దేశవ్యాప్తంగా మ్యూచువల్ ఫండ్లలో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) నూతన పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాలను ప్రకటించింది. ముంబైలో జరిగిన తన 31వ ఫౌండేషన్ డే సందర్భంగా ప్రతిష్టాత్మక ‘మ్యూచువల్ ఫండ్స్ సహీ హై’ ఆధ్వర్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఆర్థిక అవగాహనను పెంచడానికి, నమ్మకాన్ని బలోపేతం చేయడానికి , విస్తృత భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి యాంఫీ సంస్థ ఎన్ఐఎస్ఎం, సా-ధన్, పింకాథాన్‌లతో చేతులు కలిపి ‘భారత్ నివేష్ మేళా’ను ప్రారంభించింది.
ప్రధాన కార్యక్రమాలు , భాగస్వామ్యాలు:
మహిళలు, తొలిసారిగా పెట్టుబడి పెట్టేవారు, చిన్న పట్టణాలు , నగరాలలోని కుటుంబాలు, స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులు, సూక్ష్మ ఆర్థిక వర్గాలలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యమని యాంఫీ పేర్కొంది.
మ్యూచువల్ ఫండ్ పంపిణీ వ్యవస్థలో వృత్తి నైపుణ్యాలు , నైతిక ప్రమాణాలను బలోపేతం చేయడానికి యాంఫీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (NISM)తో చేతులు కలిపింది. దీని ద్వారా రాబోయే 12 నెలల్లో సుమారు 10,000 మంది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లకు (MFDs) శిక్షణ ఇవ్వనున్నారు.
స్వయం సహాయక సంఘాల సభ్యులు , సూక్ష్మ రుణగ్రహీతలలో అవగాహన పెంచేందుకు ఆర్బీఐ గుర్తింపు పొందిన ‘సా-ధన్’ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుని, ఐదు రాష్ట్రాల్లో 500 ఇన్వెస్టర్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లను నిర్వహించనున్నారు.
టైర్-2, టైర్-3 మార్కెట్లకు ఆర్థిక అవగాహనను తీసుకెళ్లేలా ‘భారత్ నివేష్ మేళా’ అనే ప్రత్యేక అనుభవపూర్వక పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమాన్ని ప్రకటించారు.
మహిళల్లో ఆర్థిక చైతన్యం పెంచేందుకు మిలింద్ సోమన్ నేతృత్వంలోని ‘పింకాథాన్’తో భాగస్వామ్యం ఏర్పటు చేసుకుని, 15 నగరాల్లో సిటీ మారథాన్ సిరీస్ , 52 నగరాల్లో డే కార్యక్రమాలలో అవగాహన కల్పించనున్నారు.
ఈ వేడుకల్లో సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే, సెబీ హోల్-టైమ్ మెంబర్ అమర్జీత్ సింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోజ్ కుమార్, యాంఫీ ఛైర్మన్ సందీప్ సిక్కా , చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ ఎన్.చలసాని తదితరులు పాల్గొన్నారు. భారతీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ పరిణామాన్ని వివరించే ‘యాంఫీ-క్రిసిల్ ఫ్యాక్ట్ బుక్ 2025-26’ తాజా ఎడిషన్‌ను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు.