ఎల్ నినో ఎఫెక్ట్.. ముందస్తు అప్రమత్తత

ఏళ్ల తరబడి తాగునీటి కష్టాలు అనుభవిస్తున్న పల్నాడు, ప్రకాశం ప్రాంతాలకు అమరజీవి జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు జీవనాధారం కానున్నాయి. ఎల్ నినో వల్ల వర్షాభావం ముంచుకొస్తున్న వేళ పనుల్లో వేగం పెంచాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

BC Gurukula schools Telangana
BC Gurukula schools Telangana
  • ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్-గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ – ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష
  • జల్ జీవన్ మిషన్ కింద అమరజీవి జలధార – పల్నాడు, ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పనుల పురోగతి (అంచనా వ్యయం రూ.2,500 కోట్లు)
  • పల్నాడు, ప్రకాశం జిల్లాలు – 10 నియోజకవర్గాలు, 16 లక్షల మందికి లబ్ధి

ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో – ఈసారి రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే పల్నాడు–ప్రకాశం వంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. బుధవారం గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) విభాగం అధికారులతో మెగా వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు.

రూ.2,500 కోట్ల రెండు మెగా ప్రాజెక్టులు

జల్ జీవన్ మిషన్ కింద ‘అమరజీవి జలధార’ పేరుతో చేపట్టిన ఈ రెండు ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం సుమారు రూ.2,500 కోట్లు. వీటి తాజా పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు.

ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ – రూ.1,290 కోట్లు

  • లక్ష్యం: ఏడు నియోజకవర్గాల పరిధిలో 593 ఆవాసాలకు తాగునీరు
  • ఇన్‌టేక్ వెల్ నిర్మాణ పనులు 40 శాతానికి పైగా పూర్తి
  • 119 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి ప్లాంట్, సంపులు, గ్రౌండ్ లెవల్ బ్యాలెన్స్‌డ్ రిజర్వాయర్ పనులు పురోగతిలో
  • ఇప్పటివరకు 53 కి.మీ. పైపులైన్ నిర్మాణం పూర్తి

పల్నాడు వాటర్ గ్రిడ్ – రూ.1,200 కోట్లు

  • లక్ష్యం: 235 ఆవాసాలకు తాగునీరు
  • ఇప్పటికే 152 కి.మీ. పైపులైన్ నెట్‌వర్క్ పూర్తి
  • ఇన్‌టేక్ వెల్స్, రిజర్వాయర్లు, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం పురోగతిలో
  • ఇప్పటివరకు రూ.95 కోట్ల విలువైన పనులు పూర్తి

రెండు ప్రాజెక్టులు కలిపి 200 కిలోమీటర్లకు పైగా పైపులైన్ నిర్మాణం పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

“ఈ ప్రాజెక్టులు ప్రజలకు జీవనాధారం”

సమీక్ష అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ – ఏళ్ల తరబడి తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న పల్నాడు, ప్రకాశం ప్రజలకు ఈ ప్రాజెక్టులు జీవనాధారంగా మారనున్నాయని పేర్కొన్నారు. వీటి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని చెప్పారు.

నిర్ణీత గడువులోపు ప్రాజెక్టులు పూర్తి చేసి, లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

అడ్డంకులపై తక్షణ పరిష్కారం

గ్రామాల మధ్య పైపులైన్ల నిర్మాణం, అటవీ అనుమతులు వంటి సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా నిర్మాణ కార్యకలాపాలను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.

“కోలుకున్నాక స్వయంగా క్షేత్రస్థాయి పర్యటనలు”

భుజం శస్త్రచికిత్స నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత పనుల పురోగతిని పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపడతానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పనుల నాణ్యతను తానే స్వయంగా పరిశీలిస్తానని, జల్ జీవన్ మిషన్ పనుల్లో అలసత్వానికి తావివ్వొద్దని అధికారులను హెచ్చరించారు.

16 లక్షల మందికి శాశ్వత భద్రత

పల్నాడు, ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులు పూర్తయితే ఈ రెండు ప్రాంతాల పరిధిలోని సుమారు 10 నియోజకవర్గాల్లో 16 లక్షల మందికి పైగా ప్రజలకు శాశ్వత తాగునీటి భద్రత ఏర్పడుతుందని మంత్రి తెలిపారు.

పల్నాడు, ప్రకాశం జిల్లాలు రాష్ట్రంలోనే తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రాంతాలుగా పేరుపడ్డాయి. వేసవిలో ట్యాంకర్ల మీద ఆధారపడే గ్రామాలు ఇక్కడ చాలానే ఉన్నాయి. మెగా గ్రిడ్ ద్వారా శుద్ధి చేసిన నీరు నేరుగా ఇంటింటికీ చేరితే – ఈ ప్రాంతాల దీర్ఘకాలిక దాహార్తికి పరిష్కారం లభిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: హైదరాబాద్‌లో రూ.6 లక్షలకే సొంత ఫ్లాట్! ఇందిరమ్మ ఇళ్ల పూర్తి వివరాలు ఇవే

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »