తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సాంగ్స్‌తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న గాయని మంగ్లీ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. ఆమెతో పాటు దర్శకుడు వేణు ఊడుగులపై కూడా కేసు నమోదవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు వివరాల ప్రకారం, ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 351(2), 352 కింద కేసు నమోదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ న్యాయవాది సుబ్బారావు ఈ ఫిర్యాదు చేశారు.
నమ్మించి మోసం..
పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైన సమాచారం ప్రకారం, మంగ్లీ, ఆమె సోదరుడు శివ, వేణు ఊడుగుల మరియు మరికొంత మంది కలిసి సుమారు 100 మంది నుంచి భారీగా నిధులు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇస్తామని నమ్మించి ఈ డబ్బులు తీసుకున్నట్లు బాధితులు తెలిపారు.
అయితే, గడిచిన కాలంలో ఎటువంటి లాభాలు ఇవ్వకపోగా, పెట్టుబడిగా ఇచ్చిన అసలు డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో బాధితులు న్యాయం కోసం న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు.
కేసు నమోదు..
ఈ వ్యవహారంలో న్యాయవాది జోక్యం చేసుకోవడంతో వివాదం మరింత ముదిరింది. బాధితులకు చెల్లించాల్సిన డబ్బుల విషయంలో మంగ్లీ, ఆమె బృందాన్ని నిలదీయగా, తనపై బెదిరింపులు వచ్చాయని సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫోన్ ద్వారా మంగ్లీ, ఆమె సోదరుడు శివ, వేణు ఊడుగుల కలిసి తనను తీవ్రంగా బెదిరించారని, రోడ్డు ప్రమాదం చేసి చంపేస్తామని హెచ్చరించారని న్యాయవాది ఆరోపించారు. ఈ బెదిరింపుల వ్యవహారంలో వేణు ఊడుగుల పాత్ర కూడా ఉందని ఆయన పోలీసులకు తెలిపారు.
ఈ నేపథ్యంలో పెట్టుబడుల పేరుతో మోసం చేయడం, అలాగే న్యాయవాదిని బెదిరించడం వంటి ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఆరోపణలపై మంగ్లీ, వేణు ఊడుగుల నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.
సంగీత రంగంలో మంచి పేరు తెచ్చుకున్న మంగ్లీపై వచ్చిన ఈ ఆరోపణలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ కేసులో నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
Also Read:


