మావోయిస్ట్ నేత గణపతి లొంగిపోతున్నాడా.. అమ్మ అనారోగ్యంతో ఉంది అంటూ కుమారుడి క‌న్నీటి వీడియో

మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గణపతి లొంగిపోవచ్చనే వార్తల మధ్య ఆయన కుమారుడు ముప్పాళ్ల వాసుదేవరావు విడుదల చేసిన భావోద్వేగ ఆడియో వైరల్‌గా మారింది. తండ్రి కోసం ఎదురు చూసిన తన జీవితాన్ని, తల్లి ఎదుర్కొన్న కష్ట

maoist ganapathy surrender news

దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని సంకల్పించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల మావోయిస్టులపై కఠిన చర్యలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో భద్రతా బలగాలు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లు మావోయిస్టు కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన “ఆపరేషన్ కగార్” ద్వారా దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో దాడులు తీవ్రతరం అయ్యాయి. ఈ నేపథ్యంలో దేశాన్ని మావోయిస్ట్ రహితంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టు కార్యకలాపాలను పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో కేంద్రం చర్యలు చేపడుతోంది.

భద్రతా బలగాల దాడులు తీవ్రతరం కావడంతో అనేక మంది మావోయిస్టులు అడవులను వీడి లొంగిపోతున్నారు. మరోవైపు జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇప్పటికే వందల మంది నక్సల్స్ మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టు పార్టీలో కీలక నాయకులలో కొందరు మరణించగా, మరికొందరు ప్రభుత్వాల ముందు లొంగిపోవడం వల్ల దేశంలో మావోయిస్టు ప్రభావం గణనీయంగా తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు.

గ‌ణ‌పతి లొంగిపోతున్నాడా…

ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ అగ్రనేతగా గుర్తింపు పొందిన గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు ఆచూకీపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవల ఆయన లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు రాజకీయ, భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Also Read: తెలంగాణలో ముందుగానే మండుతున్న ఎండలు.. ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

కొన్ని నివేదికల ప్రకారం భద్రతా బలగాల దాడులు పెరగడంతో గణపతి నేపాల్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ సమయంలో తెలంగాణ పోలీసులతో ఆయన సంప్రదింపులు జరిపినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. నేపాల్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆయన త్వరలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో లొంగిపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో గణపతి కుమారుడు ముప్పాళ్ల వాసుదేవరావు మాట్లాడినట్లు చెబుతున్న ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుమారు నాలుగు నిమిషాలకు పైగా ఉన్న ఆ ఆడియోలో తండ్రి కోసం ఎదురు చూసిన తన జీవితాన్ని, కుటుంబం ఎదుర్కొన్న బాధలను ఆయన హృదయ విదారకంగా వివరించారు.

త‌ల్లికి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటా..

ఆ ఆడియోలో ఆయన మాట్లాడుతూ తండ్రి ప్రేమ అనుభవించినవారి భావాలు ఒకలా ఉంటాయని, కానీ తండ్రి కోసం జీవితాంతం ఎదురు చూసిన తనలాంటి వ్యక్తి భావాలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టం అని పేర్కొన్నారు. చిన్నప్పటి నుంచి తండ్రిని చూడాలని, ఆయనతో గడపాలని ఎన్నోసార్లు ఆశపడ్డానని అన్నారు.

తండ్రి విప్లవ మార్గాన్ని ఎంచుకున్న తర్వాత కుటుంబం ఎంతటి కష్టాలను ఎదుర్కొన్నదో కూడా ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా తన తల్లి జీవితాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఎన్నో సంవత్సరాలు బాధను మోస్తూ తనను పెంచిందని భావోద్వేగంగా చెప్పారు. తండ్రి లేకపోయినా తల్లి అన్నీ తానే అయ్యి పెంచిందని, ఆమెకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు. అదే సమయంలో తండ్రి ఎంచుకున్న సిద్ధాంతాన్ని తాను ప్రశ్నించడం లేదని కూడా స్పష్టం చేశారు.

ప్రస్తుత సమాజ పరిస్థితులు గతంతో పోలిస్తే చాలా మారాయని, నేటి యువతకు మంచి మార్గదర్శకత్వం అవసరమని వాసుదేవరావు పేర్కొన్నారు. తన తండ్రి వంటి అనుభవజ్ఞులు సమాజానికి మార్గనిర్దేశం చేస్తే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తండ్రి తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చి సమాజంతో కలిసిపోవాలని కోరుకుంటున్నానని చెప్పుతూ తన ఆడియోను ముగించారు. ఈ ఆడియో వైరల్ కావడంతో గణపతి లొంగుబాటు అంశం మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రభుత్వం లేదా భద్రతా సంస్థలు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »