రూ.7,280 కోట్ల పథకంలో ‘మిడ్‌వెస్ట్ ఎనర్జీ’ సత్తా.. హైదరాబాద్ కేంద్రంగా అరుదైన అయస్కాంతాల తయారీ!

రూ.7,280 కోట్ల పథకంలో ‘మిడ్‌వెస్ట్ ఎనర్జీ’ సత్తా.. హైదరాబాద్ కేంద్రంగా అరుదైన అయస్కాంతాల తయారీ!

భారతదేశంలో ‘సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్’ (REPM) తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రూ.7,280 కోట్ల ప్రతిష్ఠాత్మక పథకంలో ‘మిడ్‌వెస్ట్ ఎనర్జీ లిమిటెడ్’ (Midwest Energy Limited) సత్తా చాటింది. కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిర్వహించిన బిడ్డింగ్‌లో ఈ సంస్థ విజయవంతమైన బిడ్డర్‌గా నిలిచి, లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LOI) అందుకుంది. దేశీయంగా అరుదైన ఖనిజ అయస్కాంతాల తయారీ రంగంలో తన ఉనికిని బలోపేతం చేసుకునే దిశగా కంపెనీకి ఇది ఒక కీలక ముందడుగు.

నిబంధనల వివరాలు..
ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ప్రకారం.. మిడ్‌వెస్ట్ ఎనర్జీ సంస్థ ఏడాదికి 1,200 మెట్రిక్ టన్నుల (MTPA) ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనుంది. ఇందుకు సంబంధించి కంపెనీ కిలోకు రూ.505.05 సేల్స్ ఇన్సెంటివ్ రేటును కోట్ చేసింది. పథకం నిబంధనల ప్రకారం, ఎల్‌ఓఐ అందుకున్న 90 రోజుల్లోగా సంస్థ రూ.40 కోట్ల పెర్ఫార్మెన్స్ సెక్యూరిటీని సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత షరతులను పూర్తి చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సంస్థకు ‘లెటర్ ఆఫ్ అవార్డ్’ను జారీ చేస్తుంది.

హైదరాబాద్‌లో రూ.250 కోట్లతో భారీ ప్లాంట్..
తయారీ రంగ విస్తరణలో భాగంగా మిడ్‌వెస్ట్ ఎనర్జీ ఇప్పటికే హైదరాబాద్‌లో రూ.250 కోట్ల వ్యయంతో రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఏడాదికి 500 టన్నుల (TPA) ప్రారంభ సామర్థ్యం కలిగిన మొదటి దశ (Phase-I) ప్లాంట్ ప్రస్తుతం కమిషనింగ్ దశలో ఉంది. 2027 చివరి నాటికి తమ మొత్తం ఉత్పత్తి సామర్థ్యాన్ని 1,500 మెట్రిక్ టన్నులకు (MTPA) పెంచే లక్ష్యంతో సంస్థ పనిచేస్తోంది.

స్వయం సమృద్ధిపై సీఈఓ స్పందన..
విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయంగా బలమైన సరఫరా వ్యవస్థను నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ ఆర్‌ఈపీఎం (REPM) పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పరిణామంపై మిడ్‌వెస్ట్ ఎనర్జీ హోల్-టైమ్ డైరెక్టర్, సీఈఓ సౌమ్య కొల్లారెడ్డి స్పందిస్తూ.. ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ తమ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్లాంట్ కమిషనింగ్ దశలో ఉన్నందున, కీలక ముడిసరుకుల విషయంలో భారత్‌ను స్వయం సమృద్ధిగా మార్చేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనం, ఇతర ఆధునిక పారిశ్రామిక రంగాలలో దీర్ఘకాలికంగా భారీ అవకాశాలు ఉన్నాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ అయస్కాంతాల ప్రాముఖ్యత ఏమిటి?
రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్, ముఖ్యంగా సింటర్డ్ నియోడిమియం-ఐరన్-బోరాన్ (NdFeB) అయస్కాంతాలను ఎలక్ట్రిక్ వాహనాల (EV) మోటార్లు, విండ్ టర్బైన్‌లు, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ , రక్షణ రంగాలలో అత్యంత కీలక విడిభాగాలుగా ఉపయోగిస్తారు. తయారీ మౌలిక సదుపాయాల కల్పన, సామర్థ్య విస్తరణ ద్వారా భారతదేశ తయారీ రంగ లక్ష్యాలకు మద్దతునివ్వాలని మిడ్‌వెస్ట్ ఎనర్జీ లక్ష్యంగా పెట్టుకుంది.

About Author:

Vidya Burujukadi

కంటెంట్ రైటర్‌గా మన వార్త వెబ్ సైట్‌కి విద్య.బి పనిచేస్తున్నారు. ప్రధానంగా బిజినెస్ వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను ఆమె అందిస్తారు. విద్యకు తెలుగు మీడియా…

More About Author »