Dilsukhnagar Traffic Jam: దుర్గామాత నిమజ్జనం.. గంటల తరబడి ట్రాఫిక్ జామ్!

Dilsukhnagar Traffic Jam: హైదరాబాద్‌లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో దిల్సుఖ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆర్టీసీ బస్సులను దారి మళ్లించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Dilsukhnagar Traffic Jam
Dilsukhnagar Traffic Jam

హైదరాబాద్‌లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో దిల్‌సుఖ్‌నగర్ వైపు భారీ రద్దీ ఏర్పడింది. నగరంలోకి వెళ్లాల్సిన ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను దిల్‌సుఖ్‌నగర్ వద్దే మళ్లించడంతో చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్ మార్గాల్లో వాహనాలు నిలిచిపోయాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులు ముందుకు వెళ్లకపోవడంతో కుటుంబాలతో, చిన్న పిల్లలతో, భారీ లగేజీతో వచ్చిన పలువురు దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడ కూడా రద్దీ పెరిగింది.

 చైతన్యపురి నుంచి దిల్‌సుఖ్‌నగర్ వరకు రద్దీ

ట్యాంక్‌బండ్ వైపు దుర్గామాత విగ్రహాల వాహనాలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో వాటి వెనుక ఇతర వాహనాలు కూడా భారీగా చేరాయి. దీంతో నగరంలోకి వస్తున్న వాహనాలపై ప్రభావం పడింది.

చైతన్యపురి నుంచి దిల్‌సుఖ్‌నగర్ చేరుకునేందుకు సాధారణ సమయం కంటే ఎక్కువ సమయం పట్టిందని ప్రయాణికులు తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్ దాటిన తర్వాత కూడా ఎల్‌బీనగర్ వైపు బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి.

 దిల్‌సుఖ్‌నగర్ వద్ద బస్సులకు మళ్లింపు

ఎంజీబీఎస్ వైపు వెళ్లాల్సిన ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను దిల్‌సుఖ్‌నగర్ వద్దే నిలిపి యూటర్న్ చేయించారు. దీంతో నగరంలోని మధ్య ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు అక్కడే దిగాల్సి వచ్చింది.

చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులు, భారీ లగేజీతో వచ్చిన వారు బస్సు దిగిన తర్వాత ప్రత్యామ్నాయ రవాణా కోసం ఇబ్బందులు పడ్డారు. ఉదయం వేళ కావడంతో ఆటోలు, క్యాబ్‌లు, ర్యాపిడో వంటి సేవలు వెంటనే అందుబాటులో లేకపోవడంతో కొంతసేపు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది.

 మెట్రో స్టేషన్‌లోనూ పెరిగిన రద్దీ

బస్సులు ముందుకు వెళ్లకపోవడంతో ప్రయాణికులు దిల్‌సుఖ్‌నగర్ మెట్రో స్టేషన్‌కు తరలివచ్చారు. దీంతో స్టేషన్ ప్రవేశ ద్వారాల వద్ద, లోపల కూడా రద్దీ పెరిగింది.

బస్సుల నుంచి దిగిన ప్రయాణికులు మెట్రో ద్వారా తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ముందుగానే ట్రాఫిక్ మళ్లింపుల సమాచారం ఉంటే తమ ప్రయాణాన్ని ప్రత్యామ్నాయంగా ప్లాన్ చేసుకునేవారమని కొందరు ప్రయాణికులు తెలిపారు.

 మియాపూర్, కూకట్‌పల్లి బస్సులకు ఉప్పల్ మార్గం

దిల్‌సుఖ్‌నగర్ నుంచి మియాపూర్, కూకట్‌పల్లి వైపు వెళ్లాల్సిన బస్సులను నగరంలోని రద్దీ ప్రాంతాల్లోకి పంపకుండా ఉప్పల్ వైపు మళ్లించారు. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే బస్సులకు ప్రత్యామ్నాయ మార్గాన్ని పోలీసులు సూచించారు.

మరోవైపు ఎంజీబీఎస్ వైపు వెళ్లే బస్సులకు మాత్రం దిల్‌సుఖ్‌నగర్ వద్దే మళ్లింపు అమలు చేశారు.

 ట్యాంక్‌బండ్ వైపు సాధారణ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలు

ట్యాంక్‌బండ్ వైపు వెళ్లే సాధారణ వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్, లోయర్ ట్యాంక్‌బండ్ మార్గాల మీదుగా మళ్లించారు. నిమజ్జన వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు ఈ మళ్లింపులు చేపట్టారు.

ప్రధాన రద్దీని పోలీసులు క్రమంగా తొలగించినప్పటికీ, ఎల్‌బీనగర్ పరిసరాల్లో నిలిచిపోయిన వాహనాలు దశలవారీగా నగరంలోకి రావడంతో పూర్తిస్థాయి సాధారణ పరిస్థితి ఏర్పడటానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »