విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం.. వివాహితపై అత్యాచారం, నిందితుడి కోసం గాలింపు

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న వివాహితను మాయమాటలతో ఏసీ బోగీకి తీసుకెళ్లిన గుర్తుతెలియని యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

Visakha Express Rape Incident
Visakha Express Rape Incident

విశాఖపట్నం నుంచి స్వగ్రామానికి వెళ్తున్న దంపతులపై అమానుష ఘటన చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన భార్యాభర్తలు ఉపాధి నిమిత్తం కొంతకాలంగా విశాఖపట్నంలో నివసిస్తున్నారు. ఈ నెల 26న స్వగ్రామానికి తిరిగి వెళ్లేందుకు విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ బోగీలో ప్రయాణం ప్రారంభించారు.

జనరల్ బోగీలో భారీ రద్దీ ఉండటాన్ని గమనించిన ఓ గుర్తుతెలియని యువకుడు బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. ఏసీ బోగీలో ఖాళీ ఉందని, అక్కడ సౌకర్యంగా ప్రయాణించవచ్చని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన మహిళను భర్త నుంచి వేరు చేసి ఏసీ కోచ్‌ వైపు తీసుకెళ్లాడు.

భ‌ర్తని టాయిలెట్ స‌మీపంలో కూర్చొపెట్టి..

ఈ క్రమంలో భర్తను టాయిలెట్ సమీపంలో కూర్చోబెట్టి, బాధితురాలిని ఏసీ కూపేలోకి తీసుకెళ్లిన నిందితుడు, అక్కడ ఎవరూ లేని సమయం చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం బాధితురాలు తీవ్ర ఆందోళనలో పడిపోయింది.

రైలు దిగిన తర్వాత జరిగిన విషయాన్ని భర్తకు వెల్లడించిన బాధితురాలు, వెంటనే అతనితో కలిసి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీస్‌స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఈ కేసును విచారణ కోసం విజయవాడ రైల్వే పోలీసులకు బదిలీ చేశారు.

సీసీ ఫుటేజ్ ప‌రిశీల‌న‌…

బాధితురాలిని వైద్య పరీక్షల కోసం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసును అత్యంత ప్రాధాన్యంతో తీసుకున్న పోలీసులు, రైల్వే పోలీసుల సహకారంతో నిందితుడిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ మరియు ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని అధికారులు తెలిపారు.

ఈ ఘటన రైల్వే ప్రయాణ భద్రతపై మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రయాణికులు అపరిచితుల మాటలను నమ్మకుండా జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.

Also read:

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »