొన్నారు. రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలకు, రైతులకు నష్టం చేకూరుస్తుంటే చూస్తూ ఊరుకోనని, ఎంతటి వారినైనా చీల్చి చెండాడుతానని హెచ్చరించారు.

తన కణతపై ఎవడైనా AK 47 తుపాకీ తీసుకొచ్చి పెట్టి కాల్చి చంపుతా అన్నా సరే, ప్రజల ప్రయోజనాల విషయంలో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

తాను స్వయం ప్రకాశితుడినని, ఎవరో స్క్రిప్ట్ రాసి ఇస్తే మాట్లాడే వ్యక్తినో, ఎవరి మెప్పు కోసమో మాట్లాడే నీచుడినో కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి తప్పుడు ఆరోపణలు చేసే వారికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

బీజేపీ సిద్ధాంతం ఎల్లప్పుడూ ‘దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్’ అని, కానీ తాను తెలంగాణ బిడ్డను కాబట్టి తనకు ‘తెలంగాణ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్’ అని తన ప్రాధాన్యతలను వివరించారు.

తాను కేవలం కాంగ్రెస్ పార్టీని లేదా ఇంకో పార్టీని తిట్టడానికి ఇక్కడికి రాలేదని, అధికారంలో ఉండి పనులు చేయాల్సిన బాధ్యత గల వారిని మాత్రమే ప్రశ్నిస్తున్నానని చెప్పారు. తెలంగాణ వంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో 60 శాతం ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారని, వారికి సకాలంలో నీళ్లు ఇవ్వకపోతే రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అవినీతి డబ్బు రికవరీ చేయండి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన భారీ అవినీతిని తాము సమర్థించడం లేదని, ఆ అవినీతిని పూర్తిగా బయటపెట్టాలని ఈటల డిమాండ్ చేశారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో ప్రజల సొమ్మును వృథా చేసిన బాధ్యులను తేల్చి వెంటనే అరెస్ట్ చేయాలన్నారు.

కాళేశ్వరం కట్టిన డబ్బులు ప్రజల కష్టార్జితమని, ఆ ప్రజాధనాన్ని వృథా కానివ్వకుండా అవినీతికి పాల్పడిన వారి నుంచి సొమ్మును రికవరీ చేయాలని స్పష్టం చేశారు.

అవినీతిపై చర్యలు తీసుకోవాలే తప్ప, దానిని సాకుగా చూపిస్తూ రాజకీయాల కోసం రైతులను ఇబ్బంది పెట్టవద్దని హితవు పలికారు. ప్రజలకు అన్యాయం జరిగితే ఎంతటి వారైనా పతనం కాక తప్పదని, ప్రజలకు కోపం వస్తే కేసీఆర్ లాంటి బలమైన నేతలే రాజకీయంగా ఖతమయ్యారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరిస్తే సందర్భం వచ్చినప్పుడు ప్రజలు పాతాళంలో పాతర వేస్తారని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

ప్రస్తుతం హైదరాబాద్ నగరానికి 107 MGD నీటి సరఫరా తక్కువగా ఉందని, రాబోయే రోజుల్లో తీవ్ర నీటి కొరత వస్తే ప్రజలు ఎటు పోవాలని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తనను తాను మేధావిగా భావించుకోవచ్చు కానీ, నీళ్లు లేక క్షేత్రస్థాయిలో ప్రజలు దుఃఖిస్తున్నారని చెప్పారు.

హైదరాబాద్ ప్రతీకాత్మకతను, ఉత్తర తెలంగాణ, ఖమ్మం, నల్లగొండ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం బోనులో నిలబెడుతోందని, బీజేపీ ఏం చేయబోతుందో నీళ్లు కిందకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డికి అర్థమవుతుందని హెచ్చరించారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »