ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? ఇదిప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అక్టోబర్ ఆఖరు నాటికి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందా? ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాదికి ఎన్నికలు మిగిలిపోకూడదని సీఎం చంద్రబాబు ఆదేశించారా? అయితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు? ఎంపీ కేశినేని శివనాథ్ ఏం అంటున్నారు? ఆయన వాదనలో ఉన్న అసలు అంశమేంటి?
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. చాలాకాలం తర్వాత మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అక్టోబర్‌లో అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేస్తామని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. అదే నెలలో వారం వ్యవధిలోనే పట్టణ స్థానిక సంస్థలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని, అవసరమైతే అంతకుమించి ఇస్తామే తప్ప ఒక్క శాతం కూడా తగ్గించబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. కూటమి పార్టీలతో సమన్వయంతో పనిచేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాప్ రాకూడదని పార్టీ శ్రేణులకు సూచించారు. మంత్రులు, జోనల్ పరిశీలకులకు కూడా స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
ప్రత్యక్ష ఎన్నికలపై కూటమి ధీమా
మేయర్‌కు ప్రత్యక్ష ఎన్నికలు జరగడం వల్ల ప్రజల మద్దతు నేరుగా తెలుస్తుందని కూటమి నేతలు చెబుతున్నారు. విజయవాడలో తొలి ప్రత్యక్ష మేయర్‌గా టీడీపీ అభ్యర్థి అనురాధ భారీ మెజారిటీతో గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక జరిగితే మంచి ఫలితాలు వస్తాయని, మేయర్ ఎన్నికల్లో కూటమి 95 శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల కంటే మెరుగైన స్ట్రైక్ రేట్ సాధించాలని చంద్రబాబు కూటమి నేతలకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ప్రాంతీయ పరిశీలకులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తే ఏకపక్ష విజయం సాధించవచ్చన్న ధీమాతో నేతలు ఉన్నారు.
ఓటర్ల జాబితాపై వైసీపీ అభ్యంతరం
అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కొన్ని న్యాయపరమైన సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లోని ఓటర్ల జాబితానే స్థానిక సంస్థల ఎన్నికలకు తుది జాబితాగా తీసుకోవాలని వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అయితే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే సమయానికి అమల్లో ఉన్న చెల్లుబాటు అయ్యే ఓటర్ల జాబితానే ఎన్నికలకు ప్రాతిపదికగా తీసుకోవచ్చన్నది ప్రభుత్వ వాదనగా ఉంది. అంటే SIR ప్రక్రియ పూర్తయి తుది ఓటర్ల జాబితా వచ్చే వరకు ఎన్నికలను నిలిపివేయాల్సిన అవసరం లేదన్నది ప్రభుత్వ ఆలోచన.
34 శాతం బీసీ రిజర్వేషన్లపై కసరత్తు
మరోవైపు బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశం కూడా కీలకంగా మారింది. రిజర్వేషన్లపై కోర్టు అభ్యంతరాలు వచ్చిన చోట వాటిని అధిగమించే మార్గాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అవసరమైతే పార్టీ పరంగా కూడా బీసీలకు ఓసీ, జనరల్ కేటగిరీలో సీట్లు కేటాయించే అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఓటర్ల జాబితా, బీసీ రిజర్వేషన్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకుని, ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది.
అక్టోబర్‌లోనే ఎన్నికలు పూర్తి చేయాలని లక్ష్యం
తొలుత పురపాలక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, చివరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. న్యాయపరమైన చిక్కులు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించుకుంటూ అక్టోబర్‌లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
ఎన్నికలు వాయిదా పడే ప్రసక్తే లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. కోర్టు కేసుల పరిష్కారంతో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాదిలోనే స్థానిక ఎన్నికలు పూర్తి కావాలని, వచ్చే ఏడాదికి వాయిదా పడకూడదని చంద్రబాబు కూటమి నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలోని వంద మున్సిపాలిటీలతో పాటు కోర్టు పరిధిలో ఉన్న 23 మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు నిర్వహించేలా సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించినట్లు సమాచారం.
విజయవాడలో దసరా అడ్డంకి?
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల విషయంలో మాత్రం ఓ సమస్య ఎదురుకానున్నట్లు తెలుస్తోంది. ఇతర కార్పొరేషన్ల పరిస్థితి ఎలా ఉన్నా.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ విషయంలో స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
దసరా ఉత్సవాల కారణంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయాలని కేశినేని చిన్ని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనిపై సీఎం చంద్రబాబును కలిసేందుకు అపాయింట్‌మెంట్ కూడా కోరినట్లు తెలుస్తోంది.
అక్టోబర్‌లో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతున్న సమయంలోనే విజయవాడలో దసరా ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అక్టోబర్ 11 నుంచి 20 వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ప్రకటించగా, ఉత్సవాలకు 25 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
దసరా విధుల్లో వేలాది మంది
దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలంటే అన్ని శాఖల సమన్వయం అవసరం. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, వీఎంసీ తదితర శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులు ప్రత్యేక విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది.
సుమారు నాలుగు వేల మంది పోలీసులు దసరా ఉత్సవాల్లో బందోబస్తు విధుల్లో ఉంటారు. అదే సమయంలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే బందోబస్తు నిర్వహణ కష్టసాధ్యమవుతుందని కేశినేని చిన్ని వాదిస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు, పారిశుద్ధ్య సిబ్బంది కూడా దసరా విధుల్లో ఉంటారని చెబుతున్నారు. కీలకమైన రెవెన్యూ యంత్రాంగం మొత్తం ఉత్సవాల్లో ప్రత్యేక విధులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.
గత ఏడాది దసరా సమయంలో లక్షా 50 వేల నుంచి రెండు లక్షల మంది వరకు భక్తులు వచ్చారని, ఈసారి కూడా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎన్నికల నిర్వహణ ఇబ్బందికరంగా మారుతుందని కేశినేని చిన్ని చెబుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చామని, ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
చిన్ని కోరికను చంద్రబాబు మన్నిస్తారా?
తప్పనిసరి పరిస్థితుల్లో అక్టోబర్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ను మినహాయించాలని కేశినేని చిన్ని కోరుతున్నారు. ఒకవైపు ఈ ఏడాదిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. మరోవైపు విజయవాడలో దసరా ఉత్సవాల నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.
మరి విజయవాడ విషయంలో కేశినేని చిన్ని చేసిన విజ్ఞప్తిపై సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలకు మినహాయింపు ఇస్తారా? లేక ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


