ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎవరికైనా అర్హత ఉండి సాయం అందకపోతే వెంటనే వివరాలు పంపించాలని మంత్రి కోరారు. శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
రాష్ట్రంలో విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకంను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 67,01,653 మంది విద్యార్థులకు రూ.8,454 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. అర్హులందరికీ సాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యపై వివరాలు
శాసనమండలిలో జరిగిన చర్చలో భాగంగా యూడైస్ (UDISE) ప్రకారం రాష్ట్రంలో నమోదైన విద్యార్థుల సంఖ్యపై మంత్రి వివరాలు వెల్లడించారు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలో 79,51,903 మంది విద్యార్థులు నమోదయ్యారని తెలిపారు.
ఈ సంఖ్యలో 67,01,653 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం వర్తించిందని ఆయన పేర్కొన్నారు. మొత్తం నమోదు చేసిన విద్యార్థుల్లో 84.27 శాతం మందికి ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి తెలిపారు.
అయితే యూడైస్‌లో 86 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అసత్యమని లోకేష్ ఆరోపించారు. ప్రభుత్వం అధికారిక గణాంకాల ప్రకారం అర్హులైన వారికి మాత్రమే సాయం అందించిందని ఆయన చెప్పారు.
గత ప్రభుత్వంతో పోలిక
గత వైసీపీ ప్రభుత్వ కాలంలో విద్యార్థులకు అందించిన సాయంపై కూడా మంత్రి లోకేష్ స్పందించారు. యూడైస్ ప్రకారం అప్పట్లో 81,72,224 మంది విద్యార్థులు నమోదై ఉన్నప్పటికీ కేవలం 42,33,098 మందికే సాయం అందించారని ఆయన విమర్శించారు.
అంటే మొత్తం విద్యార్థుల్లో 52 శాతం మందికే ఆర్థిక సాయం అందిందని ఆయన పేర్కొన్నారు. 2020–21లో సుమారు 83 లక్షల మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కేవలం 44 లక్షల మందికే సాయం అందించారని తెలిపారు.
అలాగే 2021–22లో 82 లక్షల మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కేవలం 43 లక్షల మందికి మాత్రమే సాయం అందిందని, 2022–23లో 80 లక్షల మంది ఉన్నప్పటికీ కేవలం 42 లక్షల మందికే ఇచ్చారని చెప్పారు.
ఇప్పటి ప్రభుత్వం మాత్రం 84.27 శాతం విద్యార్థులకు సాయం అందిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
సాయం అందని వారు వివరాలు ఇవ్వాలి
‘తల్లికి వందనం’ పథకం కింద ఎవరైనా అర్హత ఉన్నప్పటికీ సాయం అందకపోతే వెంటనే వివరాలు ఇవ్వాలని మంత్రి లోకేష్ సూచించారు. అలాంటి కేసులను పరిశీలించి తక్షణమే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
ప్రభుత్వ లక్ష్యం అర్హులైన ప్రతి విద్యార్థికి ఈ పథకం ప్రయోజనం అందించడం అని ఆయన చెప్పారు. పథకం అమలులో ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
పారిశుద్ధ్య కార్మికులకు కూడా ప్రయోజనం
ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు కూడా ‘తల్లికి వందనం’ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. సోషల్ వెల్ఫేర్ విభాగంలో కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ముందుగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేసి తర్వాత కేంద్రం నుంచి నిధులు వస్తాయని వివరించారు. ఎక్కడైనా గ్యాప్ ఉంటే సంబంధిత వివరాలు అందిస్తే పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు.
రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రోత్సాహం
అదే సమయంలో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని కూడా పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఉన్నాయని తెలిపారు.
విశాఖపట్నంలో ఏసిప్ సంస్థకు భూములు కేటాయించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఎకో సిస్టమ్‌ను బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.