2026లో ‘టీమ్ ఇండియా’ అధికారిక రీటెయిల్ బ్యాంకింగ్ భాగస్వామిగా యస్ బ్యాంక్ కొనసాగింపు!

దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యస్ బ్యాంక్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) తో తన భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళుతోంది

ముంబై: దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన యస్ బ్యాంక్, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) తో తన భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళుతోంది. ఇందులో భాగంగా 2026లో జరగనున్న నాలుగు కీలక అంతర్జాతీయ క్రీడా టోర్నీలలో పాల్గొనే ‘టీమ్ ఇండియా’కు అధికారిక రీటెయిల్ బ్యాంకింగ్ భాగస్వామిగా మద్దతు ప్రకటిస్తున్నట్లు యస్ బ్యాంక్ వెల్లడించింది. గతంలో పారిస్ 2024 ఒలింపిక్స్ సమయంలోనూ టీమ్ ఇండియాకు బ్యాంకింగ్ భాగస్వామిగా వ్యవహరించిన అనుభవంతో, దేశీయ క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలనే తన నిబద్ధతను బ్యాంక్ మరోసారి చాటుకుంది.

రానున్న రోజుల్లో జరగబోయే నాలుగు ప్రధాన అంతర్జాతీయ పోటీలైన గ్లాస్గో (స్కాట్లాండ్) కామన్వెల్త్ గేమ్స్, ఐచి-నాగోయా (జపాన్) ఆసియన్ గేమ్స్, డకార్ (సెనెగల్) యూత్ ఒలింపిక్ గేమ్స్ , రియాద్ (సౌదీ అరేబియా) ఆసియన్ ఇండోర్ & మార్షల్ ఆర్ట్స్ గేమ్స్‌లో పాల్గొనే వందలాది మంది భారతీయ అథ్లెట్లకు ఈ భాగస్వామ్యం ద్వారా బ్యాంక్ అండగా నిలవనుంది. జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల నేపథ్యంలో భారత్-జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలపర్చడంలోనూ ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుంది.

యస్ బ్యాంక్ ఎండీ & సీఈఓ శ్రీ వినయ్ ఎమ్. టోన్సే మాట్లాడుతూ..
“2026లో నిర్వహించే నాలుగు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా వేదికలపై టీమ్ ఇండియాకు మద్దతు ఇస్తున్నందుకు గర్వపడుతున్నాము. క్రీడలు సమాజంలో యువతను ఉత్తేజపర్చడంతో పాటు దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేలా ప్రేరేపిస్తాయి. ప్రపంచ వేదికలపై మన త్రివర్ణ పతాకం రెపరెపలాడించేందుకు శ్రమిస్తున్న మన అథ్లెట్లకు అండగా నిలవడం మాకెంతో సంతోషాన్నిస్తోంది” అని పేర్కొన్నారు.

ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పి.టి. ఉష మాట్లాడుతూ..
“ఐఓఏతో యస్ బ్యాంక్ తన దీర్ఘకాలిక ప్రయాణాన్ని కొనసాగించడం అభినందనీయం. పారిస్ ఒలింపిక్స్ స్ఫూర్తితో ఈ ఏడాది జరగనున్న నాలుగు ప్రధాన టోర్నీలలోనూ మన క్రీడాకారులకు రీటెయిల్ బ్యాంకింగ్ భాగస్వామిగా యస్ బ్యాంక్ తోడ్పాటునందించడం సంతోషం. ‘వికసిత భారత్’ లక్ష్య సాధనలో క్రీడలను అగ్రగామిగా నిలపడానికి ఇలాంటి భాగస్వామ్యాలు ఎంతగానో దోహదపడతాయి” అని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ఒప్పందంలో భాగంగా రాబోయే ఆరు నెలల్లో యూత్ ఒలింపిక్స్, ఆసియన్ ఇండోర్ అండ్ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ వంటి అనేక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే యువ క్రీడాకారులకు యస్ బ్యాంక్ ప్రోత్సాహం అందించనుంది. క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తూ, దేశ యువతకు సరికొత్త అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ఈ భాగస్వామ్యం కొనసాగనుంది.

About Author:

Vidya Burujukadi

కంటెంట్ రైటర్‌గా మన వార్త వెబ్ సైట్‌కి విద్య.బి పనిచేస్తున్నారు. ప్రధానంగా బిజినెస్ వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను ఆమె అందిస్తారు. విద్యకు తెలుగు మీడియా…

More About Author »