భారత క్రీడల్లో నయా జోష్.. అదిరిపోయే స్పోర్ట్స్ సైన్స్ సెంటర్‌తో రంగంలోకి యాక్సిస్ బ్యాంక్!

భారతదేశ క్రీడా రంగాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు యాక్సిస్ బ్యాంక్ , గోస్పోర్ట్స్ ఫౌండేషన్ చేతులు కలిపాయి. ఈ రెండు సంస్థలు కలిసి బెంగళూరులో ‘ది పర్ఫార్మెన్స్ ఇన్‌స్టిట్యూట్’ (AGTPI) పేరుతో ఒక అత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి

భారతదేశ క్రీడా రంగాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు యాక్సిస్ బ్యాంక్ , గోస్పోర్ట్స్ ఫౌండేషన్ చేతులు కలిపాయి. ఈ రెండు సంస్థలు కలిసి బెంగళూరులో ‘ది పర్ఫార్మెన్స్ ఇన్‌స్టిట్యూట్’ (AGTPI) పేరుతో ఒక అత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి. స్పోర్ట్స్ సైన్స్, శాస్త్రీయ పరిశోధనలు , అథ్లెట్ల నైపుణ్యాల అభివృద్ధిని సమగ్రంగా అనుసంధానిస్తూ, భారత క్రీడల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. దేశంలోనే ఇలాంటి వినూత్న కార్యక్రమం చేపట్టడం ఇదే తొలిసారి.

బెంగళూరులోని అత్యాధునిక ‘సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్’ (CSE) లో ఈ AGTPI సంస్థ కార్యకలాపాలు సాగనున్నాయి. అథ్లెట్ల ప్రదర్శనను నిశితంగా పరిశీలించడం, వారి ప్రతిభను గుర్తించడం, స్పోర్ట్స్ సైన్స్ , మెడిసిన్ రంగాలలో దేశీయ సామర్థ్యాన్ని మెరుగుపరచడం , మన క్రీడాకారులపై ప్రత్యేక పరిశోధనలు చేయడంపై ఈ కేంద్రం దృష్టి సారిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ వ్యవస్థాపక భాగస్వామిగా తన సీఎస్ఆర్ (CSR) నిధుల ద్వారా ఈ కేంద్రం ఏర్పాటుకు తోడ్పాటునందిస్తుండగా, గోస్పోర్ట్స్ ఫౌండేషన్ దీని నిర్వహణ, కార్యక్రమాల అమలు , వ్యూహాత్మక భాగస్వామ్యాలను పర్యవేక్షిస్తుంది.

AGTPI మూడు ప్రధాన స్తంభాలు:

పీపుల్ (ప్రజలు/సిబ్బంది): శిక్షణ కార్యక్రమాలు, ఫెలోషిప్‌లు, మెంటార్‌షిప్ అవకాశాలు , వృత్తిపరమైన అభివృద్ధి మార్గాల ద్వారా క్రీడా రంగానికి అవసరమైన నిపుణులను తయారు చేయడం. ఇది వివిధ క్రీడా సమాఖ్యలు (ఫెడరేషన్లు), అకాడమీలు , హై-పర్ఫార్మెన్స్ కేంద్రాల్లో నిపుణుల కొరతను తీరుస్తుంది.

అనలిటిక్స్ (విశ్లేషణలు): అథ్లెట్ల పర్ఫార్మెన్స్ టెస్టింగ్, బయోమెకానిక్స్ విశ్లేషణ, రికవరీ మానిటరింగ్, గాయాల ముప్పుల అంచనా , డేటా ఆధారిత ప్రదర్శన ప్రణాళికలను అందించే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. వివిధ క్రీడలకు చెందిన భారతీయ అథ్లెట్ల ప్రదర్శనలపై ప్రత్యేక డేటాబేస్‌లను ఇది రూపొందిస్తుంది.

రీసెర్చ్ (పరిశోధన): అప్లైడ్ రీసెర్చ్, ఆవిష్కరణలు, పరిశ్రమలు , విశ్వవిద్యాలయాల సహకారంతో దేశీయ అవసరాలకు తగిన స్పోర్ట్స్ సైన్స్ పరిజ్ఞానాన్ని పెంపొందించడం. క్రీడాకారులకు అండగా ఉంటూనే, భారతదేశంలో స్పోర్ట్స్ సైన్స్ రంగ వృద్ధికి అవసరమైన ఆధారాలతో కూడిన పరిష్కారాలను కనుగొనడం దీని ముఖ్య ఉద్దేశ్యం.

నిపుణుల స్పందన:
యాక్సిస్ బ్యాంక్ గ్రూప్ హెడ్ విజయ్ ముల్బాగల్ మాట్లాడుతూ, భారతీయ అథ్లెట్ల అవసరాలకు తగినట్టుగా మన దేశంలోనే పటిష్టమైన స్పోర్ట్స్ సైన్స్ పునాది అవసరమని, విదేశీ డేటాపై ఆధారపడకుండా సొంతంగా బలమైన వ్యవస్థను సృష్టించేందుకు గోస్పోర్ట్స్ ఫౌండేషన్‌తో భాగస్వామి కావడం గర్వకారణమని తెలిపారు.

గోస్పోర్ట్స్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ నందన్ కామత్ స్పందిస్తూ, గొప్ప క్రీడాకారులు గొప్ప వ్యవస్థల నుండే వస్తారని, క్రీడారంగానికి బలమైన భవిష్యత్తును నిర్మించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే గోస్పోర్ట్స్ ఫౌండేషన్ సీఈఓ సౌగతో బెనర్జీ మాట్లాడుతూ, క్రీడాకారులు పతకాలు సాధించేలా సామర్థ్యాన్ని పెంపొందించే ఎన్నో కార్యక్రమాలను ఈ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ వ్యవస్థాపకుడు వివేక్ కుమార్ మాట్లాడుతూ, సీఎస్ఈ (CSE) లో ఈ సంస్థ ఏర్పాటుతో క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి వాతావరణం మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక మద్దతు , ఉమ్మడి నిబద్ధతతో కూడిన ఈ భాగస్వామ్యం, భవిష్యత్తులో మన అథ్లెట్ల ప్రదర్శనలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు.

About Author:

Vidya Burujukadi

కంటెంట్ రైటర్‌గా మన వార్త వెబ్ సైట్‌కి విద్య.బి పనిచేస్తున్నారు. ప్రధానంగా బిజినెస్ వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను ఆమె అందిస్తారు. విద్యకు తెలుగు మీడియా…

More About Author »