త్రివిక్రమ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఒక మూవీ రాబోతుంది. భారీ మైథలాజికల్, హెవీ బడ్జెట్, వీఎఫ్ఎక్స్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ఎన్ని సార్లు పోస్ట్‌పోన్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌పోన్ ట్రెండ్‌పై చర్చ జరుగుతోంది.
మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం.. ఆ తర్వాత దాన్ని పోస్ట్‌పోన్ చేయడం. రీసెంట్‌గా వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్‌లో ‘ఆదర్శ కుటుంబం’ (AK 47) సినిమా అక్టోబర్ 9న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఆ సినిమా అక్టోబర్ 9న రిలీజ్ కావడం లేదు.
ఇంకొంచెం టైమ్ వెయిట్ చేయాలని నాగవంశీ గారు ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారు. మూవీ పోస్ట్‌పోన్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. అయితే కొత్త రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. సినిమా ఇంకా రెడీ అవ్వలేదని, బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి మరింత సమయం తీసుకోవాలని టీమ్ నిర్ణయించుకుందని చెప్పారు.
పోస్ట్‌పోన్ చేయడం ప్రొడక్షన్ హౌస్ ఇష్టం. ఎన్ని సార్లు పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు.. వాళ్ల డబ్బులు వాళ్ల ఇష్టం. కానీ అసలు ప్రశ్న ఏంటంటే.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం ఎందుకు? అనౌన్స్ చేసిన రోజున సినిమాను రిలీజ్ చేయకపోవడం ఎందుకు?
యాక్చువల్‌గా సినిమా రిలీజ్ కావాల్సిన డేట్‌కు ముందే ఇంటర్వ్యూస్ చేశారు, చిన్న చిన్న వీడియోస్ రిలీజ్ చేశారు, టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఇంకా కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుందనగా పోస్ట్‌పోన్ చేశారు. ఇప్పుడు ఇది ఒక్క సినిమా సమస్యగా కాకుండా ఇండస్ట్రీ ప్రాబ్లమ్‌లా మారుతోందనే చర్చ జరుగుతోంది.
పెద్ద సినిమాలు పోస్ట్‌పోన్ అయితే అసలు సమస్య ఇదే..
2026లో చూసుకుంటే పోస్ట్‌పోన్ అనేది చాలా సాధారణమైన విషయం లాగా మారిపోయింది. ‘పారడైజ్’ చాలా సార్లు పోస్ట్‌పోన్ అయింది. ‘మా ఇంటి బంగారం’ సినిమా కూడా పోస్ట్‌పోన్ అయింది. అఖిల్ అక్కినేని ‘లెనిన్’ సినిమా కూడా పోస్ట్‌పోన్ అయింది. ప్రశాంత్ నీల్ గారు ప్రెజెంట్ చేసిన ‘418’ మూవీ కూడా పోస్ట్‌పోన్ అయింది. ఇప్పుడు లేటెస్ట్ ఎంట్రీగా ‘ ‘ఆదర్శ కుటుంబం’ (AK 47) ’ వచ్చింది.
ఒక చిన్న మూవీ పోస్ట్‌పోన్ అయితే పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. కానీ ఒక పెద్ద సినిమా పోస్ట్‌పోన్ అయితే మొత్తం రిలీజ్ క్యాలెండర్ డిస్టర్బ్ అయిపోతుంది.
ఎందుకంటే పెద్ద సినిమా పోస్ట్‌పోన్ అయి వేరే డేట్‌కి వస్తుంది. ఆ డేట్‌ను ఇప్పటికే ఒక చిన్న సినిమా ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. ఎన్నో హోప్స్‌తో తమ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటారు. కానీ పెద్ద సినిమా అదే డేట్‌కు వస్తే థియేటర్స్ దొరకవు, జనాలు తమ సినిమాకు రారు అనే కారణాలతో ఆ చిన్న సినిమాను మళ్లీ పోస్ట్‌పోన్ చేసుకోవాల్సి వస్తుంది.
మళ్లీ పోస్ట్‌పోన్ చేస్తే అప్పుల మీద అప్పులు పెరిగిపోతుంటాయి. చాలా మంది ప్రొడ్యూసర్స్ ఫైనాన్షియల్స్ దగ్గర నుంచి వడ్డీకి డబ్బులు తీసుకుని సినిమాలు చేస్తుంటారు.
ఒక బిగ్ మూవీకి ఫ్యాన్స్ ఉంటారు, ఓటీటీ డీల్స్ ఉంటాయి, ఒక యాంటిసిపేషన్ ఉంటుంది. ఒక పెద్ద సినిమా వస్తుందంటే మొత్తం ఎకోసిస్టమ్ దాని కోసం వెయిట్ చేస్తుంది. కానీ చిన్న సినిమాకు మాత్రం కరెక్ట్ డేట్, కరెక్ట్ పబ్లిసిటీ, కరెక్ట్ థియేటర్స్ అన్నీ కలిసి రావాలి. ఒక వారం పోస్ట్‌పోన్ అయినా ఈక్వేషన్ మొత్తం మారిపోతుంది.
ఆడియన్స్ ఇంట్రెస్ట్ కూడా తగ్గుతుంది
సినిమా పోస్ట్‌పోన్ అయితే ప్రొడ్యూసర్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్ మాత్రమే ఎఫెక్ట్ అవ్వరు. ఆడియన్స్‌లో కూడా ఆ సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్ తగ్గుతుంది.
‘ఏంట్రా బాబు.. ఎన్ని సార్లు పోస్ట్‌పోన్ అవుతుంది?’ అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో వస్తుంది. సినిమా గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా తగ్గిపోతుంది. అదే సినిమా పదేపదే పోస్ట్‌పోన్ అయితే సినిమాలో స్టఫ్ లేదేమో అనే అభిప్రాయం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.
హాలీవుడ్ సినిమాలు చాలా రేర్‌గా పోస్ట్‌పోన్ అవుతాయి. చాలా ముందుగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. ఆ డేట్‌కి సినిమాను రిలీజ్ చేయడానికి చాలా పక్కాగా ప్లాన్ చేస్తారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ముందుగానే ఓపెన్ అవుతాయి. ప్రతి విషయాన్ని చాలా మెటిక్యులస్‌గా ప్లాన్ చేస్తారు.
సినిమా రెడీ కాకముందే రిలీజ్ డేట్ ఎందుకు?
‘ఆదర్శ కుటుంబం’ విషయానికి వస్తే ఇది ఏదో భారీ వరల్డ్ బిల్డింగ్, హెవీ బడ్జెట్, భారీ వీఎఫ్ఎక్స్‌తో కూడుకున్న సినిమా కాదు. సినిమా ఇంకా రెడీ కాకపోవడం కంటే సరైన బజ్ లేకపోవడం వల్ల పోస్ట్‌పోన్ చేస్తున్నారనే టాక్ కూడా ఉంది.
అయితే రూమర్స్‌ను పక్కన పెడితే.. నాగవంశీ గారు మాత్రం అన్‌ఫినిష్డ్ ప్రొడక్ట్ రిలీజ్ చేయాలని లేదని, మళ్లీ ప్రేక్షకుల నుంచి విమర్శలు రాకుండా చాలా కేర్ తీసుకుని సినిమా పూర్తిగా రెడీ అయిన తర్వాత రిలీజ్ చేయాలని అనుకుంటున్నామని చెప్పారు.
అదే నిజమైతే సినిమా పూర్తిగా రెడీ అయిన తర్వాతే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే ఇంకా బెటర్ కదా అనే ప్రశ్న కూడా వస్తోంది.
సినిమా పూర్తిగా ఫినిష్ చేసి, ఇక దీనికంటే ఇంకా చెక్కలేం అనే స్థాయిలో ప్రొడక్ట్‌పై నమ్మకం వచ్చిన తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే బాగుంటుంది. అలా చేస్తే పబ్లిసిటీ ఖర్చులు, ఇతర ఎక్స్‌ట్రా ఖర్చులు కూడా తగ్గుతాయి.
ఎందుకంటే ఇప్పుడు పబ్లిసిటీ చేసేశారు. సినిమా పోస్ట్‌పోన్ అయింది. మళ్లీ కొత్త డేట్‌కి పబ్లిసిటీ చేయాలి. అంటే నిర్మాతలకు అదనపు ఖర్చే.
ఇది కేవలం ‘AK 47’ సినిమాకు మాత్రమే కాదు. ఇలా సినిమాలను పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తున్న మేకర్స్ అందరూ దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఇక కొన్ని సినిమాలు వేరే సినిమాల కథలు, కంటెంట్‌తో క్లాష్ అవ్వడం వల్ల కూడా పోస్ట్‌పోన్ అవుతాయి. కాబట్టి మేకర్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రైటర్స్.. వేరే సినిమాలతో క్లాష్ కాకుండా తమ కంటెంట్‌ను ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచిది. లేదంటే ఒక సినిమా ముందుగా రిలీజ్ అయి, అందులోని కంటెంట్‌తో తమ సినిమా పోలికలు కనిపిస్తే మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. దాంతో సినిమా అసలు ఎసెన్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది.
మొత్తానికి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌పోన్ ట్రెండ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే ముందు మేకర్స్ పూర్తిగా ఆలోచించి, సినిమా రెడీ అయిన తర్వాతే డేట్ ప్రకటిస్తే అందరికీ మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


